Minister Lokesh: టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తో మంత్రి నారా లోకేశ్ సోమవారం ముంబయిలో భేటీ అయ్యారు. ఈ భేటీలో టాటా గ్రూప్స్ లో పలు కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో ఈ నెలలో జరిగే టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు.
టాటా పవర్ రెన్యూవబుల్స్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని మంత్రి లోకేశ్ కోరారు. రూఫ్‌టాప్ సోలార్ అభివృద్ధి చేసే ప్రక్రియలో ప్రభుత్వంతో కలిసి పనిచేసే మార్గాన్ని అన్వేషించాలన్నారు. రాష్ట్రంలో సెల్, మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
‘విశాఖపట్నంలో టాటా ఎల్క్సీ రీజనల్ ఆఫీస్/ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, తూర్పుతీరంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించండి. ఏపీలో సాఫ్ట్ వేర్ డిఫైండ్ వెహికిల్స్, అటానమస్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీస్, UAV, Gen AI ఆధారిత మొబిలిటీ లేదా మెడ్‌టెక్ ఇన్నోవేషన్‌ల వంటి రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించండి’ అని టాటా కంపెనీ ప్రతినిధులను లోకేశ్ కోరారు.
టాటా ఆటోకాంప్ ఆధ్వర్యంలో శ్రీసిటీలో ఎలక్ట్రిక్ వాహన భాగాలు, అధునాతన కంపోజిట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు స్థాపించే అవకాశాలను అన్వేషించాలని మంత్రి లోకేశ్ టాటా గ్రూప్స్ ఛైర్మన్ ను కోరారు. ఇందుకు అవసరమైన భూమి, ప్లగ్ అండ్ ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. పెట్టుబడి పరిమాణాన్ని ఆధారంగా తీసుకుని ఈవీ, ఎలక్ట్రానిక్ భాగాల తయారీ విధానంలో ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందిని చెప్పారు.
‘శ్రీసిటీలో ఇంజినీరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి అవకాశాలను పరిశీలించండి. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ నేతృత్వంలో ఏపీలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించిన ఉత్పత్తి యూనిట్‌ను స్థాపించడానికి అవకాశాలను అన్వేషించండి. రక్షణ, భద్రతా వ్యవస్థల రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటులో ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించండి. టాటా ఎలక్ట్రానిక్స్ ఏపీలో OSAT సదుపాయం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించండి. ఇందుకోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ కింద అందిస్తాం’ – మంత్రి లోకేశ్
మాన్యుఫాక్చరింగ్ ఇంజినీరింగ్/టెక్నాలజీ రంగాల్లో కోర్సులు రూపొందించడం లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనలో ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని టాటా గ్రూప్ ను మంత్రి లోకేశ్ కోరారు. టాటా కెమికల్స్ మచిలీపట్నం లేదా మూలపేట పోర్టులకు సమీపంలోని ఉప్పు భూముల వద్ద సోడా యాష్ ఉత్పత్తి యూనిట్ స్థాపనకు అవకాశాలను అన్వేషించాలని కోరారు. ఎస్టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నం డేటా సిటీ ప్రాంతంలో AI రెడీ డేటా సెంటర్ క్యాంపస్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేశ్ విజ్ఞప్తిచేశారు.