Kurupam Incident: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతి బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గురుకులంలోని విద్యార్థినులు అనారోగ్యానికి గురైన విషయం తెలిసి బాధపడ్డానన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నానని చెప్పారు. అక్కడి పిల్లలు కామెర్లు, సంబంధిత లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఇద్దరు విద్యార్థినులు వేర్వేరు రోజుల్లో ఇంటి దగ్గర ఒకరు, మరొకరు ఆసుపత్రిలో మృతి చెందినట్లు అధికారులు వివరించారన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. విశాఖపట్నం కేజీహెచ్ లో 37 మంది విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
అదనపు వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకొని నిరంతరం బాలికల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు. త్వరలో కురుపాం వెళ్లి గురుకులంలో పరిస్థితిని పరిశీలిస్తానన్నారు.
కురుపాం గిరిజన బాలికల గురుకులంలో విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పార్వతీపురం ఆసుపత్రిలో, విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసి మెరుగైన చికిత్స కు ఆదేశాలు ఇచ్చారు.
కూటమి ప్రభుత్వ అలసత్వం కారణంగా పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగడం వలన పచ్చకామెర్లు సోకి 4 రోజుల వ్యవధిలో ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పదుల సంఖ్యలో బాలికుల తీవ్ర అనారోగ్యం పాలయ్యారన్నారు.
‘611 మంది చదువుతున్న స్కూల్ లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా? ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? గిరిజన బాలికలు, పేద పిల్లలు అంటే అంత చులకనా? ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించినా మీరు కళ్లుమూసుకున్నమాట వాస్తవం కాదా? ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే’ అని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు.
పేదల తలరాతను మార్చేది చదువేనని నమ్మి, అమ్మ ఒడి సహా ఎన్నో సంస్కరణలు తెస్తూ నాడు-నేడు పనుల ద్వారా ఆ స్కూళ్లను దేవాలయాలుగా మార్చామని వైఎస్ జగన్ అన్నారు. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, డిజిటల్ ప్యానెళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు సహా 11 రకాల మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా రక్షిత తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు పెట్టామని చెప్పారు.
Also Read: CM Chandrababu: అనంతపురం, కురుపాం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా.. నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు
“ఆర్వోప్లాంట్లు రిపేర్ కు వస్తే వాటిని పట్టించుకునే నాథుడే లేడు. హాస్టళ్లలో విషాహారం కారణంగా మరణాలు సంభవించడమో, ఆస్పత్రుల పాలవడమో పరిపాటిగా మారింది. ఇలాంటి నిర్లక్ష్యమే ఇవాళ కురుపాం గురుకుల పాఠశాలలో గిరిజన బాలికల ఉసురు తీసింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా కళ్లు తెరిచి, వెంటనే పిల్లల ఆరోగ్యం పట్ల, బడుల్లో వసతులపట్ల శ్రద్ధపెట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తున్నాను” -వైఎస్ జగన్