Conaseema: కోనసీమ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది పచ్చని కొబ్బరి చెట్లు. రోడ్డు.. ఆ రోడ్డుకు ఇరువైపులా ఉండే కోబ్బరి చెట్లు.. వాటి మధ్యన ప్రయాణం.. మనసుకు ఓ ప్రశాంతత. కానీ కోనసీమలో ఇప్పుడు ఆ కొబ్బరి చెట్లు కనుమరుగువతున్నాయి. కన్నకొడుకులా పెంచుకున్న ఆ కొబ్బరి చెట్లు వాడిపోతున్నాయి.. ఆ తర్వాత కూలిపోతున్నాయి. దీంతో ఆ రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. అసలింతకీ.. కొబ్బరి చెట్లు ఎందుకు కూలుతున్నాయి? దానికి కారణం ఏంటి? అసలేం జరుగుతోంది?
సముద్రపు నీరు చేరడంతో కుళ్లిపోతున్న కొబ్బరి చెట్లు..
కోనసీమలోని కొబ్బరి చెట్లు చనిపోతుండటంతో ఇప్పుడు ప్రత్యక్షంగా 10 గ్రామాలు.. పరోక్షంగా 20 గ్రాముల రైతులు నష్టపోతున్నారు. దీనికి కారణం శంకర గుప్తం డ్రైనేజీ. వైనతేయ నదీ పాయలో సముద్రం పోటు సమయంలో వచ్చిన నీరు శంకర గుప్తం డ్రైనేజీ ద్వారా చింతలపూడి గ్రామం వరకు వెనక్కి రావడంతో కొబ్బరి తోటలలో ఆ సముద్రపు నీరు నిలిచిపోతుంది. శంకరగుప్తం మేజర్ డ్రైనేజీ వైనతేయ నది లింక్ ఉంది. శంకరగుప్తం డ్రైయిన్‌కి ప్రధానంగా నాలుగు లింక్ డ్రైనేజీలు ఉన్నాయి. ఒకటి అంతర్వేది, రెండు వేప చెట్టు డ్రెయిన్, పోలవరం డ్రెయిన్, నాలుగు ముత్యాల పేట డ్రెయిన్. ఈ నాలుగు డ్రెయిన్‌ల నుంచి వచ్చే నీరు వల్ల గ్రామాలు దెబ్బతింటున్నాయి. దీనికి అధ్యయనం చేయడానికి హార్టికల్చర్, అగ్రికల్చర్, బి డబ్ల్యూ టి, స్కాలర్స్, ఫిలాసఫర్స్, సైంటిస్టులు వచ్చారు.. వచ్చారు చూసారు వెళ్లారు గాని ఎవ్వరు నివేదికలు ఇవ్వలేదంటున్నారు గ్రామస్తులు.
ONGC రిగ్గుల వేస్ట్ ఆయిల్ సముద్రంలో కలుస్తోందని ఆరోపణలు..
ONGC రిగ్గులు గ్రామాల చుట్టుపక్కల ఎక్కువగా ఉండటంతో వాటి నుండి వచ్చే వేస్ట్ ఆయిల్ అంత సముద్రంలోకి విడిచి పెడుతున్నారని చెబుతున్నారు. సముద్రపు నీరు పూర్తిగా కలుషితమవుతుందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇకపై తాము ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెబుతున్నారు. కోనసీమ నుంచి ఆర్మీలో పని చేస్తూ దేశానికి సేవలందిస్తున్నారు రాజేష్. మరో ఏడాదిలో రిటైర్‌మెంట్ తీసుకుని స్వస్థలానికి వచ్చి తన కొబ్బరి తోట చూసుకుందామనుకునేది ఆయన ఆలోచన. కానీ ఇప్పుడు తన తోటకు వస్తే దుఃఖం వస్తుందంటున్నారు. నేల కూలిన కొబ్బరి చెట్లను చూసి గుండె బరువెక్కుతుందని ఆవేదన చెందుతున్నారు.
కొబ్బరిపై ఆధారపడ్డ పరిశ్రమలు మూతపడ్డాయన్న రైతులు..
కోనసీమ కొబ్బరి రైతులు ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని 2014 ఇప్పటివరకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు అదే గ్రామానికి చెందిన దొరబాబు అనే వ్యక్తి. కొబ్బరికాయలు ఎక్స్‌పోర్ట్ చేయడం.. కొబ్బరి తాడును తయారు చేయడం.. ఇలా అనేక పరిశ్రమలు ఇప్పుడు ఈ ప్రాంతంలో మూతపడ్డాయంటున్నారు. ఆదాయం లేక చాలా మంది పూర్తిగా గ్రామాన్ని వదిలి వలస వెళ్లే పరిస్తితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన. రాజోలు నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ONGC రిగ్గులు ఉన్నాయి. వీటి నుంచి వచ్చిన వ్యర్థ ఆయిల్‌ని సముద్రంలోకి వదులుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం సముద్ర నీరు కూడా పూర్తిస్థాయిలో రంగు మారిపోయిందని.. విషపూరితంగా మారిపోయిందంటున్నారు. ఆ నీరే కొబ్బరి చెట్ల మధ్యలోకి రావడం వల్లే పూర్తిస్థాయిలో కుళ్ళిపోతున్నాయని చెబుతున్నారు.
Also Read: యముడు లీవ్‌లో ఉన్నాడు.. లారీ గుద్దినా బతికిపోయాడు, ఇదిగో వీడియో
న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్న రైతులు
కోనసీమ కొబ్బరి చెట్ల వినాశనానికి కారణమవుతున్న శంకరగుప్తం డ్రైయిన్‌కి సంబంధించి పూర్తిగా విశ్లేషణ చేపడితే.. ఇది మొత్తం 22 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 1990లలోనే ఈ కాలువ నిర్మాణానికి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే 2014లో చేపట్టిన డ్రెడ్జింగ్ పనులు ఇప్పుడు తమకు శాపాలుగా మారాయి అంటున్నారు ఈ ప్రాంతవాసులు. 16 కిలోమీటర్లు డ్రెడ్జింగ్ చేయాల్సింది.. 8 కిలోమీటర్లు చేసి వదిలేశారని చెబుతున్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో చర్యలు చేపడితే సమస్య పరిష్కారమవుతుందని.. లేదంటే తాము ఇక పోరు బాట పడతామని చెబుతున్నారు.