Today Gold Price: బంగారం భగ భగమంటుంది. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ.. ధరలు పైపైకి దూసుకెళుతూనే ఉన్నాయి. ఇప్పట్లో దిగొచ్చే సూచనలు కనపించడం లేదు. పసిడి కొనాలన్నా ఆలోచనా చేయాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1.30 లక్షలు దాటింది. ఓ వైపు కేజీ వెండి ధర రూ.1,57,400 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,20,770 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,10,700 ఉంది.
అమెరికా షట్‌డౌన్ ప్రభావం
బంగారం ధరలు ఇలా పెరగడానికి గ్లోబల్ ఆర్థిక పరిణామాలే కారణమని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ సంక్షోభం, డాలర్ బలహీనత, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి వంటి అంశాలు బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చేశాయి. పెట్టుబడిదారులు షేర్ల మార్కెట్ నుంచి నిధులను ఉపసంహరించి బంగారంలో పెట్టడం వల్ల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
దేశీయ మార్కెట్‌లో ప్రభావం
అంతర్జాతీయ బంగారం ధరలు పెరగడంతో భారత మార్కెట్‌లో కూడా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో బంగారం ధరలు చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి చేరాయి.
వెండి ధరలు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి
బంగారం ధరలతో పాటు వెండి కూడా కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1.57 లక్షల వద్ద ఉండగా, డిమాండ్ ఇంకా పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. పరిశ్రమల్లో వెండి వినియోగం పెరుగుతుండటంతో పాటు, పెట్టుబడిదారులు కూడా వెండిని కొనుగోలు చేస్తున్నారు.
బంగారం కొనుగోలు వాయిదా
సాధారణంగా పండుగల సమయంలో, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి ధరల పెరుగుదల కారణంగా చాలా మంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. గత సంవత్సరం తులం రూ.60,000 ఉండగా, ఇప్పుడు రెండింతలు అయ్యింది. ఇలాగే కొనసాగితే బంగారం కొనడం దాదాపు అసాధ్యం అవుతుంది అని బంగారం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో పరిస్థితి?
మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం, అమెరికా ఆర్థిక సంక్షోభం కొనసాగితే బంగారం ధరలు ఇంకా పెరగవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర 2,800 డాలర్లను దాటే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే పరిస్థితి స్థిరపడితే కొంత మేరకు ధరలు తగ్గే అవకాశం కూడా ఉందని సూచిస్తున్నారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
పండుగలు, పెళ్లిళ్లు సమీపిస్తున్న వేళ పసిడి కొనేందుకు ప్రజలు వెనుకడుగు వేస్తున్నారు. అమెరికా షట్‌డౌన్ సంక్షోభం, గ్లోబల్ మార్కెట్ అనిశ్చితి కొనసాగుతున్నంత వరకు బంగారం ధరలు మరింతగా పెరగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.