CM Progress Report: ఏ ప్రభుత్వమైనా చూడాల్సింది లాభం కాదు.. పేదల సంక్షేమం అన్నారు సీఎం చంద్రబాబు. విజయనగరం జిల్లాలో జరిగిన పేదల సేవల కార్యక్రమంలో ఈ వారం పింఛన్లు పంపిణీ చేశారు. ఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో పాల్గొన్న సీఎం.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపారమైన అవకాశాల గురించి వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా పూర్వోదయ స్కీమ్ కింద భారీగా నిధులు ఇవ్వాలని కోరారు సీఎం చంద్రబాబు.
సెప్టెంబర్ 29, సోమవారం ( సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ )
జీఎస్టీని రెండు శ్లాబులకే పరిమితం చేసినందున రాష్ట్ర ప్రజలకు కలిగే ప్రయోజనాలను, ఆర్థిక లాభాలను సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరిట కార్యక్రమం చేపట్టి.. ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఏర్పాటైన రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 19వ తేదీ వరకు 65 వేల సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.
సెప్టెంబర్ 30, మంగళవారం ( సీఐఐ సదస్సులో సీఎం )
పోటీ ప్రపంచంలో ఎప్పుడూ పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో జరిగిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ కర్టైన్ రైజర్ ప్రోగ్రాంకు సీఎం హాజరయ్యారు. సన్ రైజ్ ఏపీ డాక్యుమెంటరీని ఆవిష్కరించి.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపారమైన అవకాశాల గురించి వివరించారు. వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతో సంభాషించారు. ఆదాయం సృష్టించడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంతో పాటు పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 8.25 వృద్ధిరేటు సాధించినట్లు వివరించారు. సులభతర వాణిజ్యం నిర్వహణలో ఏపీ ముందుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మారినట్లు స్పష్టం చేశారు సీఎం. రాష్ట్రాలను ప్రమోట్ చేసుకోవడానికి సీఐఐ శక్తిమంతమైన వేదిక అన్నారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇదొక సరైన వేదిక అని వివరించారు.
జనవరి నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు సీఎం. రెండేళ్లలో రాష్ట్రంలో క్వాంటం కంప్యూటర్ల తయారీ చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే.. పీపీపీ విధానంతో ఆదాయం సృష్టించామని తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో సమ్మిళిత వృద్ధిరేటు సాధనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరో స్పేస్ సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు సీఎం చంద్రబాబు.
సెప్టెంబర్ 30, మంగళవారం ( కేంద్రమంత్రులతో భేటీ )
ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. అమిత్ షాతో సమావేశంలో.. అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. అదేవిధంగా.. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతుల ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మరింత సహకారం అందించాలని.. అమిత్ షాని కోరారు. ఇక.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం చంద్రబాబు కోరారు. నీటి పారుదలశాఖకు సంబంధించి వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. సముద్రంలోకి వెళ్లే నీటినే వాడుకుంటామని, దీనివల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని తెలిపారు. పనిలో పనిగా.. పూర్వోదయ పథకం కింద ఏపీకి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే.. రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఆ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా పూర్వోదయ స్కీమ్ కింద భారీగా నిధులు ఇవ్వాలని కోరారు.
అక్టోబర్ 1, బుధవారం ( పేదల సేవలో )
విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, దత్తిగ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. కిడ్నీసమస్యతో బాధపడుతున్న పొంతూరు అప్పలరాజుకు స్వయంగా పింఛను అందజేశారు. వారితో కాసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 16 నెలలుగా నిరాటంకంగా పెన్షన్లు ఇస్తున్నామని.. చెప్పారు సీఎం. భర్త చనిపోతే భార్యకు మరుసటి నెలలోనే వితంతు పింఛన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఒక నెల తీసుకోకపోతే రెండో నెలలో, రెండో నెల కూడా తీసుకోకపోతే మూడో నెల కూడా ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే కట్ చేసేదన్నారు. ప్రభుత్వం చూడాల్సింది లాభం కాదని.. పేదల సంక్షేమం అని చెప్పారు సీఎం చంద్రబాబు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామన్నారు ముఖ్యమంత్రి. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇచ్చామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం, పెన్షన్లు ఇచ్చే బాధ్యత తనదన్నారు. రాష్ట్రంలో 63 లక్షల 77 వేల మంది పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం.. 10 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇది.. చదువుకునే పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి అన్నారు సీఎం చంద్రబాబు.
అక్టోబర్ 2, గురువారం ( విజయవాడ ఉత్సవ్ )
విజయవాడ ఉత్సవ్.. దసరా సాంస్కృతిక కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కార్నివాల్ వాక్ ర్యాలీని జెండా ఊపి సీఎం ప్రారంభించారు. దసరా సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా స్థానిక కళలైన డప్పు కళాకారుల ప్రదర్శన, కొమ్ము నృత్యం, పులివేషాలను సీఎం తిలకించారు. గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎక్స్ పో గ్రౌండ్స్‌లోని ఎగ్జిబిషన్‌ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఎక్స్ పోలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన రోబో కిచెన్‌ని పరిశీలించారు. వివిధ స్టాళ్లను చూశారు.
అక్టోబర్ 2, గురువారం ( ప్రమోట్ ఇండియా )
మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌తో అనేక రంగాల్లో మనం స్వయం సమృద్ధి సాధించామన్నారు సీఎం చంద్రబాబు. గాంధీ జయంతి రోజున.. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ఖాదీ సంతని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఖాదీ, కలంకారీ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలతో పాటు వివిధ దేశీయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు రాట్నంపై నూలు వడికారు. స్వదేశీ పరిజ్ఞానంతో 4జీ అభివృద్ధిలో.. ప్రధాని మోదీ చొరవ అభినందనీయం అని తెలిపారు. మన ఉత్పత్తులను మనమే ప్రమోట్ చేసుకోవాలన్నారు. మన ఉత్పత్తులను మనం వినియోగించగలిగితే.. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. స్వదేశీ సంత.. గ్లోబల్ సంతగా ఎదగాలని.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
అక్టోబర్ 3, శుక్రవారం ( కీలక నిర్ణయాలు )
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై.. 20 అజెండా అంశాలపై చర్చించింది. రాజధాని అమరావతికి భూసేకరణ విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. అదేవిధంగా.. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ అనుబంధ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారవాన్ పర్యాటకానికి, అమృత్ పథకం 2.0 పనులను మంత్రివర్గం ఆమోదించింది. అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.
అక్టోబర్ 3, శుక్రవారం ( పోలవరంపై రివ్యూ )
పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వారం సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని అధికారులను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. 2026 జనవరి కల్లా ఎడమ కాలువ పనులు పూర్తి కావాలన్న సీఎం.. వచ్చే నవంబరు నుంచే ప్రధాన డ్యామ్ పనులు మొదలు పెట్టాలని దిశానిర్దేశం చేశారు. కేంద్ర జలసంఘం, నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై అనుమతులు తీసుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ వద్దని అధికారులకు సూచించారు. ఇక.. డయాఫ్రం వాల్ 63 వేల 656 క్యూబిక్ మీటర్లకు గానూ.. 37 వేల 302 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు. బట్రస్ డ్యామ్ పనులు వంద శాతం పూర్తి అయినట్టు తెలిపారు. వచ్చే డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రధానమైన.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్ని నవంబరు ఒకటో తేదీ నుంచే ప్రారంభించాలని.. 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు.
అక్టోబర్ 3, శుక్రవారం ( రోడ్ల పునరుద్ధరణ )
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్‌ని వెంటనే పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలో మృతి చెందిన వారి కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
అక్టోబర్ 4, శనివారం ( డ్రైవర్ సేవలో..)
ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికసాయం అందించే.. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రారంభించారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15 వేల ఆర్థిక సాయం అందించింది. తొలి ఏడాది 2 లక్షల 90 వేల 669 మంది డ్రైవర్లకు 436 కోట్ల మేర ఖాతాల్లో జమ చేసింది. పథకం ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు.. ఆటో డ్రైవర్ కుటుంబసభ్యులతో కలిసి విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్ దాకా 14 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. డ్రైవర్లు, వారి కుటుంబీకులతో మాట్లాడి.. వారి స్థితిగతులను తెలుసుకున్నారు.
ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 15 వేలు అందించిన ప్రభుత్వం.. ఆటో డ్రైవర్ల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉబర్, ఓలా తరహాలో ఆటో డ్రైవర్ల కోసం యాప్ తీసుకొస్తామని.. దాని ద్వారా బుకింగ్‌లు నేరుగా వచ్చేలా చర్యలు తీసుకునే ప్రయత్నల్లో ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Also Read: స్థానిక సంస్థల ఎన్నికలు.. కేసీఆర్ ప్లాన్‌తో బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్.. ?
అక్టోబర్ 4, శనివారం ( దిశానిర్దేశం )
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పూర్వోదయ స్కీంను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. పూర్వోదయ మిషన్‌లో భాగంగా.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించుకోవాల్సిన ప్రణాళికలపై.. క్యాంప్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు. ఉద్యాన పంటలు, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Story By Anup, Bigtv