Election Code: తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలు..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల నియమావళి ప్రకారం బైపోల్ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.
నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 13
నామినేషన్లకు తుది గడువు: అక్టోబర్ 21
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 22
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 24
పోలింగ్ తేదీ: నవంబర్ 11
ఓట్ల లెక్కింపు : నవంబర్ 14
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.9 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 2,07,382 మంది పురుషలు, 1,91,593 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 25 మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జూబ్లీహిల్ నియోజకవర్గ ఉప ఎన్నికకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ బైపోల్ లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలను వినియోగించనున్నట్టు పేర్కొన్నారు. పోలింగ్ సాఫీగా జరిగేందుకు సాంకేతిక, భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఓటర్ కార్డుతో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ప్యాన్ కార్డు, పెన్షన్ పత్రం వంటి గుర్తింపు పత్రాలతో ఓటు వేయొచ్చని తెలిపారు. ఓటర్లు తమ పేర్లను జాబితాలో ధృవీకరించుకోవాలని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు.
భారత ఎన్నికల కమిషన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికను నవంబర్ 11, 2025న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఖాళీ చేసిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ ఉపఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 13న వెలువడుతోందని ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. నామినేషన్ల దాఖలు చివరి తేదీ అక్టోబర్ 21, పరిశీలన అక్టోబర్ 22, వెనక్కి తీసుకునే గడువు అక్టోబర్ 24గా నిర్ణయించారు. ఓటింగ్ నవంబర్ 11న, లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. మొత్తం ఎన్నికా ప్రక్రియ నవంబర్ 16, 2025 నాటికి పూర్తవుతుందని వివరించారు.
హైదరాబాద్ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తక్షణమే అమల్లోకి వచ్చిందని అన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమకు ఉన్న క్రిమినల్ నేపథ్య వివరాలను పత్రికలు, టీవీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రకటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఓటర్లు తమ పేర్లు ఓటరు జాబితాలో ధృవీకరించుకుని, ఎన్నికల్లో సక్రియంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.