వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అడ్డగోలుగా వాహనాలు నడుపుతామంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందుకు సంబంధించి కొత్తగా ట్రాఫిక్ రూల్స్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఉల్లంఘటనల విషయంలో కఠిన నియంత్రణను తీసురావడమే లక్ష్యంగా కోట్లాది మంది వాహనదారులపై ఉక్కుపాదం మోపబోతోంది.
వాహనాలను కొనుగోలు చేయడమే కాదు, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలంటోంది కేంద్ర ప్రభుత్వం. లేదంటే, పెద్ద మొత్తంలో జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ సహా అన్ని పత్రాలు కచ్చితంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. నిజానికి వీటి గురించి చాలా మంది వాహనదారులకు అవగాహన లేదు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జరిమానా విధిస్తున్నారు. వాహనాలపై తరచుగా వారికి తెలియకుండానే పెనాల్టీ చలాన్లు జారీ చేయబడుతున్నాయి. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, జరిమానాలు చెల్లించని వాహనాలు స్వాధీనం చేసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ 1989 నాటి కేంద్ర మోటారు వాహనాల నిబంధనలకు అప్ డేట్ చేయబోతోంది.
కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనలతో ఒక వాహనంపై లో ఐదు, అంతకంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు, వాహన యజమానులకు ట్రాఫిక్ చలాన్ ను క్లియర్ చేయడానికి 90 రోజుల వరకు సమయం ఉంది. కానీ, కొత్త ప్రతిపాదన ప్రకారం గ్రేస్ పీరియడ్ ను త్వరలో 45 రోజులకు తగ్గించవచ్చు. ఆ సమయంలోపు జరిమానా చెల్లించకపోతే, అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులు వాటిని విక్రయించలేరు. రిజిస్ట్రేషన్ ను పునరుద్ధరించలేరు. చిరునామాను మార్చలేరు. యాజమాన్యాన్ని ఇతరుల మీదికి బదిలీ చేయలేరు. కొత్త ప్రతిపాదనలలో ఉల్లంఘన జరిగిన 15 రోజుల్లోపు ఈ చలాన్ నోటీసులు వాహనదారులకు చేరనున్నాయి.
Read Also: ఆ దేశంలో కేవలం 8 సెకన్లలోనే పాస్ పోర్ట్ చెకింగ్ కంప్లీట్.. అదెలా సాధ్యం?
కేంద్రం తీసుకొచ్చిన ముసాయిదా ప్రతిపాదన మిశ్రమ స్పందనను రేకెత్తించింది. కఠినమైన నియమాలు రహదారి భద్రతను మెరుగుపరుస్తాయని కొంత మంది అంటుంటే, చలాన్ వ్యవస్థ అవినీతి, తప్పుడు జరిమానాలతో నడుస్తోందని మరికొంత మంది విమర్శిస్తున్నారు. రోడ్ల గురించి పట్టించుకోని ప్రభుత్వాలకు జరిమానా విధించే హక్కు లేదని మరికొంత మంది అంటున్నారు. కేవలం 2024లోనే దేశ వ్యాప్తంగా రూ.12,000 కోట్ల విలువైన 8 కోట్లకు పైగా చలాన్లు జారీ అయ్యాయి. ఇక ఈ ముసాయిదా రూల్స్ మీద అభ్యంతరాలు, సూచనలను రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శికి పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేదంటే comments-morth@gov.in కు ఇమెయిల్ చేయాలన్నాది. ఈ ప్రజా అభిప్రాయాల ఆధారంగా ప్రతిపాదిత మార్పులు అమలు చేసే అవకాశం ఉంటుంది.
Read Also: చైనాలో అతి ఎత్తైన వంతెన.. దాని పొడవైన స్తంభాలపై రెస్టారెంట్.. జూమ్ చేస్తేనే చూడగలం!