OTP: డిజిటల్ లావాదేవీలకు వన్ టైమ్ పాస్ వర్డ్(OTP) చాలా కీలకం. ఖాతాదారులు సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఓటీపీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓటీపీల స్థానంలో మరో కొత్త సాంకేతికతను తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు చేస్తుంది. డిజిటల్ చెల్లింపు చేసే ప్రతిసారీ మీ ఫోన్‌లో వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు పొందడం ఇష్టం లేకపోతే, మీరు త్వరలో కొత్త టెక్నాలజీని స్వాగతించవచ్చు.
డిజిటల్ లావాదేవీలను మరింత పటిష్టం చేసేందుకు ఏప్రిల్ 2026 నుండి OTPలపై ఆధారపడటం తగ్గించాలని ఆర్బీఐ సంకేతాలను ఇచ్చింది. ప్రతిసారీ OTP నమోదుకు బదులుగా రెండు దశల ప్రామాణీకరణ(2FA)ను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తుంది. 2025 మార్గదర్శకాల ప్రకారం, అన్ని చెల్లింపులకు OTPలు డిఫాల్ట్ గా ఉండాలనే ఆర్బీఐ నిర్ణయించింది. ఇకపై ఈ విధానాన్ని సడలించనుంది.
సాధారణ SMS వన్-టైమ్ పాస్‌వర్డ్ కంటే టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ద్వారా డిజిటల్ లావాదేవీలను అనుమతించాలని ఆర్బీఐ భావిస్తుంది. కొత్త డిజిటల్ చెల్లింపు నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి రానున్నాయి.
OTPల స్థానంలో వినియోగదారుల ధ్రువీకరణకు పాస్‌వర్డ్, పాస్‌ఫ్రేజ్, పిన్, కార్డ్, సాఫ్ట్‌వేర్ టోకెన్, వేలిముద్ర లేదా ఏదైనా ఇతర బయోమెట్రిక్స్ తో లావాదేవీలను అనుమతిస్తున్నారని ఆర్బీఐ తెలిపింది. అయితే OTPలను పూర్తిగా రద్దు చేయడం లేదని, డిజిటల్ వ్యవస్థను మరింత సురక్షితంగా, సరళంగా మార్చడం కోసమే కొత్త సాంకేతికతను అమలుచేస్తామని పేర్కొంది.
డిజిటల్ చెల్లింపు లావాదేవీలకు టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి అని ఆర్బీఐ తెలిపింది. OTPలను అనుమతిస్తామని, కానీ చెల్లింపుల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు, ఆన్ లైన్ మోసాలను తగ్గించేందుకు ఇతర సాంకేతికతలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది.
డిజిటల్ చెల్లింపు పద్ధతులకు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయాలని ఫిబ్రవరి 2024లో సెంట్రల్ బ్యాంకు ఈ ఆలోచన చేసింది.
“ఆన్ లైన్ చెల్లింపుల్లో ఉన్న రిస్క్ ఆధారంగా, కనీస రెండు ఫ్యాక్టర్ల అథెంటికేషన్ అవసరం. హై-రిస్క్ లావాదేవీలకు నోటిఫికేషన్, నిర్ధారణకు డిజిలాకర్‌ను ఉపయోగించాలి” అని ఆర్బీఐ తెలిపింది.
బ్యాంకులు ఈ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే ఎలాంటి వివాదం లేకుండా కస్టమర్ కు పూర్తిగా పరిహారం చెల్లించాలని ఆర్బీఐ ఆదేశించింది. అక్టోబర్ 1, 2026 నుంచి కార్డులు జారీ చేసే విదేశీ సంస్థల అథెంటికేషన్ ను వన్-ఆఫ్, క్రాస్-బోర్డర్, కార్డ్-నాట్-ప్రెజెంట్ ధ్రువీకరించడానికి ఈ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.
Also Read: RBI Recruitment: రూ.78,450 జీతంతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే మామ.. మిస్ అవ్వొద్దు
పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ విశ్వాస్ పటేల్ మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన 2FA ఆదేశాలు కస్టమర్ల భద్రత, ఆవిష్కరణల మధ్య సమతుల్యతను పెంచుతాయని అన్నారు.