Vizianagaram district: పోలీసులు పదే పదే చెబుతున్నా వాహనదారులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డినట్టు సమాచారం. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. అసలు ఘటన ఎలా జరిగింది?
విజయనగరం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దత్తిరాజేరు మండలలోని షికారుగంజి జంక్షన్ వద్ద అతి వేగంగా వచ్చిన లారీ ఆటోను బలంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతులంతా బాడంగి మండలం గజరాయనివలస గ్రామానికి చెందిన వారు. ఆటో డ్రైవర్‌తోపాటు అందులోని మరో ఇద్దరు మరణించారు.
లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
స్థానికుల ద్వారా ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదం కారణంగా ఆ రహదారి మీదుగావెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వినాయకచవితి వేళ ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో గజరాయనివలసలో తీవ్ర విషాదం అలముకుంది.