Minister Narayana: అమరావతిలో ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్వహించిన సమీక్షా సమావేశం రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఊరటనిచ్చింది. లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేయడంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సాఫ్ట్‌వేర్ సమస్యలకు తక్షణ పరిష్కారం
అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు సాంకేతిక పరమైన చిక్కులు ఎదురవుతున్నాయని, సాఫ్ట్‌వేర్ లోపాల వల్ల సమయం వృధా అవుతోందని క్రెడాయ్, నరేడ్కో ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి నారాయణ, సాఫ్ట్‌వేర్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, ఐదు లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉండే భారీ నిర్మాణాల అనుమతులను వేగవంతం చేయడానికి టౌన్ ప్లానింగ్ డైరెక్టరేట్‌లో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సంస్కరణల అమలు, పారదర్శకత
దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే ఈ సంస్కరణల ఫలాలు ప్రజలకు అందాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అనుమతుల జారీలో ఎలాంటి జాప్యం లేకుండా, పూర్తిగా నిబంధనల ప్రకారమే పారదర్శకంగా వ్యవహరించాలని, సేవలను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
Also Read: ‘దసరాకి రికార్డింగ్ డ్యాన్సులకి పొండి’.. BRS ఎమ్మెల్యేలకు ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్!