Simhachalam Appanna: సింహాద్రి అప్పన్నస్వామి దేవాలయంలో బంగారం, వెండి ఆభరణాల లెక్కల్లో అవకతవకలు మరోసారి కలకలం రేపాయి. తాజాగా ఈ ఆరపణలపై పూర్వ ఓఈఓ ప్రధాన అర్చకులకు నోటీసులు జారీచేసిన అంశం వెలుగులోకి వచ్చింది.
గత సంవత్సరం జనవరిలో కడప జిల్లాకు చెందిన ప్రభాకరాచారి.. దేవదాయశాఖ కమిషనర్‌కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సింహాద్రి అప్పన్న సన్నిధిలో బంగారం, వెండి ఆభరణాల లెక్కలు సరిగా లేవని, కొన్ని వస్తువులు కనిపించడం లేదని.. ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కమిషనర్ రాజమహేంద్రవరం ఆర్జీసీకి విచారణకు ఆదేశించారు.
ఆర్జీసీ నియమించిన జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి సింగం రాధ.. ఈ ఏడాది పలు దఫాలుగా తనిఖీలు నిర్వహించి ప్రాథమిక నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆర్జీసీ ఐదుగురు సభ్యులతో మరో కమిటీని నియమించింది.
కమిటీ ఈ ఏడాది ఆగస్టు 9 నుండి 20 వరకు, అలాగే సెప్టెంబరు 14, 15 తేదీల్లో ఆలయం, బ్యాంకులు, అర్చకుల ఆధీనంలో ఉన్న వస్తువులు, ఉపాలయాల్లో ఉన్న ఆభరణాలను సమగ్రంగా తనిఖీ చేసింది.
తనిఖీలలో రికార్డుల్లో ఉన్న వస్తువులకు, ప్రత్యక్షంగా ఉన్నవాటికి తేడా ఉన్నట్లు నిజమైంది. కొన్ని ఆభరణాలు రికార్డుల్లో ఉన్నప్పటికీ, అవి భౌతికంగా అందుబాటులో లేవని గుర్తించారు.
ప్రస్తుతం విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి ఆలయంలో ఎన్. ఆనంద్ కుమార్ ఏఈవోగా పనిచేస్తున్నారు. తన కస్టడీలో ఉన్న సమయంలో 47 వెండి వస్తువులు (మొత్తం 19 కిలోల 247 గ్రాములు) అదనంగా ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి.
గొడవర్తి శ్రీనివాసాచార్యులు , కర్రి సీతారామాచార్యులు (ప్రధానార్చకులు).. వీరి ఆధీనంలో ఉన్న 8 బంగారు వస్తువులు (137.375 గ్రాములు) 34 వెండి వస్తువులు (120.416 కిలోలు) పరిశీలన సమయంలో చూపించలేదని కమిటీ గుర్తించింది.
కాగా.. 2021 నవంబరు 19న జరిగిన వెరిఫికేషన్‌లో అన్ని వస్తువులు ఉన్నట్లు రికార్డులు చూపించాయి. అయితే ఇప్పుడు అదే వస్తువులు లెక్కల్లో తేలకపోవడం అనుమానాస్పదమైందని విచారణాధికారి సింగం రాధ పేర్కొన్నారు.
Also Read: ఆ దగ్గు మందులను నిషేదిస్తూ.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు
ఈ నేపథ్యంలో దేవదాయశాఖ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. కమిటీ పూర్తి నివేదిక ఆధారంగా అవసరమైతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని ఆర్జీసీకి సూచనలు ఇచ్చారు. అన్ని బంగారం, వెండి వస్తువులకు బయోమెట్రిక్ రికార్డింగ్, వీడియో డాక్యుమెంటేషన్ వంటి కఠిన చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు.