Anantapur Land Grab: అనంతపురంలో అధికార పార్టీకి చెందిన భూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అమాయకులైన వారి ఆస్తులను కొల్లగొట్టడానికి పూనుకున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అక్రమంగా కాజేయడానికి అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు కుట్రపన్నినట్లు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అనసూయ, కృష్ణమూర్తి అనే దంపతులు 2009లో ఏ. నారాయణపురం గ్రామం సర్వే నెంబర్ 156/2లో ఒక ఎకరా భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. భూమి బదిలీ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసి, వెబ్‌ల్యాండ్లో కూడా వారి పేరుతో రికార్డులు నమోదు చేయించుకున్నారు. అయితే ఇటీవలే ఆ భూమిని రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలానికి చెందిన టీడీపీ నేత ముకుంద నాయుడు మరోసారి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిసి బాధితులు షాక్‌కు గురయ్యారు.
డబుల్ రిజిస్ట్రేషన్‌తో భూకబ్జా
ముకుంద నాయుడు గత ఆగస్టులో.. అదే భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని రికార్డులు చెబుతున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రామ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన రమణరావు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై ఇప్పటికే సస్పెన్షన్ విధించబడింది. మొదట్లో ఈ రిజిస్ట్రేషన్ పత్రాలను పెండింగ్‌గా ఉంచినా, కొద్ది రోజుల తర్వాత రమణరావే ఆ ఫైలును పూర్తి చేసినట్లు సమాచారం.
అధికారుల వద్ద ఫిర్యాదు
బాధితులు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అర్బన్ ఎమ్మార్వో బృందం ఆ భూమిని సర్వే చేసింది. సర్వే ప్రకారం సర్వే నెంబర్ 156/2లో మొత్తం 9.59 ఎకరాల భూమి ఉందని, అందులో మూడు యజమానుల పేర్లు ఉన్నాయని తేలింది. అందరికీ తాఖీదులు జారీ చేసి విచారణకు పిలిచినప్పటికీ, ముకుంద నాయుడు,అతని భార్య పద్మగీతా విచారణకు హాజరుకాలేదని అధికారులు వెల్లడించారు.
ఆ భూమిపై కవలూరి కృష్ణమూర్తి పేరుతోనే రికార్డులు ఉన్నాయని, డబుల్ రిజిస్ట్రేషన్ పూర్తిగా చట్టవిరుద్ధమని. తహసీల్దారు హరికుమార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. దీనితో భూమి కబ్జా ఆరోపణలు నిజం అవుతున్నాయనే అనుమానాలు మరింత బలపడ్డాయి.
Also Read: సిరిమానోత్సవంలో అపశృతి.. బొత్స కి తప్పిన ప్రమాదం
బాధితుల విజ్ఞప్తి
బాధిత దంపతులు కృష్ణమూర్తి, అనసూయలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌లకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని, తమ భూమిని తిరిగి తమ పేరుపైకి తెచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.