Nara Lokesh: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారా నాణ్యమైన భోజనం అందుతుండటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారానికి కృషిచేసిన మంత్రి నారా లోకేశ్ కు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల నూజివీడు ట్రిపుల్ ఐటీలో భోజనం సరిగా పెట్టడం లేదని, నిర్వహణ సక్రమంగా లేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రిపుల్ ఐటీల్లో మెస్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అక్షయపాత్రకు అప్పగించింది. దీంతో నూజివీడు విద్యార్థులు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న భోజన సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్భంగా విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భోజనాలతో ఇప్పుడు నిజమైన మార్పు కనిపిస్తోందన్నారు. మాట నిలబెట్టుకున్నందుకు మంత్రి లోకేశ్ కు ధన్యవాదాలు తెలియజేశారు విద్యార్థులు. అక్షయపాత్రను శాశ్వతంగా కొనసాగించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.
ఏపీలోని ట్రిపుల్ ఐటీ మెస్‌ల నిర్వహణపై ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో మెస్‌ల బాధ్యతల్ని అక్షయపాత్రకు అప్పగించింది. కడప జిల్లా ఇడుపులపాయ, ప్రకాశం జిల్లా ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో మరో సంస్థకు మెస్ భోజనం బాధ్యతలు అందించనుంది. ట్రిపుల్ ఐటీ మెస్‌లలో భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ట్రిపుల్ ఐటీ మెస్ లలో టిఫిన్, రెండు పూటలా భోజనం, స్నాక్స్ అందించినందుకు ప్రభుత్వం రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.110 చెల్లిస్తుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.3,300 చెల్లిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో వంట పరికరాలు ఏర్పాటుకు రూ.3 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. విద్యార్థులకు వారానికి 5 కోడిగుడ్లు, ఒక రోజు మాంసాహారం వండించనున్నారు.
Also Read: Jagan Tour: జగన్ నర్సీపట్నం టూర్.. పోలీసులు పర్మీషన్.. వార్నింగ్‌తో వెళ్తారా? డ్రాపవుతారా?
ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మెస్‌ల నిర్వహణ, ఫుడ్ బాలేదని విద్యార్థుల నుంచి ఫిర్యాదుల రావడంతో ఇటీవల ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచన మేరకు ప్రభుత్వం మెస్‌ల బాధ్యతల్నిమరొకరికి అప్పగించాలని నిర్ణయించింది. ఈ కమిటీ ఒక్కో విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించేందుకు రోజుకు రూ.116.67 చెల్లించాలని ప్రభుత్వాని నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ సూచన మేరకు ప్రభుత్వం మెస్‌ల బాధ్యతల్ని మరో సంస్థకు అప్పగించింది.