BC Reservations: హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. మరో వైపు నామినేన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్లు కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. మరోవైపు ఎన్నికల ప్రొసీజర్ పై కూడా కోర్టు స్టే ఇవ్వలేదు. రేపు మధ్యాహ్నం మళ్లీ వాదనలు వింటామని కోర్టు తెలిపింది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా.. కోర్టు వాయిదా నేపథ్యంలో రేపటి నోటిఫికేషన్ పై ఉత్కంఠ నెలకొంది.
రేపు మరికొన్ని వాదనలు వినిపిస్తామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల బిల్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందనే ఊహగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అటు కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వని నేపథ్యంలో రేపు ఉదయం ఫేజ్-1 నోటిఫికేషన్ రానుంది.
‘బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని ప్రభుత్వ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించిందని చెప్పారు. జీవో నంబర్ 9పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదని వాదించారు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాసంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు.
బీసీ ప్రత్యేక కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచొచ్చని అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. చట్టసభలు చేసిన చట్టాలను కొంతమంది గవర్నర్లు చూసి చూడనట్టు ఉంటున్నారని అన్నారు. బిల్లులను ఆమోదించడం లేదు.. తిరస్కరించడం లేదు.. తిప్పిపంపడం లేదు.. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారని ఆయన కోర్టులో వాదనలు వినిపించారు. వారి చర్యల వల్ల ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయని సింఘ్వీ వాదనలు వినిపించారు.