AP Roads: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులకు రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 274 రహదారుల మరమ్మత్తుల కోసం తాజాగా ఈ నిధులు కేటాయించింది. ఈ మేరకు పాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర రహదారుల్లో 108 పనులకు రూ.400 కోట్లు, జిల్లా రోడ్లలో 166 పనులకు రూ.600 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లు గుంతలమయం అయ్యాయని అప్పటి ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన నిత్యం విమర్శలు చేసేవి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టింది. గ్రామాల్లో కొత్త రహదారులు, గుంతలు పడిన రోడ్లకు మరమ్మత్తులు చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున రోడ్ల మరమ్మత్తులు చేపట్టింది. ఇటీవల వర్షాలకు పలు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
దీంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పాడైన 274 రోడ్లను మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించింది. దీంతో పాటు భారీగా నిధుల్ని మంజూరు చేసింది.
Also Read: Nara Lokesh: ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం.. మాటనిలబెట్టుకున్న మంత్రి లోకేశ్!
వర్షాకాలం కురిసిన వర్షాలకు పలు చోట్ల రోడ్లు పాడయ్యాయి. దీంతో ప్రజలకు మళ్లీ అవస్థలు స్టార్ట్ అయ్యాయి. గుంతలు పడిన రోడ్లపైనే రాకపోకలు సాగించాల్సి వస్తుందని వాహనదారులు అంటున్నారు. దీనిపై ప్రజాప్రతినిధుల సైతం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో స్పందించడంతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పాడైన 274 రోడ్లను తక్షణమే మరమ్మత్తులు చేయాలని రూ.1000 కోట్ల నిధులు మంజూరు రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.