Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు ఈఓ ఏ.వీ. ధర్మారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ ఈఓలో పాల్గొన్న ఆయన.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని త్వరలోనే టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకూ 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం ఉంటుందని వెల్లడించారు. నవంబర్ 10న ఆన్ లైన్ లో 2.25 లక్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేస్తామని ధర్మారెడ్డి తెలిపారు.
డిసెంబర్ 22న తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శనం 10 రోజులకు 4.25 లక్షల టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 7 వర్కింగ్ డేస్ లో వారి ఖాతాలకు ఆ డిపాజిట్ మొత్తాన్ని జమ చేస్తున్నట్లు వివరించారు.
అలాగే నవంబర్ 10 నుంచి 18 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వవహించనున్నట్లు తెలిపారు. 10న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 14న గజవాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమీతీర్థం, 19న పుష్పయాగం నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ వాహనసేవలు జరుగుతాయని వివరించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 19న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పుష్పయాగం జరగనుందని తెలిపారు. ఈ మేరకు నవంబర్ 18న అంకురార్పణ నిర్వహిస్తామన్నారు. ఈ పుష్పయాగంలో భక్తులు పాల్గొనేందుకు నవంబర్ 4న 1000 టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తామని, టికెట్ ధర రూ.700గా నిర్ణయించామని తెలిపారు. అలాగే 2024కు సంబంధించిన డైరీలు, క్యాలెండర్లు టిటిడి పుస్తకాల అమ్మకం షాపులతో పాటు ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు.