Tirumala Vaikuntha Ekadasi: తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని.. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులకు కీలక సూచనలు చేస్తూ, దర్శన విధానాలు, భద్రతా చర్యలు, టోకెన్ల విడుదలపై సమగ్ర వివరాలు వెల్లడించారు.
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమ శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించినట్లు ఈవో తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమం అనంతరం ఆలయ పరిసరాలు పూర్తిగా శుద్ధి చేయబడినట్లు పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో ఆన్‌లైన్ లక్కీ డిప్ విధానం ద్వారా.. టికెట్లు పొందిన 1.89 లక్షల మంది భక్తులకు మాత్రమే దర్శన అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీ, సమయానికే తిరుమలకు రావాలని సూచించారు.
భక్తులు క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా రెండు గంటల్లోనే దర్శనం పూర్తయ్యేలా.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఈవో వెల్లడించారు. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనానికి అధిక రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నందున, క్యూలైన్ల నిర్వహణను పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు.
వైకుంఠ ఏకాదశి ఉత్సవాల అనంతరం జనవరి 2 నుంచి జనవరి 8 వరకు.. సామాన్య భక్తులకు సర్వదర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు. ఈ మిగిలిన ఏడు రోజుల్లో భక్తులు సాధారణ దర్శనం పొందవచ్చని స్పష్టం చేశారు. అయితే ఈ కాలంలో కూడా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, భక్తులు సహనం పాటించాలని కోరారు.
టికెట్ల విడుదలపై కూడా కీలక సమాచారం ఇచ్చారు. ఉత్సవాల్లో నాలుగో రోజు నుంచి పదో రోజు వరకు రోజుకు 15 వేల ఎస్‌ఎస్‌డి (SSD) టోకెన్లు, అలాగే రోజుకు 1,500 శ్రీవాణి టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తెలిపారు. చివరి మూడు రోజుల్లో తిరుపతి స్థానిక భక్తుల కోసం రోజుకు 5,000 చొప్పున ప్రత్యేక టోకెన్లు కేటాయిస్తామని వెల్లడించారు.
వైకుంఠ ద్వారం ద్వారా దర్శనానికి అత్యధిక రద్దీ ఉండే నేపథ్యంలో, చంటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఈ సమయంలో తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది. వీలైతే జనవరి 8 తర్వాతే తిరుమలకు రావాలని భక్తులను కోరింది. ఇది వారి భద్రత, సౌకర్యం దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని ఈవో స్పష్టం చేశారు.
భక్తుల భద్రత కోసం తిరుమలలో 3,500 మంది పోలీసులు, విజిలెన్స్ సిబ్బందిను మోహరించినట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటల పాటు పరిస్థితిని పర్యవేక్షిస్తామని చెప్పారు. సీసీ కెమెరాల నిఘా, డ్రోన్ పర్యవేక్షణతో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: గోవిందరాజ స్వామి గోపుర పనుల్లో భారీ గోల్‌మాల్? రంగంలోకి టీటీడీ విజిలెన్స్!
అలాగే క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. భక్తుల సహకారంతోనే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు సజావుగా నిర్వహించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.