Nellore Politics: నెల్లూరు జిల్లా రాజకీయాలు మైనింగ్ చుట్టూ తిరుగుతున్నాయి. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, వైసీపీ మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ల మధ్య మైనింగ్ వ్యవహారాలపై పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఒకరిపై ఒకరు సై అంటే సై అంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఆ మాజీ మంత్రి కన్ను సన్నల్లో మైన్స్ జరగగా.. కూటమి ప్రభుత్వంలో లో ఎంపీ కనుసన్నల్లోనే మైన్స్ దందా నడుస్తోందని అనిల్ తెగ ఊదరగొట్టేస్తున్నారు. దాంతో తాను నిర్మించాలనుకున్న మైన్స్ మినరల్ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు వేమిరెడ్డి ప్రకటించారు. మైన్స్ మినరల్ కి పర్మిషన్ రాకే ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేశారని అనిల్ ఎదురు దాడికి దిగుతున్నారు. ఇంతకీ సింహపురి జిల్లాలో జరుగుతున్న మైనింగ్ సమరం ఏంటి?
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో గత దశాబ్దకాలానికి పైగా చక్రం తిప్పుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు బడా ఇండస్ట్రియలిస్టు అయిన వేమిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అప్పటినుంచి పార్టీలో కొనసాగుతూ నెల్లూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చారు. వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ కార్యక్రమాలు అన్నిటికీ తనవంతు సహకారం అందించి ఆర్థిక మూలంగా నిలిచారు. అటువంటి నేతను పట్టించుకోలేదన్న విమర్శలు 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికమయ్యాయి. గత ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో పట్టు పట్టు పట్టడం, జగన్ వ్యతిరేకించడం జరిగిపోయాయి.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ విషయంలో పార్టీతో విభేదాలు
తన భార్య ప్రశాంతి రెడ్డిని నెల్లూరు సిటీ నుంచి పోటీలో నిలిపేందుకు అవకాశం కల్పించాలని వేమిరెడ్డి కోరితే.. దాన్ని కాదని నెల్లూరు నగర ఎమ్మెల్యే టికెట్‌ను జగన్.. నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ చెప్పిన అభ్యర్ధికి కట్టబెట్టారు. మాజీ మంత్రి అనిల్ రాజకీయ ఎదుగుదలలో ఆర్థికంగా వేమిరెడ్డి దంపతుల సపోర్టు ఉందనేది టాక్ ఉంది. దీంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దాంతో గత ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆర్థికంగా వెన్నుదన్ను లేకున్నా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పునరజ్జీవం నింపినట్లయింది. ఆయన చేరికతో మాజీ ఎమ్మెల్యేలు నేతలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఘనంగా పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పి శుభాకాంక్షలు చెప్పారు. మాజీ మంత్రి అనిల్ నెల్లూరు సిటీ నుంచి కాకుండా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయడానికి వేమిరెడ్డి కారణమని అనిల్ వర్గీయులలో చర్చ నడిచింది. దీంతో అప్పుడు నుంచి వేమిరెడ్డి దంపతులకు.. మాజీ మంత్రి అనిల్‌కు పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనేలా విభేదాలు మొదలయ్యాయి.
అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మైనింగ్ కేసులపై నెల్లూరు పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే అక్రమ మైనింగ్ లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దాదాపుగా గత 70 రోజులుగా రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని మైనింగ్ వ్యవహారం ఎంపీ వేమిరెడ్డి వర్సెస్ వైసీపీగా మారింది. మరో మాజీ మంత్రి పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పై అక్రమ మైనింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్ కేసులో నిందితుడైన వైసిపి నేత బిరుదువోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో అనిల్‌పై కేసు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆయనపై సైదాపురం అక్రమ మైనింగ్, మనీ ల్యాండ్ రింగ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
క్వార్ట్జ్ ఫ్యాక్టరీ పెట్టాలని యోచించిన వేమిరెడ్డి
ఆ క్రమంలో నెల్లూరు జిల్లాలో మైనింగ్ వ్యవహారంపై వేమిరెడ్డి వర్సెస్ అనిల్ అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొదటిసారి మైనింగ్ విషయంలో మాట్లాడుతూ. క్వార్ట్జ్ ఫ్యాక్టరీ పెట్టి వేయి మంది కార్మికులకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 400 కోట్ల పెట్టుబడి పెట్టి ఆ మేరకు పనులు చేద్దాం అని ప్రభుత్వాన్ని అడిగానని వెల్లడించారు. నెల్లూరులో నాణ్యమైన క్వార్ట్జ్ దొరుకుతుండడంతో సోలార్ ప్యానెల్ లో వాడే ముడిపదార్థాల కోసం ఈ పరిశ్రమ ఉపయోగపడుతుండడంతో అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్ధంగా క్వార్ట్జ్ పరిశ్రమ నెలకొల్పాలని అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. చైనాకు తమ బృందం వెళ్లి పరిశీలించి వచ్చిందని అందుకోసం 2 కంపెనీలు పెట్టి.. తన సొంత డబ్బుతో నేను సేవ చేస్తూ ఉంటే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసిపి నేతలపై మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతితోనే కంపెనీ పెట్టాలని భావించానని.. కానీ తనపై వస్తున్న అవినీతి, ఆరోపణలు బాధిస్తున్నాయన్నారు. ఇకపై క్వార్ట్జ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని, కంపెనీ పెట్టాలన్న ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. చట్టబద్దంగా 2024 నుంచి 2025 వరకు తన కంపెనీల ద్వారా 19 వేల టన్నులను ఎక్స్‌పోర్ట్ చేస్తే తాను కోట్లు కొల్లగొట్టానని ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు.
తన కంపెనీల ద్వారా 19,608 వేల టన్నులు ఎక్స్‌పోర్ట్స్ చేసినట్లు వివరణ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై -2024 నుంచి జూన్- 2025 మధ్య 96 కంపెనీల ద్వారా చైనాకు చెన్నై పోర్టు ద్వారా 1,60,604 టన్నులు ఎక్స్‌పోర్ట్ అయితే.. తాను ఏర్పాటు చేసిన కంపెనీలు ఫినీ క్వార్ట్జ్, లక్ష్మీ క్వార్ట్జ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా 19,608 వేల టన్నులు ఎక్స్‌పోర్ట్స్ చేసినట్లు వివరించారు. తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని, తాము ఎగుమతి చేసిన క్వార్ట్జ్ ని టెస్ట్ కోసం మాత్రమే వినియోగించామని..ఇక తాను ఫ్యాక్టరీ పెట్టాలనే ఆలోచన విరమించుకుంటున్నాని.. ఎవరన్నా ఆసక్తి ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టాలని వస్తే వారికి సహకరిస్తామని ప్రకటించారు. క్వార్ట్జ్ అంశంలోకి తను లాగితే వాళ్ళ ఖర్మకి వదిలేస్తున్నానని.. జగన్ నెల్లూరు జిల్లా పర్యటనకు ఒక్కరోజు ముందే ఆయన కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించారు
వేమిరెడ్డి నిర్ణయంపై సెటైర్లు విసురుతున్న అనిల్ యాదవ్
క్వార్జ్ మైన్స్ మినరల్ ఫ్యాక్టరీని పెట్టే ఆలోచన నుంచి వేమిరెడ్డి తప్పుకోవడం పై అనిల్ సెటైర్లు వేశారు. కంపెనీ స్థాపన సాధ్యం కాదని ఆరు నెలల క్రితమే వేమిరెడ్డి కి తెలుసని.. వేమిరెడ్డికి ఉన్న రెండు కంపెనీల నుంచి ఇప్పటివరకు 20వేల టన్నులు విదేశాలకు రవాణా చేశారని అనిల్ ఆరోపిస్తున్నారు. టెస్టింగ్ కోసం క్వార్జే పంపాలనుకుంటే 27 టన్నులు సరిపోతుందని..అంత భారీ స్థాయిలో పంపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి కూడా మైనింగ్ రవాణాలో 20 శాతం కమిషన్ వేమిరెడ్డి కి వెళ్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు..తాను ప్రశ్నించడం వల్లే వేమిరెడ్డి వెనక్కు తగ్గారని మాజీ మంత్రి అనిల్ అంటుండటం గమనార్హం.
మైనింగ్ స్కాంలో ఇంకెంత మంది అరెస్ట్ అవుతారో?
మైనింగ్‌ని అడ్డం పెట్టుకొని వేమిరెడ్డి వందల కోట్లు సంపాదించుకునేందుకు స్కెచ్ వేశారని అనిల్ ఆరోపించారు. ఏదిఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీలో, ఇండస్ట్రీస్ తీసుకురావాలి ఇలాంటి కంపెనీలు కాదని అనిల్ విచత్రంగా ఫైర్ అవుతున్నారు. మొత్తమ్మీద వారి విమర్శలు, ప్రతి విమర్శలు.. సవాల్, ప్రతి సవాళ్ల పర్వంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.. జిల్లాలో కాక రేపుతున్న మైనింగ్ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది? ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారనేది ఉత్కంఠ రేపుతోంది.
Story By Rami Reddy, Bigtv