AP Crime News: ఒక్కరోజు నాతో వస్తావా.. అంతా నేను చూసుకుంటా.. ఇక నీఇష్టం అంటూ వైసీపీ కి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ మహిళ ఆరోపిస్తోంది. అంతేకాదు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే..
ఇటీవల సోషల్ మీడియా వేదికగా మహిళల వ్యక్తిగత హననానికి పాల్పడిన పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అదే వైసీపీ కి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ తనను వేధిస్తున్నాడని ఓ ముస్లిం మహిళ ఆరోపిస్తోంది.
గురజాల నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి తనను వేధిస్తున్నట్లు పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనతో ఫోన్ లో అసభ్యకరంగా మాట్లాడుతూ, అసభ్యకర మెసేజ్ లను సైతం తనకు పంపిస్తున్నట్లు సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనతో ఒక్క రాత్రి గడపాలని లేకుంటే ఇబ్బందులు తప్పవని సురేష్ రెడ్డి తరచూ ఫోన్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయంపై పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదునిచ్చినట్లు, తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ కోరుతోంది.
కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదు కాగా, తాజాగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు మహిళ ఆరోపించడం సంచలనంగా మారింది. అలాగే సదరు మహిళ మీడియా ప్రతినిధులను కూడా ఆశ్రయించి తన బాధను వెళ్లగక్కింది. ఎన్నో రోజులుగా తాను లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు, ఇప్పటికైనా తనకు రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకుంటోంది.
ఇలా ఓ మహిళ ఏకంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్ పై ఫిర్యాదునివ్వగా, టీడీపీ కూడా వైసీపీ పై విమర్శలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా, సదరు మహిళకు వైసీపీ నేతలు ఏ సమాధానం చెబుతారని టీడీపీ ప్రశ్నిస్తోంది.