Luyuan Viral Ad Controversy: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ లుయువాన్ గ్రూప్ ఇటీవల విడుదల చేసిన కొన్ని యాడ్స్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. సోషల్ మీడియా వేదిక అయిన డౌయిన్ లో కంపెనీ ప్రచురించిన ప్రకటనలు అభ్యంతరకరంగా ఉన్నాయని నెటిజన్లు ఆరోపించారు. ఈ వివాదం పెరగడంతో సంస్థ ఆ యాడ్స్ పు తొలగించడంతో పాటు క్షమాపణలు చెప్పింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన స్క్రీన్ షాట్లలో మహిళలను అభ్యంతరకరమైన భంగిమల్లో చూపిస్తూ రూపొందించిన యాడ్స్ కనిపించాయి. ఒక వీడియోలో మహిళ ఇ-బైక్ హ్యాండిల్ పై కాళ్లు ఉంచి కనిపించగా, మరో వీడియోలో కెమెరా యాంగిల్స్ ద్వారా అవసరం లేని దృశ్యాలను చూపిస్తూ తమ మోడల్స్ ను ప్రచారం చేసినట్లు విమర్శలు వచ్చాయి. ఇలాంటి వీడియోలతో తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవాలనుకోవడం దారుణం అని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. “బైక్ అమ్మాలంటే ఇలాంటి ప్రకటనలే అవసరమా?”, “మీరు బైక్ లు అమ్ముతున్నారా? లేక మరేదైనా?” అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. కొందరు ఈ ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తూ పోస్టులు పెట్టారు.
విమర్శలు ఎక్కువ కావడంతో లుయువాన్ కంపెనీ వెంటనే స్పందించింది. డౌయిన్ అకౌంట్ లో ఉన్న అన్ని వివాదాస్పద వీడియోలను తొలగించింది. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనను సంస్థ తీవ్రంగా పరిగణిస్తోందని, ఇప్పటికే అంతర్గత సమీక్ష ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ప్రకటనలను మరింత కఠినంగా పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో షేర్ చేసే కంటెంట్ ను పూర్తిగా సమీక్షించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు కూడా పేర్కొంది.
ఇలాంటి వివాదాలు ఎదుర్కొన్న మొదటి కంపెనీ లుయువాన్ మాత్రమే కాదు. ఇటీవల చైనాలోని మరికొన్ని ప్రముఖ బ్రాండ్ లు కూడా తమ ప్రకటనల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాయి. కొన్ని కంపెనీలు మహిళలను వస్తువుల్లా చూపించాయని, మరికొన్ని అసభ్యకరమైన భాషను ఉపయోగించాయని ఆరోపణలు వచ్చాయి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయా సంస్థలు కూడా తమ ప్రకటనలను తొలగించి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో త్వరగా వైరల్ కావాలనే ఉద్దేశంతో కొన్ని కంపెనీలు ఇలాంటి సంచలనాత్మక యాడ్స్ ను తీసుకొస్తున్నాయి. అయితే, అలాంటి మార్కెటింగ్ తాత్కాలికంగా దృష్టిని ఆకర్షించినా, దీర్ఘకాలంలో బ్రాండ్ ప్రతిష్టకు నష్టం కలిగించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచి ప్రొడక్ట్ క్వాలిటీ, వినియోగదారుల విశ్వాసమే ఏ కంపెనీకైనా అసలైన బలం అని చెప్పుకొస్తున్నారు.
Read Also: మీ పాత కారులో E20 పెట్రోల్ కొట్టిస్తున్నారా? ARAI రిపోర్ట్ ఏం చెప్పిందంటే?