ATM PIN History: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జేబులోనూ ఒక డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ కచ్చితంగా ఉంటోంది. డబ్బులు డ్రా చేయాలన్నా, షాపింగ్ చేయాలన్నా ఏటీఎం పిన్ తప్పనిసరి. అయితే మీరెప్పుడైనా ఆలోచించారా? నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, ఈమెయిల్ పాస్‌వర్డ్‌లు చాలా పటిష్టంగా, ఎక్కువ అక్షరాలతో పెట్టుకోమని చెప్పే బ్యాంకులు.. ఏటీఎం పిన్‌ను మాత్రం కేవలం 4 అంకెలకే ఎందుకు పరిమితం చేశాయి? దీని వెనుక ఒక ఆసక్తికరమైన, కాస్త సరదాగా అనిపించే నేపథ్యం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
బ్రిటీష్ శాస్త్రవేత్త జాన్ షెపర్డ్ బారన్ (John Shepherd-Barron).. ఈ ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ATM)ను కనిపెట్టారు. 1967 జూన్ 27న ఆయన ప్రపంచంలోనే మెుట్టమెుదటి ఏటీఎంను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఆ కాలంలో ఆయన ఏటీఎం వ్యవస్థను రూపొందిస్తున్నప్పుడు మొదట ఏటీఎం పిన్ కోసం 6 అంకెలను (6 Digits) పెట్టాలని అనుకున్నారు. ఈ రోజుల్లో మనం వాడే మొబైల్ పాస్‌వర్డ్‌ల తరహాలోనే 6 అంకెలు ఉంటే భద్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన భావించారు. కానీ ఆయన అనుకున్న ప్లాన్ ఒక చిన్న కారణం వల్ల మారిపోయింది.
జాన్ షెపర్డ్ బారన్ తన 6 అంకెల పిన్ నంబర్ ఐడియాను భార్య కరోలిన్ (Caroline) దగ్గర ప్రస్తావించారు. ఆయన తన భార్యకు ఒక 6 అంకెల నంబర్‌ను ఇచ్చి గుర్తుపెట్టుకోమన్నారు. కానీ ఆమెకు కేవలం 4 అంకెలు మాత్రమే సులభంగా గుర్తుండేవట. ఐదో అంకె, ఆరో అంకె దగ్గరికి వచ్చేసరికి ఆమె కన్ఫ్యూజ్ అయిపోయేవారు. ‘నాకు 4 అంకెల కంటే ఎక్కువ గుర్తుండటం లేదు’ అని ఆమె తన భర్తతో చెప్పారట.
సాధారణంగా మనిషి మెదడు లాంగ్ టర్మ్ మెమొరీలో 4 అంకెలను చాలా వేగంగా, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలదని సైన్స్ చెబుతోంది. కరోలిన్ చెప్పిన ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్‌ను ఆలోచించిన జాన్ షెపర్డ్, వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మరోవైపు బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజల్లోకి విజయవంతంగా వెళ్లాలంటే అది వాడకందారులకు సులభంగా ఉండాలని జాన్ భావించారు. ఒకవేళ 6 అంకెలు పెడితే ప్రజలు తమ పిన్ నంబర్లను మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని దీనివల్ల ఏటీఎంల వాడకం తగ్గిపోతుందని ఆయన గ్రహించారు. అందుకే భద్రత కంటే వినియోగదారుల సౌకర్యానికే (User Convenience) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఏటీఎం పిన్‌ను 4 అంకెలుగా ఖరారు చేశారు.
గణిత శాస్త్రం ప్రకారం చూస్తే.. 4 అంకెల పిన్ ద్వారా 0000 నుండి 9999 వరకు దాదాపు 10,000 కాంబినేషన్లను సృష్టించవచ్చు. అంటే ఒక దొంగ మీ పిన్‌ను ఊహించి కొట్టాలంటే 10,000 సార్లు ప్రయత్నించాలి. అయితే బ్యాంకులు సాధారణంగా 3 తప్పుడు ప్రయత్నాల తర్వాత కార్డును బ్లాక్ చేస్తాయి కాబట్టి, హ్యాకర్లు లేదా దొంగలు సులభంగా పిన్‌ను కనిపెట్టడం అసాధ్యం. ఆ రకంగా 4 అంకెలు కూడా తగినంత భద్రతను ఇస్తాయి.
Also Read: ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఈ 5 చిన్న గ్యాడ్జెట్స్‌తో.. హ్యాపీగా చిల్ అవ్వండి!
కాలం మారుతున్న సాంకేతికతతో పాటు మోసాలు, సైబర్ ముప్పు సైతం పెరుగుతూ వస్తోంది. అందుకే ప్రస్తుతం స్విట్జర్లాండ్, జర్మనీ వంటి కొన్ని ఐరోపా దేశాల్లో భద్రతను మరింత పెంచడానికి 6 అంకెల ఏటీఎం పిన్‌ను కూడా వాడుతున్నారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ బ్యాంకులు ఇప్పటికీ ఆనాటి ‘కరోలిన్’ జ్ఞాపకశక్తి సూత్రాన్ని పాటిస్తూ 4 అంకెల పిన్ విధానాన్నే కొనసాగిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు మనం ఎంతో సులభంగా ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసుకుంటున్నామంటే.. దానికి కారణం ఏటీఎం ఆవిష్కర్త భార్య కరోలిన్ అని చెప్పక తప్పదు.
Also Read: సర్వీస్ ఖర్చు తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. టాప్ 10 బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఇవే!