Dogs Chasing Vehicles: రోడ్డుపై బైక్ లేదా కారులో వెళ్తుంటే.. కొన్ని సందర్భాల్లో వీధి కుక్కలు ఒక్కసారిగా వెంటపడుతూ ఉంటాయి. బిగ్గరగా మెురుగుతూ కొద్ది దూరం వరకూ అవి వెంబడిచిన అనుభవం చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. అసలు ఏమి చేయకపోయినా కుక్కలు అలా ఎందుకు ప్రవర్తిస్తాయో ఇప్పటికీ ఒక పజిల్ లా అనిపిస్తుంటుంది. అయితే కుక్కలు అలా పూనకం వచ్చినట్లుగా వాహనాల వెంట పడటం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని జంతు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాధారణంగా కుక్కలకు తాము ఉంటున్న ఏరియా అంటే చాలా ఇష్టం. తమ ప్రాంతాన్ని (Territory) మార్క్ చేసుకోవడానికి అవి రోడ్డు పక్కన ఆపి ఉంచిన బైకులు, కార్ల టైర్లపై మూత్రం పోస్తుంటాయి. తమ సామ్రాజ్యానికి సరిహద్దులుగా వాటిని పెడుతుంటాయి. అయితే మీ వాహనాన్ని వేరే వీధిలో పార్క్ చేసినప్పుడు అక్కడి కుక్కలు మీ టైర్‌పై మూత్రం పోసి ఉండొచ్చు. దీంతో ఆ వాహనంతో ఈ కుక్కల ఏరియాలోకి రాగానే టైర్ల నుంచి వచ్చే ‘పరాయి కుక్క’ వాసనను ఇవి వెంటనే పసిగడతాయి. తమ సామ్రాజ్యంలోకి ఏదో శత్రువు వచ్చేసిందనే భ్రమతో, ఆ వాసనను తరిమికొట్టడానికి వాహనంపై దాడికి దిగుతుంటాయి.
కుక్కలు.. వాహనాల వెంట పడటానికి పాత జ్ఞాపకాలు కూడా మరో కారణమై ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో ఏదైనా ఒక నిర్దిష్ట రంగు బైక్ లేదా కారు వేగంగా వచ్చి వాటిని ఢీ కొనడం, లేదంటే పిల్లలను గాయపరచడం వంటివి చేసి ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో సంబంధిత వాహనం రంగు, రూపురేఖలను కుక్కలు బాగా గుర్తుపెట్టుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. మళ్లీ అదే రకమైన వాహనం లేదా శబ్దం వినిపించగానే.. తమను తాము కాపాడుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి అవి ఆ వాహనంపైకి దూకుతాయని పేర్కొంటున్నారు.
కుక్కలు ప్రాథమికంగా వేటాడే జంతువుల (Predators) రకానికి చెందినవి. వేగంగా కదిలే ఏ వస్తువునైనా చూస్తే వాటిలో దాగి ఉన్న వేటగాడి నైజం ఒక్కసారిగా మేల్కొంటుంది. వాటి కళ్లముందు కారు లేదా బైక్ వేగంగా వెళ్తుంటే.. అది ఒక జంతువు పరిగెడుతున్నట్లుగా కుక్కలకు అనిపిస్తుంది. అందుకే ఆ కదలికను చూసి దాన్ని పట్టుకోవాలని, వేటాడాలని కుక్కలు వాహనాల వెనుక పరిగెడుతూ ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదే వాహనం నిశ్చలంగా ఆగి ఉంటే అవి అస్సలు పట్టించుకోవని స్పష్టం చేస్తున్నారు.
వాహనాల నుంచి వచ్చే పెద్ద పెద్ద హారన్ శబ్దాలు, సైలెన్సర్ సౌండ్లు కుక్కలకు తీవ్రమైన అసౌకర్యానికి, భయానికి గురి చేస్తాయని నిపుణులు అంటున్నారు. మనుషుల కంటే వాటి వినికిడి శక్తి చాలా రెట్లు ఎక్కువ కాబట్టి.. ఆ కర్ణకఠోరమైన శబ్దాలు వినబడగానే అవి డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోతాయని చెబుతున్నారు. కొన్నిసార్లు ఆ శబ్దాన్ని తట్టుకోలేక వాహనం వెంట పరిగెడుతుంటాయని తెలియజేస్తున్నారు.
Also Read: ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు డిలీట్ అయ్యాయా? టెన్షన్ వద్దు మామ.. ఇలా చేస్తే చిటికెలో రికవర్!
ఒకవేళ కుక్కలు వాహనం వెంట పడితే.. భయంతో కొన్ని పనులు అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుక్కలు వెంటపడగానే చాలా మంది భయంతో బైక్ స్పీడ్ పెంచుతారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. పైగా వేగం పెంచితే, అవి మిమ్మల్ని మరింత వేగంగా తరిమే ఛాన్స్ ఉంటుందని పేర్కొంటున్నారు. కాబట్టి కుక్కలు వస్తున్నప్పుడు బైక్ వేగాన్ని తగ్గించి, వీలైతే ఒక పక్కన ఆపేయాలని హితవు పలుకుతున్నారు. వాహనం ఎప్పుడైతే ఆగిపోతుందో వాటి వేట ప్రవృత్తి (Chasing Instinct) చల్లారుతుందని పేర్కొంటున్నారు. ఆ తర్వాత అవి మొరగడం ఆపేసి వెనక్కి వెళ్లిపోతాయని స్పష్టం చేస్తున్నారు. అయితే బైక్ ఆపిన వెంటనే అరవడం, కుక్కల కళ్లల్లోకి నేరుగా చూడటం, కాళ్లతో తన్నడం వంటివి అస్సలు చేయవద్దని హితవు పలుకుతున్నారు. ప్రశాంతంగా ఉంటే అవి వెళ్లిపోతాయని సూచిస్తున్నారు.
Also Read: ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఈ 5 చిన్న గ్యాడ్జెట్స్‌తో.. హ్యాపీగా చిల్ అవ్వండి!