India’s First Flex-Fuel Car Arrives: భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారుగా మారుతి సుజుకి వాగన్ ఆర్ ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఒకరోజు ముందు ఈ ప్రత్యేక మోడల్ ను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో విడుదల చేశారు.
ఈ కొత్త వాగన్ ఆర్ E85 ఇంధనంతో కూడా నడుస్తుంది. E85 అంటే 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారయ్యే ఇంధనం. సాధారణ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఇథనాల్ ఆధారిత వాహనాలు పర్యావరణానికి మరింత అనుకూలంగా ఉంటాయి. వాహనం నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడంలో ఇథనాల్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పెట్రోల్ లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడమే కాకుండా, పూర్తిస్థాయి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను ప్రోత్సహించే దిశగా కూడా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి తీసుకొచ్చిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
సాధారణ వాగన్ ఆర్ తో పోలిస్తే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడ ల్‌లో పలు మార్పులు చేశారు. అధిక ఇథనాల్ మిశ్రమాలతో కూడా ఇంజిన్ సమర్థవంతంగా పని చేయడానికి అవసరమైన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ అప్ డేట్లను అందించారు. ఫ్యూయల్ సిస్టమ్ లో ఉపయోగించే కొన్ని భాగాలను ప్రత్యేకంగా అప్ గ్రేడ్ చేశారు. ఇథనాల్ ప్రభావాన్ని తట్టుకునే మెటీరియల్స్ ను ఉపయోగించడం ద్వారా కారు చాలా కాలం మన్నికగా ఉండేలా రూపొందించారు.
అంతేకాకుండా, ఇంజిన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. వాహనంలో ఉపయోగిస్తున్న ఇంధనంలో ఎంత ఇథనాల్ ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా ఫ్యూయల్ ఇంజెక్షన్, దహన ప్రక్రియను ఆటోమేటిక్ గా సర్దుబాటు చేసే సాంకేతికతను ఇందులో అందించారు. దీంతో పనితీరు, ఇంధన సామర్థ్యం, ఇంజిన్ మన్నిక మధ్య బ్యాలెన్స్ ను కొనసాగించే అవకాశం ఉంటుంది.
మారుతి సుజుకి వాగన్ ఆర్ ఇప్పటికే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్ బ్యాక్ లలో ఒకటి. కుటుంబ అవసరాలకు అనుకూలమైన డిజైన్, సరసమైన ధర, తక్కువ మెయింటెన్స్ ఖర్చుల కారణాలతో ఈ కారు లక్షలాది మంది భారతీయుల నమ్మకాన్ని సంపాదించింది. ఇప్పుడు అదే మోడల్ ను ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో తీసుకురావడం వల్ల ఈ కొత్త సాంకేతికత మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలో తొలి E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ కారుగా వాగన్ ఆర్ ఆవిష్కరణ భారత ఆటోమొబైల్ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.
Read Also: హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేశాయ్.. ధర మరీ అంత తక్కువా?