Jwalapuram: తెలుగు నేలపై ఆదిమానవుడు నడిచిన అద్భుత ప్రదేశం. ఒకప్పటి అఖండ భారతంలో మనిషి ఎప్పుడు అడుగు పెట్టాడనే చరిత్రకు కీలక సాక్ష్యం. ఖండాలు దాటిన ఆదిమానవుడి మజిలీకి ఆంధ్రప్రదేశ్‌లోని జ్వాలాపురమే సజీవ సాక్ష్యం. నంద్యాల జిల్లాలోని ఆ ప్రాంతం.. ఓ రకంగా భారతదేశ రాతి యుగ చరిత్ర దిశనే మార్చేసింది. చరిత్ర చెబుతున్నట్లు 60 వేల ఏళ్లు కాదు.. 74 వేల ఏళ్ల క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడనే కొత్త విషయాన్ని జ్వాలాపురం రుజువు చేస్తోంది. అసలు.. ఆదిమానవుడికి, ఆంధ్రాకు ఉన్న లింకేంటి?
ఏపీలోని జ్వాలాపురంలో ఆదిమానవుడి ఆనవాళ్లు
ఆదిమానవుడి ప్రస్తావన.. చరిత్ర పుస్తకాల్లో ఉంది. అదే.. ఆదిమానవుడి ఆనవాళ్లు.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా జ్వాలాపురంలోని అరుదైన బూడిద కింద దాగున్నాయి. ఈ చారిత్రక ఆనవాళ్లపై అవగాహన లేని స్థానికులు.. ఆ బూడిదను టన్నుకు వెయ్యి చొప్పున అమ్మేసుకుంటున్నారు. శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం.. సుమారు 74 వేల ఏళ్ల కిందట.. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో టోబా అనే అగ్నిపర్వతం పేలింది. ఆ పేలుడు ప్రభావం.. భూమిపై పదేళ్ల పాటు ఉంది. ఆ విస్ఫోటన వెదజల్లిన లావా.. బూడిదలా మారి ఓ పొరలా భూమి మొత్తాన్ని కప్పేసింది.
బూడిద కింద ఆదిమానవుడి ఆనవాళ్లు
సూర్యకాంతికి అడ్డుగా మారింది. దాంతో.. ముంచుయుగం నాటి పరిస్థితులు ఏర్పడి.. మానవ జాతి అంతా అంతరించే ప్రమాదంలో పడింది. కొంతమంది మనుషులు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి బతికి బయటపడ్డారు. ఆ లావా భారత్‌లోనూ కొన్న చోట్ల పడింది. జ్వాలాపూరంలోనూ పెద్ద ఎత్తున బూడిద పేరుకుపోయింది. ఈ లావా బూడిదను పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించి.. తవ్వకాలు జరిపారు. ఆ బూడిద పొరల కిందే.. ఆదిమానవుడు వాడిన రాతి పనిముట్ల ఆనవాళ్లు కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.
74 వేల ఏళ్ల క్రితమే ఆంధ్రాలో ఆదిమానవుడి సంచారం!
సుమారు 60 వేల ఏళ్ల క్రితం ఆదిమానవుడు ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చాడనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తల్లో ఓ అంచనా ఉండేది. కానీ.. 74 వేల ఏళ్ల క్రితమే ఆదిమానవుడు ఏపీలో సంచరించాడనే కొత్త ప్రతిపాదనను జ్వాలాపురం తెరపైకి తీసుకొచ్చింది. ఒకరకంగా.. భారతదేశ రాతి యుగ చరిత్ర దిశనే మార్చేసింది ఈ ప్రాంతం. జ్వాలా అంటే అగ్ని. అగ్నిపర్వతం బూడిద పడిన ప్రాంతం కాబట్టి.. ఈ గ్రామానికి జ్వాలాపురం అనే పేరు వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ ఊరికి దగ్గర్లోని రాతి గుహల్లో.. ఆది మానవుడు వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. వాటినే.. పెయింటెడ్ రాక్ షెల్టర్స్‌గా పిలుస్తారు. ఇవన్నీ ప్రపంచ మానవాళి చరిత్రలో కీలకమైన ఘట్టాలను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయని చరిత్రకారులు చెబుతున్నారు.
ఇప్పటికే మాయమైపోయిన 90 శాతం బూడిద
ఆఫ్రికాలో దొరికిన పనిముట్లకు, జ్వాలాపురంలో దొరికిన పరికరాలకు చాలా దగ్గరి పోలికలున్నాయి. కాబట్టి.. 74 వేల ఏళ్లకు ముందే మనిషి ఇక్కడికి వచ్చి ఉండొచ్చనే అంచనాలున్నాయి. అందువల్ల.. ఆధునిక మానవుడి గమనాన్ని, మన దేశంలో పూర్వ రాతియుగ చరిత్రను తిరగరాసే అద్భుతమైన సాక్ష్యంగా జ్వాలాపురం నిలిచింది. కానీ.. ఇదంతా గతం కాబోతోంది. ఎందుకంటే.. ఈ బూడిద కింద ఉన్న ఆదిమానవుడి చరిత్ర కనుమరుగు కాబోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే.. దాదాపు 90 శాతం బూడిద మాయమైపోయింది. ఇంకా.. బూడిద కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. అందులోని చెట్ల అవశేషాలు, మనుషుల ఆయుధాలను వేరు చేసి.. బూడిదను మూటల్లో ఎత్తి అమ్మేస్తున్నారు.
2004 నుంచి రెండేళ్ల పాటు పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలు
యాగంటి చుట్టుపక్కల అలాంటి గుహలు చాలానే ఉన్నాయి. జీవ పరిణామ సిద్ధాంతానికి.. ఉమ్మడి కర్నూలు జిల్లా బిల్లసర్గం గుహలు చాలా కీలకమైనవి. భారతీయ పురావస్తు చరిత్ర పితామహుడు రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్.. మొదటిసారి ఈ గుహల గురించి తెలిపారు. మళ్లీ.. ఈ గుహల్లో మనిషి జాడ కోసం ఆర్కియాలజిస్టులు గాలిస్తున్న నేపథ్యంలో.. ఈ జ్వాలాపురంలో ఆదిమానవుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. 2004 నుంచి రెండేళ్ల పాటు ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు.
కర్ణాటకలో భద్రంగా తవ్వకాల్లో బయటపడిన వస్తువులు
ఆ సమయంలోనే.. ఇది అగ్నిపర్వతపు లావా వల్ల ఏర్పడిన బూడిదగా గుర్తించారు. ప్రస్తుతం.. జ్వాలాపురం తవ్వకాల్లో బయటపడిన వస్తువులని కర్ణాటకలో భద్రపరిచారు. రాతి పనిముట్లు, ముఖ్యమైన అవశేషాలను.. బళ్లారిలోని రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ మ్యూజియంలో భద్రపరిచారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిసరాలు మానవ జాతి చరిత్రకు, భారతదేశ రాతి యుగ చరిత్రకు గొప్ప ఆధారాలు కలిగి ఉన్నాయి. ఈ ప్రదేశాలను స్థానికులు విధ్వంసం చేయకుండా.. కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.