Journalists Safety: రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల కేసులను విచారించేందుకు, వారి రక్షణకు చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ఉన్నత స్థాయి కమిటీని (హై పవర్ కమిటీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు నవంబర్ 4, 2025న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ హై పవర్ కమిటీకి రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖా మంత్రి (I&PR) అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కమిటీలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు కీలక సభ్యత్వం కల్పించారు. సభ్యులుగా హోం శాఖ, పొలిటికల్ విభాగం, సాధారణ పరిపాలన (I&PR) శాఖల ముఖ్య కార్యదర్శులు, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఉంటారు. సమాచార, పౌరసంబంధాల శాఖ అదనపు డైరెక్టర్/డైరెక్టర్ కమిటీకి మెంబర్-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ఈ కమిటీలో కేవలం అధికారులే కాకుండా, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులకు కూడా స్థానం కల్పించడం గమనార్హం. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ), తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TSUWJ), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF), తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ (TAEMJ), తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ (TEMJU) సహా మొత్తం 8 ప్రముఖ మీడియా యూనియన్ల నుండి ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ కమిటీ రెండేళ్ల పాటు పనిచేస్తుంది. జర్నలిస్టులపై జరిగిన దాడులు లేదా దౌర్జన్యాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను ఈ కమిటీ స్వీకరిస్తుంది. ఆ ఫిర్యాదులపై లోతుగా విచారణ జరిపి, తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తూ నివేదిక సమర్పిస్తుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా నివారణ చర్యలను కూడా సూచిస్తుంది. కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.