Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ విజయశాంతి సుడిగాలి ప్రచారం నిర్వహించారు. షేక్‌పేటలో జరిగిన మైనారిటీ సమావేశంలో మహేష్ గౌడ్ మాట్లాడుతూ, నవీన్ యాదవ్ విజయం బీసీ, మైనారిటీల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం, జనాభా ప్రాతిపదికన అధికారిక వాటా కోసం పోరాడుతున్నారని, ఆయన ఆలోచనల మేరకే జూబ్లీహిల్స్‌లో బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిందని మహేష్ గౌడ్ గుర్తుచేశారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మైనారిటీలకు కాంగ్రెస్ ఇస్తున్న ప్రాధాన్యతను నిరూపించామన్నారు. నవీన్ యాదవ్ విద్యావంతుడని, స్థానికుడని, ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నందున, జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని, ఆయన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు
రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్సీ విజయశాంతి, కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌లది ఒక “గజదొంగ ఫ్యామిలీ” అని, పదేళ్లపాటు రాష్ట్రాన్ని దారుణంగా లూటీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ ప్రజలపై విషం జల్లుతూ, మాయమాటలతో మోసం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ చేసిన అప్పులు, తప్పుల వల్లే రాష్ట్రం అతలాకుతలమైందని, కాంగ్రెస్ పథకాల అమలుకు కొంత ఆలస్యం అవుతోందని అన్నారు. ప్రజలు తెలివిగా ఆలోచించి, మళ్లీ వారి ఉచ్చులో పడకుండా, బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్‌ను గెలిపించాలని విజయశాంతి కోరారు.