Hyderabad News: రియల్ ఎస్టేట్ వ్యాపారి చంద్రశేఖర్ తనపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసు నమోదయ్యిందంటూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనకు ముందు ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సీఎస్‌కే రియల్టర్స్, సురేశ్‌కుమార్ అగర్వాల్, అతని కుమారుడు రక్షిత్ అగర్వాల్ తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారే తనపై తప్పుడు కేసు పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం చంద్రశేఖర్ ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
చంద్రశేఖర్ ఆరోపణలపై సైఫాబాద్ సీఐ స్పందించారు. ఈ కేసు నమోదుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. సురేశ్ కుమార్ అగర్వాల్ కుమారుడు రక్షిత్ అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదైనట్లు సీఐ తెలిపారు. ఫిర్యాదు ప్రకారం.. అక్టోబర్ 30వ తేదీ రాత్రి చంద్రశేఖర్ ఏడుగురితో కలిసి సురేశ్ అగర్వాల్ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని వాచ్ మెన్ చెప్పినా వినకుండా.. చంద్రశేఖర్ అండ్ కో బలవంతంగా లోపలికి ప్రవేశించి దౌర్జన్యం చేసి బెదిరించినట్లు రక్షిత్ అగర్వాల్ ఆరోపించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయినట్లుగా.. వాటిని ఫిర్యాదుకు జతచేసినట్లు సీఐ పేర్కొన్నారు.
అంతేకాకుండా.. అదే రోజు రాత్రి తన తండ్రి సురేశ్ అగర్వాల్‌ను ఓ ప్రాంతానికి పిలిపించి.. డబ్బులివ్వాలంటూ చుట్టుముట్టి బెదిరించారని కూడా రక్షిత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో.. తమకు రక్షణ కల్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రక్షిత్ అగర్వాల్ ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే.. పోలీసులు చట్టప్రకారం ఈ నెల 3న చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. కేసు విచారణ నిమిత్తం చంద్రశేఖర్‌కు ఫోన్ చేయగా.. ప్రస్తుతం తాను అందుబాటులో లేనని, రావడానికి సమయం పడుతుందని చెప్పినట్లు సైఫాబాద్ సీఐ వివరించారు. ఈ పరిణామాలు రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ALSO READ: OTT Movie : భార్య చనిపోవడంతో మరో అమ్మాయితో… దెయ్యం పాపతో ఆ పనులేంటి భయ్యా ?