Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( International Cricket Stadium ) నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ ( Hyderabad International Cricket Stadium ) మహానగరంలో ఉప్పల్ లాంటి అంతర్జాతీయ స్టేడియం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఉప్పల్ స్టేడియంలో తరచూ అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్టేడియం నిర్మాణానికి కంకణం కట్టుకున్నారట.
అంతర్జాతీయంగా హైదరాబాద్ కు గుర్తింపు తీసుకువచ్చేందుకు మరో స్టేడియాన్ని నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారట. చారిత్రాత్మక లార్డ్స్, సిడ్నీ అలాగే మెల్ బోర్న్ లాంటి దిగ్గజ స్టేడియాలకు తీసుకొని విధంగా ఫ్యూచర్ సిటీలో రెండేళ్లలోనే కొత్త స్టేడియాన్ని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్టేడియం నిర్మాణంపై ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ఇందులో టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా ఉంటారట.
వాళ్లందర్నీ విదేశాలకు తీసుకువెళ్లి.. అక్కడి స్టేడియాలపై అధ్యయనం చేయనుందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రవాణా ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని కందుకూరులో ఈ స్టేడియం నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారట. దీనికోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారట సీఎం రేవంత్ రెడ్డి. జనవరి మాసంలో దీనిపై తొలి అడుగు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి ఊహించినట్లుగా జరిగితే, అంతర్జాతీయంగా హైదరాబాద్ కు మంచి బ్రాండింగ్ వస్తుంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలలోని పిచ్ లు చాలా భయంకరంగా ఉంటాయి. విదేశీ పిచ్ లలో టీమిండియా ప్లేయర్లు పెద్దగా రాణించబోరన్న సంగతి తెలిసిందే. మొన్నటి నుంచి జరుగుతున్న ఆస్ట్రేలియా పిచ్ లపై గిల్ లాంటి ప్లేయర్లు దారుణంగా విఫలం అవుతున్నారు. వాళ్లు వేసే బౌన్సర్లకు గిల్ హెల్మెట్లే పగిలిపోతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలలోని పిచ్ ల తరహాలోనే హైదరాబాద్ లో స్టేడియం నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అలా పిచ్ సిద్ధం అయితే, టీమిండియా లాభమే జరుగుతుంది. అటు ఐపీఎల్ మ్యాచ్ లు కూడా ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్‌లో జరుగుతాయి. ఇలాంటి తరుణంలోనే, హైదరాబాద్ లో స్టేడియం నిర్మాణానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా ముందుకు వస్తే, బాగుంటుందని అంటున్నారు ఫ్యాన్స్.