Addanki Politics: వరుస ఓటములతో ఆ నియోజకవర్గంలో వైసిపి పరిస్ధితి దారుణంగా మారింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అక్కడ కలిసి రావడం లేదు.. ప్రతిసారి అభ్యర్ధిని మారుస్తూ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. దాంతో స్థిరమైన నాయకత్వం లేక అక్కడ కేడర్ పరిస్థితి అనాధల్లా తయారైంది. ప్రస్తుతం అక్కడ జగన్ ఇన్చార్జ్‌ని నియమించినా ఆయన చుట్టపుచూపుగా వచ్చి పోతున్నారే తప్ప పార్టీ వ్యవహారాలను అసలు పట్టించుకోవడం లేదంట. దాంతో ప్రస్తుత ఇంచార్జ్ ని మార్చాలని క్యాడర్ గగ్గోలు పెడుతోంది. ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏది? అక్కడ వైసీపీకి అధిష్టానం ఇప్పటికైనా రిపేర్లు మొదలుపెడుతుందా?
అద్దంకి ఇన్చార్జ్‌పై వైసీపీ శ్రేణుల్లో వ్యతిరేకత
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గ వైసీపీ క్యాడర్ లో ప్రస్తుత ఇన్చార్జి తీరుపట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గ వైసిపి బాధ్యతలను చూస్తున్న పాణెం చిన్న హనిమిరెడ్డిని మార్చాలనే డిమాండ్ తెరపైకి తెస్తోంది స్థానిక వైసీపీ క్యాడర్. గత ఎన్నికల్లో అద్దంకి నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన హనిమిరెడ్డి పార్టీ గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశారంట. ఆయన నాన్ లోకల్ వ్యక్తి కావడంతో చుట్టపు చూపుగా రావడం, పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప మిగిలిన సమయంలో హనిమిరెడ్డి నియోజకవర్గంలో అడ్రస్ లేకుండా పోతున్నారంట.
మంత్రి గొట్టిపాటిపై విమర్శలకే పరిమితమవుతున్న హనిమ రెడ్డి
హనిమిరెడ్డిని ఇలాగే కంటిన్యూ చేస్తే నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితి పూర్తిగా దిగజారిపోతుందని కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. అద్దంకి నియోజకవర్గంలో వరుస ఓటములతో కుదేలైన పార్టీని గాడిలో పెట్టి, బలోపేతం చేయడానికి ఆయన వీసమెత్తు ప్రయత్నం కూడా చేయడం లేదంటున్నారు. అద్దంకి వచ్చిన ప్రతిసారీ అద్దంకి ఎమ్మెల్యే, ప్రస్తుత రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ పై విమర్శలు చేయడం తప్ప పార్టీని పట్టించుకోవడంలేదని క్యాడర్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ వ్యవహార శైలిని చూస్తున్న వైసీపీ క్యాడర్.. హనిమిరెడ్డి మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి తప్ప.. చేతల్లో మాత్రం చేవ ఉండడం లేదని సెటైర్లు విసురుతున్నాయి. ఇప్పటికైనా హనిమిరెడ్డిని పక్కన పెట్టి లోకల్ గా ఉండే వ్యక్తికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని స్ధానిక పార్టీ శ్రేణులు కోరుతున్నాయి
కృష్ణచైతన్యను కాదని హనిమరెడ్డికి అవకాశం
2019లో అద్దంకి వైసీపీ ఇన్చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడు బాచిన కృష్ణ చైతన్య వున్నారు . అప్పట్లో చైతన్య శాప్ నెట్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికలకు ముందు కృష్ణ చైతన్యను పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం హనిమిరెడ్డిని తెర పైకి తెచ్చింది. ఎన్నికలకు కొన్ని నెలలకు ముందు హనిమిరెడ్డికి అద్దంకి పార్టీ బాధ్యతలను అప్పగిండంతో అద్దంకి వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఎన్నికల సమయంలో హనిమిరెడ్డి, కృష్ణచైతన్యలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుని పార్టీ పరువుని బజారున పడేశారు.
గొట్టిపాటి చేతిలో పరాజయం పాలైన హనిమిరెడ్డి
టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించిన కృష్ణ చైతన్య ఇక చివరకు టిక్కెట్ దక్కదని తెలియడంతో తండ్రితో కలిసి సైకిల్ ఎక్కేశారు. వైవీ సుబ్బారెడ్డి రికమండేషన్‌తోనే హనిమిరెడ్డికి అద్దంకి టికెట్ దక్కిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. వైవి. సుబ్బారెడ్డి, హనిమిరెడ్డి ఇద్దరు బిజినెస్ పార్ట్‌నర్స్ కావడంతో జగన్ దగ్గర వైవీ సుబ్బారెడ్డి కథ నడిపించారంట. ఎన్నికల్లో హనిమిరెడ్డి కూడా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎక్కడ తగ్గలేదు. నియోజకవర్గంలో జగన్ బహిరంగ సభలతో పాటు పార్టీ నేతల కోసం భారీ స్ధాయిలో డబ్బు ఖర్చు చేశారు. కృష్ణ చైతన్య వర్గాన్ని తనవైపు తిప్పుకోవడానికి పెద్దఎత్తున పంపకాలు చేశారన్న ప్రచారం జరిగింది. అయితే ఇంత చేసినా ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ చేతిలో 24వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి చేరిన గొట్టిపాటి రవి
వైసిపి ఆవిర్భావం తర్వాత అద్దంకిలో ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి మాత్రమే వైసీపీ జెండా ఎగిరింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుండి ప్రస్తుత విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్పుడు రాష్టంలో టీడీపీ అధికారంలో ఉండటంతో రవికుమార్ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అ తర్వాత 2019లో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య వైసీపీ నుండి పోటీ చేయగా టీడీపీ నుండి గొట్టిపాటి రవికుమార్ పోటీ చేసి మరోసారి విజయబావుటా ఎగరేశారు. ఇక 2024 ఎన్నికల్లో గొట్టిపాటి వైసీపీకి మరోసారి షాక్ ఇచ్చారు. గత నాలుగు ఎన్నికల నుంచి వరుసగా గెలుస్తున్న గొట్టిపాటి రవికుమార్‌కు చంద్రబాబు మంత్రివర్గంలోప్రాధ్యానత కలిగిన విద్యుత్ శాఖ దక్కింది.
చంద్రబాబు మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న గొట్టిపాటి
గొట్టిపాటికి మంత్రి పదవి కూడా దక్కడంతో.. ఇక అద్దంకిలో ఆయన్ని ఎదుర్కోవడం అసాధ్యమన్న భావనతోనే అక్కడి వైసీపీ నేతలు సైలెంట్ అయిపోతున్నారంట. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం, లేదా ఆయన కుమారుడు ప్రస్తుత చీరాల వైసీపీ ఇన్చార్జ్ కరణం వెంకటేష్‌లలో ఒకరిని అద్దంకి ఇన్చార్జ్‌గా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కరణం కుటుంబానికి అద్దంకిలో గట్టి క్యాడర్ ఉండటం పార్టీకి కలిసొస్తుందని జగన్ భావిస్తున్నారంట. సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటిను తట్టుకుని నిలబడాలంటే అది కరణం కుటుంబం వల్లే అవుతుందని స్ధానిక వైసీపీ క్యాడర్ కూడా అభిప్రాయపడుతోంది.
హనిమిరెడ్డి స్థానంలో కరణంను నియమిస్తారని ప్రచారం
అయితే కరణం, గొట్టిపాటి ఉప్పు నిప్పుల్లే ఉంటారు. గతంలో ఇద్దరు టీడీపీలో ఉన్నప్పుడే నిరంతరం యుద్దం జరిగేది. అలాంటిది ఇప్పుడు వారిద్దరు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఒకేచోట ఉంటే ఏం జరుగుతుందో అన్న గుబులు రాజకీయవర్గాలతో పాటు స్థానికుల్లో కూడా వ్యక్తమవుతుంది . ఇప్పటికే పార్టీలో యాక్టివ్‌గా లేని ఇన్చార్జ్‌లను తొలగించే పనిలో పడ్డారు వైసిపి అధ్యక్షుడు. ఆ క్రమంలోనే పర్చూరు ఇన్చార్జ్‌గ ఉన్న యడం బాలాజీను తొలగించి గాదె మధుసూదన్ రెడ్డిని నియమించారు. ఈ నేపధ్యంలో అద్దంకి నియోజకవర్గంలోను హనిమిరెడ్డిని పక్కన పెట్టి కరణం కుటుంబానికి ఇంఛార్జీ భాధ్యతలు ఇస్తారనే టాక్ స్థానికంగా వినిపిస్తోంది.