Hanmakonda News: హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి వెంబడి ఉన్న పంట పొలాలు, పత్తి చేనుల్లో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రెండు వేల నాటు కోళ్లను వదిలివెళ్లడం స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా వేలాది కోళ్లు రోడ్ల వెంట, పొలాల్లో ప్రత్యక్షమవడంతో గ్రామస్తులు వాటిని పట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
కోళ్ల కోసం ఎగబడ్డ జనం.. మాంసం విందు
విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పొలాల్లో, పత్తి చేనుల్లో పరుగులు తీస్తున్న నాటు కోళ్లను పట్టుకునేందుకు పోటీ పడ్డారు. దొరికిన కాడికి కోళ్లను బస్తాల్లో వేసుకుని తీసుకెళ్లిన జనం, ఇళ్ల వద్ద చికెన్ విందు చేసుకుంటున్నారు. సాధారణంగా అధిక ధర పలికే నాటు కోళ్లు ఉచితంగా దొరకడంతో స్థానికులకు ఈ రోజు పండుగ వాతావరణాన్ని తలపించింది.
పంట నష్టం.. రైతులు ఆందోళన
కోళ్ల కోసం జనం పొలాల్లోకి దూసుకెళ్లడంతో తమ పంట పొలాలు, పత్తి చేనులు పాడైపోయాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని వారు ఆందోళన చెందుతున్నారు. విలువైన నాటు కోళ్లను ఎవరు, ఎందుకు వదిలివెళ్లారనేది అంతుపట్టని రహస్యంగా మారింది.
పోలీసుల విచారణ..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కోళ్లు ప్రమాదవశాత్తు పడిపోయాయా..? లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చి వదిలేశారా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి కీలక ఆధారాల కోసం రహదారి వెంబడి ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది లక్షల రూపాయల విలువైన వ్యవహారం కావడంతో దీని వెనుక వ్యాపారపరమైన కోణం ఏమైనా ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఆరోగ్య స్థితిపై పశు వైద్య శాఖ ఆరా
ఇంత పెద్ద సంఖ్యలో నాటు కోళ్లను వదిలివేయడం వెనుక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. కోళ్లకు ఏదైనా వైరస్ లేదా వ్యాధి సోకిందా అనే చర్చ స్థానికుల్లో జరుగుతోంది. దీనిపై స్పందించిన పశు వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని కోళ్ల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. పరీక్షల ఫలితాలు వచ్చే వరకు వాటిని ఎవరూ వినియోగించవద్దని అధికారులు గ్రామ ప్రజలకు సూచించారు.
మిస్టరీగా మారిన ఘటన
కోళ్లు వదిలివెళ్లిన ఘటనకు సంబంధించి కారణాలు ఏంటనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. వ్యాధి భయంతో వ్యాపారులు వదిలేశారా..? లేదా రవాణాలో ప్రమాదం జరిగిందా..? అన్నది పోలీసుల, పశు వైద్య శాఖ అధికారుల విచారణలో తేలనుంది. ప్రస్తుతం ఈ అసాధారణ సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే గాక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారింది.
ALSO READ: HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం