2011లో ప్రారంభమైన సిరియన్ అంతర్యుద్ధం
ప్రపంచంలో అత్యంత క్రూరమైన, సుదీర్ఘమైన, పాపులరిటీకి దూరంగా ఉన్న యుద్ధం సిరియా అంతర్యుద్ధం. దశాబ్ధాలుగా అక్కడి ప్రజలు పీల్చిన గాలిలో రక్తం వాసనే ఎక్కువ. చిరిగిన విస్తరిలో భోజనం చేస్తూ బతికిన జీవితాలు అవి. పూర్తిగా తూట్లు పడిన దేహంలో ఉన్న ఆత్మల్లా అక్కడి ప్రజలు జీవించారు. అరవై ఏళ్ల పాటు ఒకే పాలన కింద ఉన్న దేశాన్ని తీవ్రవాదులు తుక్కు తుక్కు చేశారు. 2011లో ప్రారంభమైన సిరియన్ అంతర్యుద్ధం లక్షలాది మంది జీవితాలను నాశనం చేసింది. దేశం లోపల నుండి, బయట నుండి పనిచేసిన శక్తులు ఆ దేశాన్ని కనీసం ఆరు ‘స్వతంత్ర’ ప్రాంతాలుగా విభజించారు. ఇది ప్రపంచం దాదాపు మరచిపోయిన యుద్ధం.
నవంబర్ 30న చేసిన మెరుపు దాడి
అయితే, ఇప్పుడు చక్రం మళ్లీ మొదటికొచ్చింది. 12 సంవత్సరాల కిరాతక యుద్ధం తర్వాత మరోసారి రెబల్స్ రాజ్యం దక్కించుకున్నారు. నవంబర్ 30న చేసిన మెరుపు దాడిలో తిరుగుబాటుదారులు అలెప్పోను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డిసెంబరు 8న హయాత్ తహ్‌రీర్ అల్- షమ్ తిరుగుబాటుదారులు అకస్మాత్తుగా చేసిన దాడితో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నీ వారి స్వాధీనంలోకి వచ్చాయి. కేవలం 10 రోజుల్లో రాజధాని నగరం డమాస్కస్‌లోకి ప్రవేశించిన రెబల్స్ ప్రెసిడెంట్ ప్యాలెస్‌లో జెండా పాతారు.
1963 సిరియా అధికారం చేపట్టిన అరబ్ సోషలిస్ట్ గ్రూప్ బాత్ పార్టీ
1963 తిరుగుబాటులో సిరియాలో అధికారంలోకి వచ్చిన అరబ్ సోషలిస్ట్ గ్రూప్ అయిన బాత్ పార్టీ ఇప్పుడు కుప్పకూలిపోయింది. 50 ఏళ్ల అస్సాద్ కుటుంబ పాలను ముగిసింది. సిరియాలో రష్యా, ఇరాన్‌ల ప్రభావాన్ని రెబల్స్ గ్రూపులు భారీ దెబ్బ కొట్టాయి. దశాబ్ధాల సంఘర్షణలో క్లిష్టమైన సమయాల్లో అస్సాద్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మిత్రదేశాలకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఎలాంటి సైనిక చర్యలు లేకుండానే రెబల్ శక్తులు రాజధానిలోకి ప్రవేశించాయి. కార్లలో, కాలినడకన వేలాది మంది ప్రజలు డమాస్కస్ సెంటర్లో చేరి, 50 ఏళ్ల అస్సాద్ కుటుంబ పాలన నుండి స్వేచ్ఛ వచ్చిందంటూ నినాదాలు చేశారు.
హమా, హోమ్స్, డేరా గ్రామీణ ప్రాంతాల్లో సిరియా సైన్యం మకాం
ఇటీవల, బంగ్లాదేశ్, శ్రీలంకలో జరిగినట్లు అల్-రౌదా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లోపల ప్రజలు వీరంగం సృష్టించారు. సిరియా ప్రభుత్వం వేలాది మందిని నిర్బంధించిన డమాస్కస్ శివార్లలోని పెద్ద జైలు నుండి ఖైదీలను విడుదల చేశారు. ఇన్నాళ్లుగా అస్సాద్‌కు కీలక మద్దతుగా ఉన్న హిజ్బుల్లా, తన బలగాలన్నింటినీ ఉపసంహరించుకుంది. అస్సాద్ పాలన ముగిసినట్లు సిరియా ఆర్మీ కమాండ్ డిసెంబర్ 8న అధికారులకు తెలియజేసింది. అయితే, హమా, హోమ్స్, డేరా గ్రామీణ ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సిరియా సైన్యం ప్రకటించింది.
అస్సాద్ రష్యాలో తలదాచుకున్నాడనే అభిప్రాయం
గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న ఉద్రిక్త పరిస్థితులపై బహిరంగంగా మాట్లాడని అస్సాద్, అదే డిసెంబర్ 8న డమాస్కస్ నుండి ఎటో వెళ్లిపోయినట్లు సిరియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. అప్పటికింకా.. రెబల్స్ రాజధానిలోకి ప్రవేశించలేదు. సైన్యం మోహరించే సంకేతం కూడా లేదు. కానీ, అస్సాద్ పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. రష్యాలో తలదాచుకున్నాడని అంతా చెబుతున్నప్పటికీ.. ఇప్పుడు అస్సాద్, ఆయన భార్య అస్మా, పిల్లల ఆచూకి మాత్రం తెలియలేదు.
రెబల్ గ్రూప్ హయాత్ తహ్‌రీర్ అల్- షమ్ చేతిలో సిరియా
అయితే, శాంతియుతంగా అధికారాన్ని అప్పగించాలని ఆదేశాలు ఇవ్వడంతో అస్సాద్ పదవీ విరమణ చేసి దేశం విడిచి వెళ్లినట్లు రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. ప్రస్తుతం, పూర్తి కార్యనిర్వాహక అధికారాలు రెబల్ గ్రూప్, హయాత్ తహ్‌రీర్ అల్- షమ్ చేతికి వచ్చేసాయి. ఈ అనూహ్య పరిణామాన్ని సిరియన్లు సంతోషంగా స్వాగతించారంటూ… సిరియా ప్రధాన మంత్రి మహ్మద్ ఘాజీ అల్-జలాలీ ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఈ విజయం ఇస్లామిక్ స్టేట్ విజయంగా హయాత్ తహ్‌రీర్ అల్- షమ్ కమాండర్ అబూ మొహమ్మద్ అల్-గోలానీ పేర్కొన్నారు.
తుర్కియే మద్దతుగల సిరియన్ దళాలు
ఇది, సిరియా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ప్రయత్నాల్లో చెప్పుకోదగ్గ పరిణామం అనుకోవాలి. అయితే, ఈ మార్పు గురించి చర్చించడానికి సిరియా ప్రధాని.. రెబల్స్ కమాండర్ అల్-గోలానీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, తుర్కియే-మద్దతుగల సిరియన్ దళాలు ఉత్తర సిరియాలోని మన్‌బిజ్ ప్రాంతంలో దాదాపు 80% ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ కుర్దిష్ దళాలపై విజయానికి దగ్గరగా ఉన్నాయని టర్కీ భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ డిసెంబర్ 7న దోహాలో సిరియా కోసం U.N. రాయబారి గీర్ పెడెర్సన్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఐక్యరాజ్య సమితి రెజల్యూషన్ 2020-2024
సిరియాలో పరిస్థితిని స్థిరీకరించడానికి అవసరమైన చర్యల గురించి చర్చించినట్లు సమాచారం. అయితే, తాజాగా సెర్గీ లావ్‌రోవ్ మాట్లాడుతూ సిరియాను ఆక్రమించిన హయాత్ తహ్‌రీర్ అల్- షమ్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి రెజల్యూషన్ 2020-2024 ప్రకారం, రెబల్స్ కట్టుబడి ఉండాలనీ.. దాన్ని అతిక్రమించడం అనర్థానికి దారి తీస్తుందనీ.. సిరియన్ ఆర్మీకి సైనికపరంగా రష్యా అండగా ఉంటుందని వెల్లడించారు.
సిరియన్ ప్రజలకు మద్దతు ఇవ్వడానికి రష్యా సిద్ధం
ఇక, హయాత్ తహ్‌రీర్ అల్- షమ్, సిరియాను తన సొంతం చేసుకున్నప్పటికీ.. ఇది సిరియాలో మరో భయంకరమైన సంఘర్షణకు దారితీసే పరిస్థితుల లేకపోలేదు. ఇప్పుడు, సిరియన్లు పూర్తి స్థాయి అంతర్యుద్ధాన్ని ఒంటరిగా ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే, ఇందులో రష్యా కొన్ని పరిస్థితులలో సిరియన్ ప్రజలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. అస్సాద్ మిత్రదేశమైన రష్యా, అసద్‌కు సహాయం చేయడానికి సిరియా అంతర్యుద్ధంలో 2015లో జోక్యం చేసుకుంది. అయితే, మూడేళ్లుగా రష్యా సైనిక వనరులు ఎక్కువగా ఉక్రెయిన్‌లో ఉండటంతో, ఈసారి సిరియాలో పరిస్థితిని ప్రభావితం చేసే సామర్థ్యం చాలా పరిమితంగా కనిపిస్తోంది. కానీ, ప్రస్తుతం సిరియాలో రెండు మిలటరీ ఫెసిలిటిస్‌ని నిర్వహిస్తున్న రష్యా సమయం చూసి, స్పందించే అవకాశం లేకపోలేదు.