కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీ హయాంలోని అక్రమాలు, అవినీతిపై ప్రత్యేక ఫోకస్ పెడుతుంది.. ఆ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్‌రెడ్డి, ఎంపీ వైసీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్‌రెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రరెడ్డిలపై నమోదవుతున్న కేసులు, అవినీతి ఆరోపణలు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.
ఆ ముగ్గురి వారుసలు ఎప్పుడూ రాజకీయంగా ఫోకస్ అవ్వలేదు. అయితే తమ వారి అధికారబలంతో అవినీతి అక్రమాలకు పాల్పడడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ రాజ్య సభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి ఏపి హైకోర్టునాశ్రయించారు. డిసెంబర్ రెండో తేదీన మంగళగిరిలో సిఐడి పోలీసులు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి మీద ఎ1గా కేసు నమోదైంది. తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని కేవీరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు కేసుపెట్టారు. అదే కేసులో ముందస్తుబెయిల్ కోసం వైవి విక్రాంత్ రెడ్డి ఎపి హైకోర్టును ఆశ్రయించారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సీరియస్‌గా ఉండటంతో విక్రాంత్‌కు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కుమారుడికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రోజుకో షాకిస్తోంది. ఇప్పటికే సజ్జల రామకృష్ణను టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో టార్గెట్ చేస్తున్న ప్రభుత్వం.. ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిని సోషల్ మీడియా పోస్టుల విషయంలో టార్గెట్ చేస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలోని పలు చోట్ల భార్గవ్ రెడ్డిపై నమోదైన కేసుల్ని క్వాష్ చేయాలని ఆయన సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు.
Also Read: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో.. వైసీపీ నేతలు కొట్లాట..
రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వైసీపీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగా అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సజ్జల భార్గవ్ రెడ్డిపైనా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఆయన సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దానిపై విచారణకు నిరాకరించిన సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసి షాక్ ఇచ్చింది.
ఇక విజయసాయిరెడ్డి అల్లుడి సొంత సోదరుడు శరత్‌చంద్రారెడ్డికి కూడా కేసులు ఉచ్చు బిగుసుకుంటుంది. అరబిందో శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్నారు. ని ఢిల్లీ మద్యం సిండికేట్లకు శరత్ చంద్రారెడ్డి సారథ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించడం కలకలం రేపింది. ఇప్పుడు కాకినాడ పోర్టు, సెజ్ అవినీతిలో కూడా శరత్ చంద్రారెడ్డి హైలెట్ అవుతున్నారు . పోర్టు షేర్లను బలవంతంగా అరబిందోకి కట్ట బెట్టారన్న ఆరోపణలున్నాయి.. దాంతో పీకల్లోతు కూరుకుపోయిన విజయసాయి రెడ్డి తన అల్లుడు అరబిందో శరత్ చంద్రారెడ్డిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, తెరవెనుక రాజకీయాల్లో ఫోకస్ అవుతున్న ఈ వారసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంగా మారింది.