‘మేము అధికారంలోకి రాగానే మీ అందరి అంతు చూస్తామ’ని పోలీసులను, కలెక్టర్లను బెదిరిస్తూ ఉంటాడు ఆ యువనేత. అంటే తన ముఖం చూసి జనం ఓటేయరని డిసైడ్ అయ్యాడా..? తనే కాబోయే సీఎం అని బాహాటంగా చెప్పుకుంటే పడే ఓట్లు కూడా పడవని తెలిసిపోయిందా..? అధికారం కావాలంటే కేసీఆర్ ముఖం చూపాలె.. అధికారం వచ్చిన తరువాత తన ప్రతాపం చూపాలె.. ఇదేనా ఆ బీఆర్ఎస్ బడానేత చెబుతున్న మాటల పరమార్థం.
అంటే తన ముఖం బాగాలేదనే విషయాన్ని తనే చెప్పుకుంటున్నట్టే కదా? అందుకే ముఖం దాచుకుని.. సోషల్ మీడియా వేదికగా తనకు నచ్చిన రాజకీయాన్ని నడుపుతున్నా. ‘అనవసరంగా జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెట్టాం.. అదే ఓ 33 యూట్యూబ్ చానెళ్లు పెట్టుకుని ఉంటే ఈజీగా గెలిచేవాళ్లమేమో..!?’ ఈ మాటన్నది కూడా ఆ యువనేతే. ఈ మాట వెనుక.. ప్రజల తీర్పును కించపరిచే బరితెగింపు ఉంది.. జనం అబద్దాలను నమ్మి ఓట్లేసి అవతలిపార్టీ వాళ్లను గెలిపించారని గేలి చేసే కుంచిత మనస్తత్వమూ ఉంది. ‘మా తప్పులే లేవు, మా పాలనలో పాపాలే లేవ’నే తనకు తాను జబ్బలు చరుచుకునే సిగ్గులేనితనమూ ఉంది.
పశ్చాత్తాపం అసలే లేదు.. పక్కోడి మీద పడి ఏడవడమే. వీలైతే నాలుగు రాళ్లు వేయడం.. లేదా బురదజల్లే ప్రయత్నమే మిగిలుంది అన్నట్టుగా అప్పట్నుంచి ఇక మరింత రెచ్చిపోతున్నాడు ఆ బడా యువ నేత. ఇటీవల ఓ ప్రింట్ మీడియా తమ పత్రిక వార్షికోత్సవానికి ఆ నేతను పిలిచింది. ఆ వేదికగా ఆయన అన్న మాటలు విని అక్కడున్న జర్నలిస్టు లోకమంతా అవాక్కయిపోయింది. ‘ఇప్పుడు జర్నలిజం ఎక్కడున్నది..? అంతా సోషల్ మీడియానే. అందుకే నేను పేపర్లు చదవడం మానేసి చాలా రోజులైంది..’ అన్నాడు. జర్నలిజానికి విలువనివ్వని విలువలు లేని తనాన్ని ఇలా చాటుకున్నాాడాయన.
కానీ తనపై ‘తప్పుడు వార్త ప్రచారం చేసింది…’ అని ఓ పత్రికకు లీగల్ నోటీసులిచ్చాడు తాజాగా. అంటే ‘ఆ పత్రికలు నువ్వు చదవడం లేదు.. కానీ జనాలు చదువుతున్నారు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాను ప్రజలు ఇంకా ఆదరిస్తున్నారు..’ అని ఒప్పుకున్నట్టే కదా? నిప్పుకోడిలా నువ్వొక్కడివి ఇసుకలో తలదూర్చి.. నాకు ప్రపంచం కనబడటం లేదు.. నేను ప్రపంచానికి కనిపించడం లేదు.. అన్నట్టుగానే ఆ యువనేత చర్యలుంటున్నాయి.
అధికారం కోల్పోవడంతో మరింతగా మతి భ్రమించినట్టే ప్రవర్తిస్తున్నాడు ఆయన. కోట్ల రూపాయలు వెచ్చించి తనకో సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని స్థాపితం చేసుకున్నాడు. మళ్లీ అధికారాన్ని దీని ద్వారానే తెచ్చి తీరుతాననే భ్రమలో ఉన్నట్టున్నాడు. కానీ అది భ్రమేనని కూడా తెలుసుకున్నట్టున్నాడు. అందుకే .. ఎందుకైనా మంచిదని కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడాలని జనం కోరుకుంటున్నారని.. కామెంట్లు తరచూ చేయడం మూలంగా.. కేసీఆర్ ముఖం చూసైనా మళ్లీ ఓట్లెయ్యండి.. అని అడుక్కుంటున్నట్టే ఉందంటున్నారు.
నీ సోషల్ మీడియా సామ్రాజ్యం మీద అంత నమ్మకం ఉంటే.. ‘నేనే కాబోయే సీఎం..’ అని ధైర్యంగా ప్రకటించుకోగలడా? లేకపోతే.. కేసీఆరే ముందుకొచ్చి ‘ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. నా కొడుకే కాబోయే సీఎం.. మళ్లీ బీఆర్‌ఎస్‌కు అధికారం ఇవ్వండి..!’ అని జనం ముందు ప్రకటించగలుగుతాడా? ఈ రెండూ కాని పనులే. కానీ తనలోని అహం చల్లారేలా.. బట్టకాల్చి మీదేసేందుకు ఓ డిగ్ టీవీ పేరడీ పేరు మీద, తెలుగు స్క్రైబ్ తదితర పేర్ల మీద దుబాయి కేంద్రంగా నకలీ అకౌంట్లు సృష్టించి.. ఇష్టమొచ్చిన వార్తలు క్రియేట్ చేసి జనాల మదిలో విషం నింపే ప్రయత్నం చేస్తూ పైశాచికానందం పొందుతున్నాడు.
ఈ బీఆర్ఎస్ బడా నేతకు రెండు మీడియా హౌసులున్నాయి. వాటిల్లో ఈ వార్తలు రావు. వాటిని పట్టించుకోడు. ఉద్యోగులకు జీతాలు పెంచుమంటే బీద అరుపులు అరిచే ఇతగాడు .. సోషల్ మీడియా సామ్రాజ్యానికి మాత్రం నెలకు కోట్లకు కోట్లు గుమ్మరించేందుకు కూడా వెనుకాడడం లేదు. అంటే నకిలీ బతుకులతో, నకిలీ సామ్రాజ్యంలో రారాజుగా విలసిల్లుతున్నాడు ఇప్పటికైతే. ఎలాగూ తను సీఎం అయ్యేదీ లేదు.. అది కానిపని అని ఇట్లా ఆ సరదా తీర్చుకుంటున్నాడని అనుకోవాలా?
ప్రజా పోరాటాల నిర్మాణం లేదు గానీ ఫేక్ అకౌంట్లతో వ్యక్తిత్వ హననం చేసి.. చంకలు గుద్దుకుంటున్నాడు. జనం ముందు దోషిలా నిలపాలనే యావలో తనే పెద్ద దోషిలా నిలబడుతున్నాడు. అధికారం పోయిన తరువాత ఆ దొరికిన ఈ సమయాన్ని జనం మీద, నేతల మీద, తమను ప్రశ్నించిన మీడియా మీద ఇలా సోషల్ మీడియా ద్వారా కచ్చ తీర్చుకునే పనిలో బిజీబిజీగా ఉన్నాాడా బడానేత.