Tirupparankundram Deepam: ఒక కొండ.. రెండు ప్రార్థనా స్థలాలు.. ఒక దీపం! ఎప్పటినుంచో కొనసాగుతున్న ఓ ఆచారం ఇప్పుడు మతపరమైన వివాదంగా మారింది. చివరకు ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీపం వెలిగించాలంటూ ఆదేశాలు ఇచ్చినా.. వాటిని అమలు చేయలేదని తమిళనాడు ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై ఏం జరుగుతోంది? ఒక దీపం విషయంలో ఇంత పెద్ద వివాదం ఎందుకు వచ్చింది? ఇప్పుడు చూద్దాం..
ఇంత వివాదం ఎందుకు వచ్చింది..?
ఈ వివాదం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే ముందుగా మనం తమిళనాడులోని మధురైకి వెళ్లాలి. అక్కడ తిరుపరంకుండ్రం అనే కొండ ఉంది. ఈ కొండ హిందువులకు, ముస్లింలకు ఇద్దరికీ మతపరంగా ఎంతో ప్రాముఖ్యమైనది. ఇక్కడ కొండపై సుబ్రమణ్యస్వామి ఆలయం ఉంది. అదే కొండపై హజ్రత్ సికందర్ బాదుషా అవులియా దర్గా కూడా ఉంది. అంటే ఒకే కొండపై ఆలయం, దర్గా రెండూ ఉన్నాయి.
దీపాన్ని కొండపై ఎక్కడ వెలిగించాలి?
ఇప్పుడు అసలు వివాదం ఏంటంటే.. ప్రతి సంవత్సరం తమిళ కార్తీక మాసంలో కార్తిగై దీపం అనే పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపం వెలిగిస్తారు. అయితే ఇక్కడే ఒక ప్రశ్న మొదలైంది. ఈ దీపాన్ని కొండపై ఎక్కడ వెలిగించాలి? ఇప్పటివరకు ఉచ్చి పిళ్లయార్ ఆలయం సమీపంలోని దీప మండపంలో దీపం వెలిగిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోందని చెబుతోంది.
అక్కడ వెలిగించాలని డిమాండ్..
కానీ కొంతమంది హిందూ భక్తులు, సంఘాలు మాత్రం కొండపై ఉన్న మరో ప్రాంతంలో దీపం వెలిగించాలని కోరుతున్నారు. ఆ ప్రాంతం పేరు ‘దీపత్తూన్’. అంటే దీపం వెలిగించే స్తంభం అని అర్థం. అక్కడ ఒక రాతి స్తంభం ఉంది. అది సికందర్ బాదుషా దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉంది. అక్కడ కూడా కార్తిగై దీపం వెలిగించాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్‌తోనే వివాదం మొదలైంది.
దర్గా వర్గాలకు అభ్యంతరాలు..
అయితే ఈ విషయంలో దర్గా వర్గాలకు అభ్యంతరాలు ఉన్నాయి. దర్గా పరిసరాల్లో మతపరమైన కార్యక్రమాల నిర్వహణ, అక్కడి భూమి హక్కులు, భక్తుల రాకపోకలు, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. దీంతో ఇది కేవలం దీపం ఎక్కడ వెలిగించాలనే అంశం దగ్గర ఆగకుండా, రెండు మతాలకు సంబంధించిన హక్కులు, సంప్రదాయాలు, స్థల వివాదంగా మారింది.
దీని వెనుక వందేళ్లకు పైగా చరిత్ర..
ఈ వివాదం ఇప్పటిది కాదు. దీని వెనుక వందేళ్లకు పైగా న్యాయపరమైన చరిత్ర ఉంది. 1923లో వచ్చిన ఒక సివిల్ కోర్టు తీర్పులో కొండలోని ఎక్కువ ప్రాంతంపై ఆలయ హక్కులను గుర్తిస్తూనే, దర్గా ఉన్న ప్రాంతం సహా కొన్ని ప్రాంతాలపై ముస్లింల హక్కులను కూడా గుర్తించారు. 1931లో ప్రివీ కౌన్సిల్ కూడా ఆ తీర్పును సమర్థించింది. ఆ తర్వాత కూడా దీపం ఎక్కడ వెలిగించాలనే అంశంపై వివిధ సందర్భాల్లో కోర్టుల్లో వివాదం కొనసాగుతూనే ఉంది.
ఈ వివాదంలో సుప్రీంకోర్టు ఎంట్రీ..
ఇక తాజాగా ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. నవంబర్ 20న సుప్రీంకోర్టు కీలకమైన మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈసారి కార్తిగై దీపం సందర్భంగా కొండపై ఉన్న దీపత్తూన్ దగ్గర కూడా దీపం వెలిగించడానికి అనుమతించింది. అయితే ఇది ఒక్కసారి మాత్రమే వర్తించే ఏర్పాటు అని స్పష్టం చేసింది. దీంతో నవంబర్ 24న అక్కడ దీపం వెలిగిస్తారని అందరూ భావించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికి వెలగని దీపం..
కానీ నవంబర్ 24న ఏం జరిగింది అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ దీపత్తూన్ దగ్గర దీపం వెలగలేదు. ఎప్పటినుంచో వెలిగిస్తున్న ఉచ్చి పిళ్లయార్ ఆలయం దగ్గర ఉన్న దీప మండపంలోనే దీపం వెలిగించారు. ఆలయ ట్రస్టీల బోర్డు అక్కడే దీపం వెలిగించాలని నిర్ణయం తీసుకుందని, అందుకే దీపత్తూన్ దగ్గర కార్యక్రమం జరగలేదని మధురై జిల్లా కలెక్టర్ కోర్టుకు వివరించారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ పిటిషన్లు దాఖలయ్యాయి.
తమిళనాడు అధికారుల తీరుపై అసంతృప్తి..
నవంబర్ 27న ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు వ్యవహరించారా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
CRPFకు అప్పగిస్తూ ఆదేశాలు..
అంతేకాదు, ఆలయ ట్రస్టీల బోర్డు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆలయ నిర్వహణ బాధ్యతలను ఇద్దరు మాజీ హైకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్‌లకు అప్పగించింది. అలాగే ఆలయం, దర్గా, మొత్తం కొండ ప్రాంత భద్రతను CRPFకు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
15 మంది దిక్కరణ నోటీసులు జారీ..
నవంబర్ 28న అంటే ఈరోజు దీపత్తూన్ దగ్గర కార్తిగై దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భక్తులు కూడా దీపాలు వెలిగించవచ్చని చెప్పింది. అయితే దర్గా చుట్టూ అన్ని వైపులా కనీసం 50 మీటర్ల దూరం పాటించాలని, దర్గా సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా మొత్తం 15 మంది అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 15న కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈరోజు ఉదయం నుంచి కొండపై CRPF బలగాలను కూడా మోహరించారు.
మతపరమైన ఆచారాలకు హక్కు..
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం హిందువులు, ముస్లింల మధ్య జరుగుతున్న గొడవగా మాత్రమే చూడకూడదు. ఒకవైపు భక్తులు తమ మతపరమైన ఆచారాలను నిర్వహించుకునే హక్కు గురించి మాట్లాడుతున్నారు. మరోవైపు దర్గా సందర్శకుల ప్రార్థనా హక్కులు, అక్కడి భద్రత, స్థలానికి సంబంధించిన హక్కుల గురించి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ బాధ్యత ఏంటి?
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ బాధ్యత ఏంటి? రెండు వర్గాల హక్కులను కాపాడుతూ శాంతిభద్రతలను నిర్వహించాలి. అదే సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయాలి. ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత. ఆదేశాలను పాటించకపోతే న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకానికి కూడా దెబ్బ తగులుతుంది.
ప్రభుత్వ అధికారులకు కోర్టు నోటీసులు
ఒక దీపం ఎక్కడ వెలగాలనే వివాదం.. ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు కోర్టు నోటీసులు ఇచ్చే స్థాయికి చేరింది. ఒకవైపు మతపరమైన హక్కులు, మరోవైపు ప్రార్థనా స్థలాల భద్రత.. ఇంకోవైపు న్యాయస్థానం ఆదేశాల అమలు. ఈ మూడింటి మధ్య సమతుల్యత పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరి ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? రెండు వర్గాల హక్కులకు భంగం కలగకుండా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అనేది వేచి చూడాలి.
Also Read: ఏపీకి మరో బంపర్ ఆఫర్.. రామాయపట్నంలో రూ.1.27 లక్షల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ.. లోకేష్ ఏమన్నారంటే?