RK Roja: చిత్తూరు జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్. కే. రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలనలో రాయలసీమ తీవ్ర అన్యాయానికి గురవుతోందని ఆమె ఆరోపించారు.
EVM లతోనే పదవులా..?
రాయలసీమకు వైఎస్సార్ కుటుంబం వరమైతే, చంద్రబాబు కుటుంబం శాపమని రోజా పేర్కొన్నారు. EVMల తోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీఎంలు అయ్యారి రోజు ఎద్దేవా చేశారు. ప్రాంతీయ ప్రయోజనాలను పక్కనబెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో 388 కరువు మండలాలు నమోదయ్యాయని, ఉపాధి లేక యువత, రైతులు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం, పిఠాపురం నియోజకవర్గాలకు నీళ్లు ఇవ్వలేని నాయకులు పులివెందుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్ పాలనలోనే కృష్ణా జలాలు కుప్పానికి వచ్చాయని గుర్తుచేశారు.
హత్యలు, రాజకీయంపై విమర్శలు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ స్పష్టం చేసినా, చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిందితుడు దస్తగిరికి బాసటగా నిలుస్తూ నేరస్థులను కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వెన్నుపోట్లు, గొడ్డలిపోట్ల రాజకీయాలకు చంద్రబాబే ఆద్యుడని వ్యాఖ్యానించారు.
తిరుమల లడ్డూ వివాదం
వైఎస్సార్సీపీ హయాంలో రద్దు చేసిన 43 వేల బెల్ట్ షాపులను కూటమి ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించి అతిపెద్ద లిక్కర్ స్కామ్‌కు పాల్పడుతోందని విమర్శించారు. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కొవ్వు కలవలేదని సీబీఐ విచారణలో తేలినప్పటికీ, రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన లడ్డూపై విషప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ అనుబంధ సంస్థకు నెయ్యి టెండర్లు కట్టబెట్టడానికే ఈ నాటకం ఆడారని ఆరోపించారు.
రాజీనామా డిమాండ్
భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి, శ్రీవారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. హిందూ ధర్మాన్ని రక్షించేందుకు టీడీపీ, జనసేనలను కూటమి నుంచి బీజేపీ బయటకు పంపాలని సూచించారు.
Also Read: అధికారం పోయాక హీరోయిన్లను కూడా వదల్లేదు.. బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు బట్టబయలు: దయాకర్ గౌడ్