E-Paper
Advertisement

డీలిమిటేషన్‌తో 2016 జిల్లాల సరిహద్దు సమస్యలకు చెక్.. కానీ అసలు సమస్యలివే?

డీలిమిటేషన్‌తో 2016 జిల్లాల సరిహద్దు సమస్యలకు చెక్.. కానీ అసలు సమస్యలివే?
Advertisement

Telangana Delimitation: స్వేచ్చ బ్యూరో: డీ లిమిటేషన్ తో తెలంగాణ రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో మరో కీలక మార్పులు జరగనున్నాయి.కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తెస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు రాష్ట్రంలోని దశాబ్ద కాలపు పరిపాలనా చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపనుందని కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు భావిస్తున్నారు. 2016లో పరిపాలనా సౌలభ్యం పేరుతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్విభజించింది. అయితే ఆ సమయంలో కొత్త జిల్లాల సరిహద్దులను శాస్త్రీయంగా కాకుండా, స్థానిక రాజకీయ అవసరాలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు అనుగుణంగా ఖరారు చేయడంతో అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల పరిధిలోకి విస్తరించాయి.

నిత్యం నరకం..

ఫలితంగా గత పదేళ్లుగా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైతే ఈ ‘అస్తవ్యస్త సరిహద్దులకు’పూర్తిస్థాయిలో చెక్ పడనుందని కొందరు సీనియర్ ఐఏఎస్ లు చెబుతున్నారు. డీ లిమిటేషన్‌తో నియోజకవర్గాలు పెరగడంతో కొందరికీ రాజకీయ అవకాశాలు పెరగడమే కాకుండా, నియోజకవర్గాల సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న చిక్కుముడులు కూడా తొలగిపోనున్నాయని సచివాలయంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

35 నియోజకవర్గాల్లో సమస్యే..?

Advertisement

రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా,33 జిల్లాల ఏర్పాటు తర్వాత వీటిలో సుమారు 35కు పైగా నియోజకవర్గాలు రెండు, అంతకంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. 2008 డీలిమిటేషన్ ప్రకారం నియోజకవర్గాలకు హద్దులు ఉండగా, 2016లో జిల్లాల విభజన జరగడంతో ఒకే నియోజకవర్గంలోని మండలాలు వేర్వేరు జిల్లాలకు వెళ్లిపోయాయి. హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల్లో అనగా, సిద్ధిపేట్, కరీంనగర్, హనుమకొండ పరిధిలో విస్తరించి ఉన్నది. ఇక చొప్పదండి ఎస్సీ రిజర్వడ్ సెగ్మెంట్ కూడా కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, సిద్ధిపేట్ జిల్లాల్లో ఉన్నది. మానకొండూరు ఎస్సీ రిజర్వడ్ సెగ్మెంట్ కరీంనగర్ తో పాటు రాజన్న సిరిసిల్లా, సిద్ధిపేట్ లో ఉన్నది.

ఉత్తర తెలంగాణలో..

అదే విధంగా ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల పరిధిలో ఉన్నది. మరోవైపు ఉత్తర తెలంగాణలోని సిర్పూర్ నియోజకవర్గం కొమరం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించింది. ఆసిఫాబాద్ నియోజకవర్గం కొమరం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో, బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా లో విస్తరించి ఉన్నది. ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల, పెద్దపల్లి మంథని నియోజకవర్గం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గాల్లో నెలకొన్నది. వేములవాడ నియోజకవర్గం రాజన్న సిరిసిల్లా, జగిత్యాల హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్నది. ఇక దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలు సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఉండగా, నారాయణ్‌ఖేడ్, ఆందోల్, నర్సాపూర్ నియోజకవర్గాలు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో విస్తరించాయి.

Advertisement

Also read: మేడ్చల్ ఎల్లంపేట్‌లో తీవ్ర విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి!

నలిగిపోతున్న జిల్లాలు..

జుక్కల్ నియోజకవర్గం కామారెడ్డి, సంగారెడ్డిలో జిల్లాలో ఉండగా, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలో ఉన్నాయి. చేవెళ్ల నియోజకవర్గం రంగారెడ్డి, వికారాబాద్ పరిధిలో ఏర్పడగా, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలు వికారాబాద్, మహబూబ్‌నగర్ లో విస్తరించాయి. కల్వకుర్తి నియోజవర్గం నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాలో ఉండగా, జడ్చర్ల నియోజకవర్గం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్లో ఉన్నాయి. దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాలు మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో ఉండగా, మక్తల్ నారాయణపేట, వనపర్తి డిస్ట్రిక్ట్‌లో ఉన్నది. కొల్లాపూర్ సెగ్మెంట్ నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలో ఉండగా, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, పరకాల, ఆలేరు, తుంగతుర్తి, పాలేరు, వైరా, ఇల్లందు, భద్రాచలం తదితర నియోజకవర్గాలు రెండు జిల్లాల మధ్య నలిగిపోతున్నాయి.

అందరికీ పరేషాన్.. అడుగడుగునా ఇబ్బందులే..

ఒకే నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో ఉండటం వల్ల సామాన్య ప్రజల నుంచి ఉన్నతాధికారుల వరకు అనేక టెక్నికల్, పరిపాలనా సమస్యలు ఎదురవుతున్నాయి.ఒకే నియోజకవర్గ అభివృద్ధి పనులు, సమీక్ష సమావేశాల కోసం స్థానిక ఎమ్మెల్యేలు రెండు , మూడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. ఒక జిల్లా కలెక్టర్ సమావేశానికి హాజరైతే, అదే రోజు మరో జిల్లా కలెక్టర్ నిర్వహించే సమీక్షకు వెళ్లలేని పరిస్థితి. అంతేగాక సీఎం రిలీఫ్ ఫండ్ , కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ,ఎస్సీ,ఎస్టీ,బీసీ కార్పొరేషన్ రుణాలు, దళిత బంధు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒక మండలం ఫైళ్లు ఒక జిల్లా కలెక్టరేట్‌లో, పక్క మండలం ఫైళ్లు మరో జిల్లా కలెక్టరేట్‌లో పెండింగ్‌లో ఉంటున్నాయి.

కారణంతో నిర్లక్ష్యం..

మరీ ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రం ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలోని మండలాలకే నిధులు ఎక్కువగా వెళ్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రెండో జిల్లాలో ఉన్న ‘శివారు మండలాల’ను ఆ జిల్లా అధికారులు తమవి కానట్లుగా, సొంత నియోజకవర్గ నేతలు వేరే జిల్లా పరిధిలో ఉన్నాయన్న కారణంతో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో పాత మండలాలను విడదీసి కొత్త మండలాలు ఏర్పాటు చేయడం, కొన్ని గ్రామాలను ఒక మండలం నుంచి మరో మండలంలోకి మార్చడంతో రెవెన్యూ రికార్డులు, ధరణి (భూభారతి) సమస్యలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సమన్వయ లోపం..

ఒకే గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాసాలు వేర్వేరు రెవెన్యూ డివిజన్ల కిందకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇలాంటి నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణ విషయంలో రెండు జిల్లాల ఎస్పీల మధ్య సమన్వయ లోపం తలెత్తుతోంది. ఇక ఎన్నికల సమయంలో అయితే రిటర్నింగ్ అధికారి ఒక జిల్లాలో ఉంటే, సగం పోలింగ్ కేంద్రాలు మరో జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో ఉండటం ఎన్నికల యంత్రాంగానికి తలనొప్పిగా మారుతోంది.

డీలిమిటేషన్‌తో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి..?

కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లు ప్రకారం రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు,అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179 లేదా 182కు పెరిగే అవకాశం ఉంది.ఈ పునర్విభజన ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం , డీలిమిటేషన్ కమిషన్ కొన్ని కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నాయి.డీలిమిటేషన్ నిబంధనల ప్రకారం,వీలైనంత వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలో ఉండేలా సరిహద్దులను గీస్తారు.దీనివల్ల రెండు,మూడు జిల్లాల్లో విస్తరించిన నియోజకవర్గాల విభజన పూర్తిగా రద్దయి, ఆయా మండలాలు అవి ఉన్న జిల్లాల్లోని నియోజకవర్గాల్లో విలీనమవుతాయి. అంతేగాక ఒకే మండలం రెండు నియోజకవర్గాల్లో ఉండే విధానానికి స్వస్తి పలుకుతారు.

భారీగా పెరగనున్న సీట్లు..

ఒక మండలం పూర్తిగా ఒకే అసెంబ్లీ సెగ్మెంట్ కిందకు వచ్చేలా మ్యాపింగ్ చేస్తారు. జనాభా విపరీతంగా పెరిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో అసెంబ్లీ సీట్లు భారీగా పెరగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జనాభా సగటును సరిచేసే క్రమంలో అస్తవ్యస్తంగా ఉన్న మండలాలను దగ్గరలోని నియోజకవర్గాలతో కలుపుతారు. డీలిమిటేషన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని వివాదాస్పద మండలాలను, జిల్లాల సరిహద్దులను సవరించే అవకాశం ఉంది. దీనివల్ల జిల్లాల భౌగోళిక స్వరూపం మరింత స్పష్టంగా, శాస్త్రీయంగా మారనుంది. తద్వారా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే రాష్ట్రంలోని 33 జిల్లాల పరిపాలన ఒక గాడిన పడనుంది.

సరిహద్దుల గందరగోళం..

ఒక నియోజకవర్గానికి ఒకే జిల్లా కలెక్టర్, ఒకే ఎస్పీ పరిధి ఉండటం వల్ల సంక్షేమ పథకాల అమలు వేగవంతమవుతుంది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ నిధులను ఒకే జిల్లా యంత్రాంగం ద్వారా సులభంగా ఖర్చు చేసే వీలు కలుగుతుంది. ప్రజలు చిన్న చిన్న పనుల కోసం 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని వేరే జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పని తప్పుతుంది. పదేళ్లుగా తెలంగాణ ప్రజలను, యంత్రాంగాన్ని వేధిస్తున్న ‘సరిహద్దుల గందరగోళానికి’ డీలిమిటేషన్ బిల్లు ఒక శాశ్వత పరిష్కారంగా మారబోతోందని సీనియర్ ఐఏఎస్ లు వివరిస్తున్నారు.

Also read: Railway Alert: ఫిబ్రవరి 2027 వరకు 20 రైళ్లు రద్దు.. అసలేం జరిగిందంటే?

Tags

Related News

ఒక దీపం చుట్టూ ఇంత వివాదం ఎందుకు? సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకుంది?

ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. 15 బిలియన్ డాలర్లతో గూగుల్ హబ్ ఇక్కడే..?

డీలిమిటేషన్‌కు బీఆరెస్‌ సై! బీజేపీకి జైకొట్టే కేసీఆర్‌ వ్యూహం! కేంద్రంలో సంకీర్ణం వస్తే కీలకం కావాలనేదే ఆ పార్టీ వ్యూహం!

NRIలకు IBM బిగ్ షాక్.. ఇండియాకు తిరిగి రావాల్సిందేనా?

తన కూతురికి ఇండియా అని పేరు పెట్టిన విదేశీ క్రికెటర్.. ఎందుకో తెలుసా?

మధ్యతరగతికి అందని సొంతిల్లు.. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు చూస్తే షాకే!

హైదరాబాద్‌ను భయపెడుతున్న నీటి గండం.. ఏడాదిలో 4 రెట్లు పెరిగిన ట్యాంకర్ బుకింగ్స్!

Big Stories

Advertisement
×