BigTV English

Muhammad Yunus On India: చైనాతో యూనస్ దోస్తీ.. ఇండియాపై కుట్రకు ప్లాన్

Muhammad Yunus On India: చైనాతో యూనస్ దోస్తీ.. ఇండియాపై కుట్రకు ప్లాన్

Muhammad Yunus On India: బంగ్లాదేశ్ హద్దులు మీరుతోంది. డ్రాగన్ తోక పట్టుకొని సముద్రాన్ని ఈదే ప్రయత్నం చేస్తోంది. భారత్‌ను ఉడికించడానికి రెండు దేశాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈశాన్య భారత్ కేంద్రంగా కుట్రలకు తెరలేపుతున్నాయి. ఈశాన్య భారతదేశంలో అనిశ్చితిని పెంచడానికి వ్యూహాలు పన్నుతున్నాయి. తాజాగా బంగ్లా చీఫ్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. భారత్‌లోని సెవన్ సిస్టర్స్‌ రాష్ట్రాలకు తామే దిక్కంటూ యూనస్ చేసిన కామెంట్లు బంగ్లా కావరాన్ని చూపిస్తున్నాయి. ఈ పరిణామం, భారత్-బంగ్లా మధ్య కొత్త వివాదానికి కారణం అయ్యింది. ఇంతకీ బంగ్లాదేశ్ ప్లాన్ ఏంటీ..? దీనికి వెనుక చైనా చీప్ ట్రిక్సే కారణమా..? ఆ రెండు దేశాలూ భారత్ సహనాన్ని పరీక్షిస్తున్నాయా…?


చైనా-బంగ్లాదేశ్ కలిసి భారత్‌లో అనిశ్చితి పెంచే ప్రయత్నం

భారత్-బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులు చేదాటిపోతున్నట్లే కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. బంగ్లాదేశ్‌లో యూనస్ మధ్యంతర ప్రభుత్వం భారత్‌ను రెచ్చగొట్టే చర్యలను నానాటికీ పెంచుతోంది. నోబుల్ శాంతి బహుమతి పొందిన ముహమ్మద్ యూనస్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. భారత్‌ సహనాన్ని పరీక్షించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. యూనస్‌ చేతికి అధికార పగ్గాలు వచ్చిన తర్వాత ఉగ్రవాదుల్ని పెంచి పోషించే పాకిస్తాన్‌‌కు బంగ్లాదేశ్ మరింత దగ్గరవ్వడమే కాకుండా..=. భారత్‌పై కుట్రలు పన్నే చైనాతో చేతులు కలిపారు.


భారత్‌పై పెత్తనం చెలాయించే వ్యాఖ్యలు చేసిన యూనస్

ఇప్పుడు, చైనా బంగ్లాదేశ్‌లు కలిసి భారత్‌లో అనిశ్చితిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా, బంగ్లా చీఫ్ ముహమ్మద్ యూనస్ వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ప్రస్తుతం, యూనస్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం చైనాకు వెళ్లారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా.. తన చేతిని బంగ్లాదేశ్ వరకూ విస్తరించాలని కోరారు. అంతవరకూ బానే ఉంది. కానీ, ఆ రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడం మానేసి, భారత్‌పై పెత్తనం చెలాయించే వ్యాఖ్యలు చేశారు యూనస్. అదే ఇప్పుడు, భారత్-బంగ్లా మధ్య కొత్త వివాదాన్ని రేపింది.

భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు

చైనా వేదికగా బంగ్లా చీఫ్ యూనస్.. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ దేశం చుట్టూ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయనీ.. వాటికి బంగాళాఖాతం తీరంగా లేదనీ… తాము మాత్రమే సముద్రానికి రక్షకులమని యూనస్ అధిక ప్రసంగం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  భారత్‌లో సెవన్ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని.. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర సంరక్షకుడిగా ఉందని యూనస్ వ్యాఖ్యానించారు.

ఈ ప్రాంతం ఆధారంగా చైనా ఆర్థిక బలాన్ని పెంచుకోవచ్చని సలహా

ఈ రాష్ట్రాలు బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమై ఉన్నాయి. కాగా, ఈ ప్రాంతానికి సముద్రమార్గం లేకపోవటం చైనాకు ఒక సువర్ణ అవకాశంగా అభివర్ణిస్తూ.. ఈ ప్రాంతం ఆధారంగా చైనా తన ఆర్థిక బలాన్ని పెంచుకోవచ్చని అన్నారు. బంగ్లాదేశ్‌లో వ్యాపారాన్ని విస్తరించి, ఇక్కడ ఉత్పత్తులు తయారు చేసి, ఈశాన్యంలో మార్కెటింగ్ చేసుకోవచ్చంటూ అసంబద్ధ సలహా ఇచ్చారు.

హిమాలయాలు, భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించే…

ఈ సందర్భంగా చైనాను యూనస్ పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా నీటి నిర్వహణలో మాస్టర్ అంటూ కితాబునిచ్చారు. తమకు నీటి నిర్వహణ కోసం 50 సంవత్సరాల ప్రణాళిక అవసరమని వివరించారు. హిమాలయాలు, భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించే తీస్తా నదీ విషయంలో ఈ నిర్వహణ అవసరం ఉందన్నారు. అయితే, ఈ అన్ని వ్యాఖ్యల వెనుక చైనా చంక ఎక్కడానికి బంగ్లాదేశ్ పాట్లు కనిపిస్తున్నాయి. అదే సమయంలో.. భారత్‌ను బూచిగా చూపిస్తూ.. చైనాను భారత్‌కు మరింత వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.

భారతీయ రాష్ట్రాల ప్రస్తావన ఎందుకు తెచ్చారని విమర్శలు

అయితే, చైనాలో యూనస్ చేసిన వ్యాఖ్యలను.. ప్రధాని మోడీ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు సంజీవ్ సన్యాల్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో యూనస్ ఈశాన్య భారతీయ రాష్ట్రాల ప్రస్తావన ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. “భార‌త్‌లోని ఏడు రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉన్నాయని, యూనస్ చైనాకు బహిరంగంగా విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా ఉందని.. బంగ్లాదేశ్‌లో చైనా పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం తప్పు కాదు కానీ… ఈశాన్య రాష్ట్రాలను ప్రముఖంగా ప్రస్తావించడంలో ఆంతర్యం ఏంటీ?” అంటూ మండిపడ్డారు.

ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల మండిపాటు

ఇక, యూనస్ వ్యాఖ్యలపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. యూనస్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ యూనస్.. ఈశాన్య భారత్‌లోని ఏడు రాష్ట్రాలను భూ పరివేష్టిత రాష్ట్రాలుగా పేర్కొనడం.. బంగ్లాదేశ్‌ను బంగాళాఖాతానికి సంరక్షకుడిగా వ్యాఖ్యానించడం ఖండించదగినది” అని ఎక్స్ వేదికగా స్పందించారు. యూనస్ చేసిన ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు అంత తేలికగా తీసుకోకూడదనీ.. ఇవి లోతైన వ్యూహాత్మక పరిశీనలు, దీర్ఘకాలిక అజెండాలను ప్రతిబింబిస్తాయి” అని అన్నారు.

బంగ్లా బంగాళాఖాతానికి సంరక్షకుడనడంపై ఆగ్రహం

అయితే త్రిపురకు చెందిన స్థానికి పార్టీ, ‘తిప్రా మోతా’ చీఫ్ ప్రద్యోత్ దేబర్మా మాణిక్య మరింత ఘాటుగా స్పందించారు. “1947 బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం భారత్ చేతికి వచ్చినా.. వదిలేసుకోవటం అప్పట్లో భారత్‌ చేసిన పెద్ద తప్పు” అని పేర్కొన్నారు. ఇక, అస్సాం జాతీయ పరిషత్ అధ్యక్షుడు జొర్హాట్ ఎంపీ లురిన్ జయోతి గొగోయ్ స్పందిస్తూ.. “ఏ దేశ విమోచన కోసం భారత్ పోరాడిందో ఇప్పుడు అదే దేశం శత్రుదేశంతో చేతులు కలపటం దారుణమని” అన్నారు. “భారత విదేశాంగ విధానం ఈ స్థాయికి దిగజారటం శోచనీయం” అని వ్యాఖ్యానించారు.

భారత్‌కు కొత్త సమస్యలు తీసుకురావాలని..

అయితే, భారత్, ఈశాన్య రాష్ట్రాలను కలిపే చికెన్ నెక్ కారిడార్ అతి చిన్నగా ఉండటం ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం. ఇదే అంశాన్ని అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ కూడా గుర్తుచేశారు. చారిత్రకంగా ఈ ప్రాంతంలోని రెబల్స్ కూడా భారత్‌ నుండి ఈశాన్య భూభాగాలను విడదీయాలని చూశాయి. మాదకద్రవ్యాల నుండీ రెబల్ గ్రూపులకు సాయం అందించడం వరకూ చైనా వెనకనుండి కుట్రలు పన్నిందనే సందేహాలు కూడా లేకపోలేదు. అయితే, అలాంటి శక్తులను అణచివేయడంలో భారత్ బలంగా పనిచేసింది. అయితే, ఇప్పుడు అదే ప్రాంతాన్ని వినియోగించుకొని, భారత్‌కు కొత్త సమస్యలు తీసుకురావాలని చైనాతో కలిసి బంగ్లాదేశ్‌ కూడా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌ వైఖరిపై భారత్ సరిగ్గా స్పందించట్లేదనే విమర్శలు

అందువల్ల, ఈశాన్య రాష్ట్రాల్లో మరింత బలమైన రైల్వే, రోడ్ నెట్వర్క్‌లను అభివృద్ది చేయాలని అస్సాం సీఎం బిశ్వ శర్మ కోరుతున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని ఇంజనీరింగ్ సవాళ్లు ఉన్నప్పటికీ సంకల్పం, ఆవిష్కరణతో ఇవి సాధ్యమని అన్నారు. ఇలాంటి అభివృద్ధి వల్ల దేశంలోని ఇతర ప్రాంతాకు, ఈశాన్య ప్రాంతాలకు అనుసంధానం పెరిగే ప్రత్యామ్నాయా మార్గాలు వస్తాయని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరోవైపు, బంగ్లాదేశ్ పాలకులకు సరైన రీతిలో భారత ప్రభుత్వం ఎందుకు సమాధానం ఇవ్వట్లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో మోడీ సర్కారు చేస్తున్న జాప్యాన్ని కూడా చాలా మంది తప్పు పడుతున్నారు.

ఇంత తెగించిన యూనస్‌ ప్లాన్ ఏంటీ..?

బంగ్లాదేశ్ వ్యవహారం చూస్తుంటే.. భారతదేశాన్ని చుట్టుముట్టడానికి యూనస్ చైనాను ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజానికి, ఈ పరిస్థితి ఈశాన్య రాష్ట్రాల భద్రతకు చాలా ప్రమాదకరం. ఇప్పటికే, అరుణాచల్ ప్రదేశ్‌లోని చాలా భూభాగాల్లో చైనా గ్రామాలను విస్తరిస్తున్న తరుణంలో.. ఈశాన్య రాష్ట్రాలను కూడా టార్గెట్ చేసే విధంగా బంగ్లాదేశ్ చైనాను ప్రోత్సహిస్తోంది. దానికి బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తుందనే విధంగా యూనస్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇంత తెగించిన యూనస్‌ ప్లాన్ ఏంటీ..? ఈ వివాదం ముదిరితే ఎక్కడికి దారి తీస్తుంది..?

భారత ఈశాన్య రాష్ట్రాలు, నేపాల్, భూటాన్‌లకు..

భారతదేశ ఈశాన్య రాష్ట్రాలలో చైనా తన ప్రభావాన్ని విస్తరించాలని బంగ్లాదేశ్ ఆహ్వానించడం.. మూడు దేశాల భౌగోళిక రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నంగానే చూడాల్సి ఉంది. నిజానికి, ఈ వ్యాఖ్యలు ఈ మూడు దేశాల మధ్య పొత్తులను ఊహించని రీతిలో మారుస్తాయనడంలో సందేహం కూడా లేదు. ఇవి అన్ని రకాలుగా ముప్పును పెంచేవే కావడం ఇందులో ఉన్న తీవ్రతను తెలియజేస్తోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ ముహమ్మద్ యూనస్ కావాలనే ఇది చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

భారత్‌ను వ్యూహాత్మకంగా కలవరపెట్టే ప్రతిపాదన

భారతదేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలు, నేపాల్, భూటాన్‌లకు బంగ్లాదేశ్‌ను సముద్ర మార్గంగా ఉపయోగించమని.. బంగ్లాదేశ్‌ను చైనా ఆర్థిక వ్యవస్థను పొడిగించడానికి వాడుకోమని యూనస్ చైనాను ఆహ్వానించాడమంటే.. భారత్‌తో జగడానికి రెడీ అవ్వడమే అనుకోవాలి. నిజానికి, ఇది దౌత్యపరమైన అమాయకత్వం కాదు. ఇది భారత్‌ను వ్యూహాత్మకంగా కలవరపెట్టే ప్రతిపాదనగా చూడాలి. ఎందుకంటే, భారతదేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలకు… ప్రాథమిక ఆర్థిక, భద్రతా రక్షణగా బంగ్లాదేశ్‌ను పేర్కొనడం.. భారతదేశ సార్వభౌమత్వాన్ని నేరుగా సవాలు చేయడమే! అలాగే, భారత్ భద్రత, ప్రాదేశిక సమగ్రతకు కీలకంగా భావించే ఈ ప్రాంతంలోకి చైనా ప్రభావం ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుంది.

భౌగోళిక పరిస్థితులను ఆయుధంగా ఉపయోగిస్తున్న యూనస్

ఇక్కడ, ముహమ్మద్ యూనస్ భౌగోళిక పరిస్థితులను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. “మేమే సంరక్షకులం” అనే పదం నియంత్రణ, షరతులతో కూడిన యాక్సెస్‌తో పాటు బంగ్లాదేశ్ పరపతిని కూడా సూచిస్తుంది. ఒకప్పుడు, బంగాళాఖాతంలో భారత్‌కు వ్యూహాత్మక జూనియర్ భాగస్వామిగా బంగ్లాదేశ్ ఉండేది. అయితే, ఇప్పుడు భారత్ ప్రధాన భూభాగానికి, భారత్ తూర్పు సరిహద్దుకు మధ్య ద్వారపాలకుడిగా బంగ్లాదేశ్ తనను తాను నిలబెట్టుకోవాలని చూస్తుంది. అంటే, భారత్‌ను ఇబ్బంది పెట్టడానికి పశ్చిమాన పాకిస్తాన్ ఉన్నట్లు ఈశాన్యంలో బంగ్లాదేశ్ ఉందని చెప్పడం. అయితే, షేక్ హసీనా పలాయనం తర్వాత, బంగ్లా పాలనా బాధ్యతలు తీసుకున్న యూనస్ చేసిన మొదటి అధికారిక, దౌత్య పర్యటన ఇది.

22 కి.మీ వెడల్పు ఉన్న కీలకమైన ‘సిలిగురి కారిడార్’

మామూలుగా అయితే మొదటిగా భారత్ సందర్శించే సాంప్రదాయ పద్ధతి ఉండేది. కానీ, దీనికి బదులుగా యూనస్ చైనా వెళ్లడం ఒక వ్యూహంగానే భావించాలి. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల గురించి భారత్‌లో ఆందోళనలు, మాజీ ప్రధాన మంత్రి హసీనాకు ఆశ్రయం కల్పించాలని భారత్ తీసుకున్న నిర్ణయం తర్వాత… దెబ్బతిన్న సంబంధాల మధ్యలో ఈ దౌత్యపరమైన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది తీవ్రమైన వివాదాన్ని కూడా తీసుకొచ్చింది. నిజానికి, యూనస్ వ్యాఖ్యల్లో ప్రధానమైనది ‘చికెన్ నెక్’.

ఈ ప్రాంతంలోకి చైనా ఎంట్రీ వల్ల వ్యూహాత్మక భయాలు

ఇరుకైన ప్రదేశంలో కేవలం 22 కి.మీ వెడల్పు ఉన్న ఈ ‘సిలిగురి కారిడార్’ ఇరుకైన భూభాగం. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలిపే ప్రాంతం. ఇది చాలా కాలంగా భారత భద్రతా ప్రణాళికలను ఆందోళనకు గురిచేస్తున్న వ్యూహాత్మక ప్రాంతం. ఈ ప్రాంతంలో విదేశీ ప్రభావం, ముఖ్యంగా చైనా ప్రభావం ఉందనే సూచన… న్యూఢిల్లీలో తక్షణ భద్రతా సమస్యలకు కారణం అవుతుంది. చైనా ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను ‘దక్షిణ టిబెట్’గా పేర్కొంది. అలాగే, సరిహద్దు వెంట మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తోంది. ఈ నేపధ్యంలో… బంగ్లాదేశ్ ద్వారా ఈ సున్నితమైన ప్రాంతంలోకి చైనా ఎంట్రీ.. వ్యూహాత్మక భయాల మధ్య భారతీయ ఆందోళనలకు కారణం అవుతుంది.

బంగ్లాదేశ్‌ను “తూర్పు స్విట్జర్లాండ్” అన్న ముజిబుర్

అయితే, బంగ్లాదేశ్.. భారత్‌లోని ఈశాన్యానికి ప్రవేశ ద్వారంగా తనను తాను చెప్పుకోవడం ఇదే మొదటిసారి కాదు. 1970ల ప్రారంభంలో, బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కూడా బంగ్లాదేశ్‌ను “తూర్పు స్విట్జర్లాండ్”గా ఊహించుకున్నారు. బంగ్లాదేశ్‌ను దక్షిణ, ఆగ్నేయాసియాలను కలిపే వంతెనగా పేర్కొన్నారు. ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక ఎంట్రీని సులభతరం చేస్తుందని అన్నారు. అయితే ముజిబ్ ఉద్దేశ్యం ప్రాంతీయ ఏకీకరణ, ఆధిపత్యం కాకపోయినప్పటికీ.. బంగ్లాదేశ్ భౌగోళిక ప్రాంతం వ్యూహాత్మక ప్రాముఖ్యత గలదని చెప్పిన తర్వాత యూనస్ లాంటి వాళ్లు ఇలా మాట్లాడటానికి కారణం అయ్యింది.

యూనస్ వ్యాఖ్యలతో మరింత ఎక్కువైన అనుమానం

1980లలో, భారత్‌లోని అస్సాంలో అక్రమ వలసలపై తీవ్ర అశాంతి చెలరేగింది. ఈ సమయంలో, “గ్రేటర్ బంగ్లాదేశ్” సిద్ధాంతం ఆందోళనకు కారణం అయ్యింది. బంగ్లాదేశ్ అధికారికంగా అలాంటి అభిప్రాయాలను తిరస్కరించినప్పటికీ… భారత్‌లో భయం మాత్రం అలాగే ఉంది. ఇది వలస వ్యతిరేక అస్సాం ఉద్యమానికి ఆజ్యం పోసింది. ఈ అనుమానం ఇప్పుడు యూనస్ వ్యాఖ్యలతో మరింత ఎక్కువయ్యింది.

బంగ్లాదేశ్ చర్చలో సహజ అంతర్భాగంగా ఈశాన్య ప్రాంతం

ఇటీవలి కాలంలో… బంగ్లాదేశ్ విధాన నిర్ణేతలు, ఆర్థికవేత్తలు, థింక్-ట్యాంకులు కొన్ని అభిప్రాయాలను వెల్లడించారు. చిట్టగాంగ్, మోంగ్లా ఓడరేవులను భారత ఈశాన్య రాష్ట్రాలకు తెరవాలనీ… బంగ్లాదేశ్-చైనా-ఇండియా-మయన్మార్ ఆర్థిక కారిడార్ వంటి బహుళజాతి చొరవలను పునరుద్ధరించాలని ప్రతిపాదించారు. అలాగే, తరచుగా, ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్ చర్చలో “సహజ అంతర్భాగం” అని పిలవడం మొదలుపెట్టారు. అయితే, ఇది భౌగోళిక సమానత్వాన్ని నొక్కి చెబుతున్నప్పటికీ.. సరిహద్దు దాటి అర్థం చేసుకున్నప్పుడు వ్యూహాత్మక చిక్కులను స్పష్టంగా చూపిస్తుంది.

బిమ్‌స్టెక్ సమావేశానికి తదుపరి అధ్యక్ష పదవిలో బంగ్లాదేశ్

అందుకే, ఇప్పుడు, యూనస్ వ్యాఖ్యలపై భారత రాజకీయ, భద్రతా వ్యవస్థలు మండిపడుతున్నాయి. బంగాళాఖాతంలోకి ఈశాన్య ప్రాంతం నుండి ప్రవేశించడానికి సంబంధించి భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే అధికారిక ఒప్పందాలు ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్‌ కూటమి సమావేశానికి తదుపరి అధ్యక్ష పదవిని బంగ్లాదేశ్ చేపట్టనుంది. అలాంటి, సమయంలో యూనస్ వ్యాఖ్యలు ప్రాంతీయ రాజకీయాల్లో ఆందోళనలకు కారణం అయ్యే ఛాన్స్ ఉంది.

థాయిలాండ్‌లో జరగనున్న బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశం

భారతదేశానికి, ఈ పరిణామం సంక్లిష్టమైన దౌత్య సవాలుగా మారింది. థాయిలాండ్‌లో జరగనున్న బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో యూనస్.. ప్రధాని మోడీతో సమావేశం కోసం అభ్యర్థించినప్పటికీ, ఈ సమావేశం జరుగుతుందో లేదో భారత్ ఇంకా ధృవీకరించలేదు. అయితే, ఒక్కటి మాత్రం స్పష్టంగా ఉంది. బంగ్లాదేశ్ కోసం యూనస్ చేసిన ఈ కుట్ర ఆ దేశానికి నష్టాన్ని కలిగిస్తాయనడంలో సందేహం లేదు.

బంగ్లాదేశ్ చివరికి శ్రీలంకలా బాధపడే పరిస్థితి

చైనా పెట్టుబడులను ఆకర్షిస్తూనే భారత్ అంతర్గత భౌగోళిక స్థితిని ప్రస్తావించడం వల్ల.. యూనస్ దౌత్యపరంగా ఓవరాక్షన్ చేసినప్పటికీ.. చైనా నుండి వచ్చే ఆర్థిక మద్దతు వల్ల బంగ్లాదేశ్ చివరికి శ్రీలంకలా బాధపడాల్సి వస్తుంది. దాని ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతున్న సమయంలో.. భారతదేశాన్ని వ్యతిరేకించడం దానికి దీర్ఘకాలిక సమస్యలను సృష్టించగలదు. ఏది ఏమైనా… ఇది మరింత ముదిరి కొద్దీ మరో యుద్ధం కూడా అనివార్యం అవుతుందనడంలో అనుమానం లేదు. అదే జరిగితే.. భారత్‌ను తట్టుకోగల సామర్థ్యం అరువు తెచ్చుకోవాలని చూసినా అది బంగ్లాదేశ్‌కు సాధ్యం కాదు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×