బలవంతమైన సర్పము చలి చీమల చేతజిక్కి చావదే సుమతీ! అచ్చంగా ఈ సుమతీ శతకాన్ని గుర్తు చేశాయి కాక్రోచులు. జెన్ జీ దెబ్బకు ఢిల్లీ గల్లీలు అదిరిపోయాయి. వారి నినాదాలతో ఆ వీధులన్నీ దద్దరిల్లాయి. కాక్రోచులు కదం తొక్కితే.. కేంద్రం కదలి రాక తప్పలేదు.
కదలిక వచ్చేలా చేసినా.. ఇంకా బెట్టు వీడటం లేదు. చర్చలు, సంప్రదింపులంటూ వారిని కొంచెం మెత్తబరిచేందుకు ప్రయత్నం చేసినా.. కాక్రోచులు వినలేదు. ఉదయం నుంచి దాదాపు పది గంటల పాటు నిరంతరంగా ఆందోళన చేపడుతూనే ఉన్నారు. పోలీసులకే ముచ్చెమటలు పట్టించారు. బారికేడ్లను తోసుకుని ముందుకు పోయారు. లాఠీచార్జి చేసినా.. వెనక్కి తగ్గలేదు.
జెన్ జీ దెబ్బ ఎలా ఉటుందో కేంద్రానికి చూపినట్టైంది ఈ సంఘటనతో. నీట్ పేపర్ లీకేజీపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయాలనే డిమాండ్‌పై గత కొంత కాలంగా కొనసాగుతున్న ఆందోళనలు.. తారా స్థాయికి చేరాయి. దీనిపై కేంద్రం సత్వరం స్పందించాల్సి ఉండే. కానీ బెట్టు చేసింది. అంతే కాదు..పట్టింపులేని తనాన్ని ప్రదర్శించింది. కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో.. ఆ పని చేయకుండా.. కావాలనే దాన్ని ఆపినట్టుంది కేంద్రం.
మెట్టు దిగితే లొంగినట్టవుతందని బింకం ప్రదర్శించి0ది. ఇది ఇండి కూటమికి కలిసి వస్తుందనుకున్నది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్‌పై ఈగ కూడా వాలనివ్వమనే విధంగా ప్రవర్తించిన మోడీ చర్యలపై కాక్రోచులు మరింత భగ్గుమన్నాయి. ధర్మేంద్ర పుట్టిన రోజున ప్రత్యేకంగా మోడీ శుభాకాంక్షలు తెలపడం, తాజాగా నీట్ ర్యాంకర్‌తో కలిసి ప్రధాన్.. తన సంతోషాన్ని పంచుకుని జాతికి సందేశమివ్వడం.. తదితర సంఘటనలు బట్టి చూస్తే.. కేంద్రం కాక్రోచుల ఉద్యమాన్ని చూసి లోలోన భయపడుతూనే పైకి రెచ్చగొట్టే చర్యలకు ఉపక్రమించిందని అవగతమవుతోంది.
కానీ ఇవాళ చేపట్టిన ఆందోళన.. తమకు తాముగా గోతి తోడుకునేలా చేసుకుంటున్నామా? అనే విధంగా అనుమాన పడింది కేంద్రం. ఇక మాకు తిరుగులేదు.. మోడీ ఏం చేసినా దేశం కోసం.. ధర్మం కోసం.. అనే విధంగా ఇన్నాళ్లు నడిచింది. కానీ ఎల్లవేళలా ఈ విధానం కొనసాగదని వారికీ తెలుసు. ఓ వైపు పరిస్థితులు తమకు వ్యతిరేకంగా మారుతున్న సమయంలో ఎలాగైనా దీన్నుంచి బయటపడాలని యోచించింది.
దేశమే కాదు.. ప్రపంచమే ఇటు చూస్తున్న తరుణంలో ..ఎలాగైనా కాక్రోచుల ఆవేశం మీద నీళ్లు చల్లాలని కేంద్రం కొంచెం దిగివచ్చినట్టు చేసింది. ఆ పార్టీ నేతలతో చర్చలకు దిగింది. కానీ వారు పెట్టిన డిమాండ్లు ఒప్పుకోలేదు. తరువాత ధర్మేంద్ర ప్రధాన్‌తో అమిత్ షా ప్రత్యేకంగా కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకున్నది. మొత్తానికి కేంద్రం మెడలు వంచేందుకు కాక్రోచులు చేసిన పోరాటం ఫలితాన్నిచ్చినట్టేననాలి. కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టుగా ఇండి కూటమి కూడా కాక్రోచుల ఉద్యమానికి మద్దతుగా నిలిచి.. వారి సంఘీభావాన్ని ప్రోదీ చేసుకునే విషయంలో ముందంజలో ఉన్నది.
రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు ఈ అంశంపై కాక్రోచులు చేస్తున్న పోరాటంపై కేంద్రాన్ని నిలదీస్తూనే ఉన్నాడు. లాఠీ చార్జి చేయడం,టియర్ గ్యాస్ ప్రయోగాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టాడు. వెంటనే ధర్మేంద్ర రాజీనామా చేయాలని రాహుల్ మరింత ఒత్తిడిని పెంచుతున్నాడు. దీంతో పార్లమెంటును కాక్రోచులతో పాటుగా ఇండి కూటమి సపోర్టు .. అష్టదిగ్బంధనం చేసినట్టుగా అయ్యింది. లోన ఇండి కూటమి సభ్యులు, బయట ఢిల్లీ వీధుల్లో కాక్రోచుల కదం.. మొత్తంగా పార్లమెంటును అట్టుడికిలా చేశాయి.