Congress Strategy: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్.. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది? ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని హస్తం పార్టీ అప్పుడే అలర్ట్ అయిందా? అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ఒకవైపు ఏఐసీసీ ప్రతినిధి మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు, మరోవైపు సీఎంవో అత్యంత రహస్యంగా సేకరించిన ఇంటెలిజెన్స్ నివేదికలు ఇప్పుడు పార్టీలో పెను తుఫాను రేపుతున్నాయి. ప్రజాదరణ ఎక్కడ తగ్గుతోంది? అసలు వ్యూహం ఎక్కడ బెడిసికొడుతోంది? అనే కోణంలో అధిష్టానం వేసిన గుట్టుచప్పుడు కాని స్కెచ్ ఇప్పుడు లీకై నేతల్లో వణుకు పుట్టిస్తోంది.
ఆ 26 నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది?
సీఎంవో వర్గాల ద్వారా లీకైన ఇంటెలిజెన్స్ డేటా చూసి అధిష్టానం పెద్దలే అవాక్కయినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని ఈ రిపోర్ట్ తేల్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేల కోట్లు ఖర్చు పెట్టి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లడంలో ఘోరంగా విఫలమవుతున్నాయని సర్వే స్పష్టం చేసింది. గెలిచాం కదా అన్న ధీమాతో కొందరు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలతో మమేకం అవ్వడం కంటే, స్వప్రయోజనాలకే కొందరు ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇస్తున్నారనే చేదు నిజాలు ఈ నివేదికతో బట్టబయలయ్యాయి.
సీఎంవో ప్రత్యేక నిఘా.. మంత్లీ రిపోర్ట్స్!
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త యాక్షన్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు. ఇకపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల డైలీ యాక్టివిటీస్ పై సీఎంవో ప్రత్యేక కన్నేసింది. ప్రతి నెలా వీరి పనితీరుపై ఒక మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ సిద్ధం కానుంది. నియోజకవర్గంలో నేతలు ఎంత సమయం గడుపుతున్నారు? ప్రజా సమస్యలపై ఎలా స్పందిస్తున్నారు? ప్రభుత్వ పథకాలను జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? అనే అంశాలపై ఎప్పటికప్పుడు డేటా సేకరిస్తున్నారు. ఈ నిఘా వలయం చూసి సొంత పార్టీ లీడర్లే ఇప్పుడు కాస్త ఆందోళనలో పడ్డారు.
హైకమాండ్ బిగ్ ప్లాన్
పరిస్థితి చెయ్యి దాటకముందే నష్టనివారణ చర్యలకు అధిష్టానం సిద్ధమైంది. వీక్‌గా ఉన్న ఆ 26 స్థానాల్లో ప్రత్యేక సమన్వయకర్తలను రంగంలోకి దించేందుకు బిగ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. వీరు నేరుగా హైకమాండ్‌కు రిపోర్ట్ అందిస్తారు. స్థానిక ఎమ్మెల్యేల పనితీరును పర్యవేక్షిస్తూనే, గ్రౌండ్ లెవెల్‌లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను వీరికి అప్పగించనున్నారు. అంటే ఒకరకంగా బలహీనంగా ఉన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమాంతర నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకైనా అధిష్టానం వెనకాడటం లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మారకపోతే టికెట్ కట్
ఇప్పటికైనా దారికి రాకపోతే భవిష్యత్తులో కఠిన నిర్ణయాలు తప్పవని హైకమాండ్ గట్టి హెచ్చరికలే జారీ చేస్తోంది. పనితీరు మార్చుకోని నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోత గ్యారెంటీ అనే లైన్ క్లియర్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్ట ముఖ్యం కానీ, వ్యక్తుల స్వప్రయోజనాలు కాదు అనేదే లీడర్షిప్ టాప్ ఎజెండా. మరి ఈ ఇంటెలిజెన్స్ షాక్ ట్రీట్‌మెంట్ తర్వాతైన సదరు 26 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యి జనాకర్షణ పెంచుకుంటారా? లేక అధిష్టానం యాక్షన్‌కు బలవుతారా? అనేది రానున్న రోజుల్లో చూడాలి.
Also Read: పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!