తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చినా పదేళ్లు ఛాన్సిస్తున్నారు. అంటే రెండు టర్ములు ఒక్కరినే గెలిపిస్తున్నారు. సర్కార్ ఓ రెండు సార్లు ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే తప్ప అనుకున్నవి చేయడం.. హామీల అమలు.. చేపట్టిన ప్రాజెక్టుల పూర్తి.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రెండు రెండు సార్లు గెలిపిస్తున్నారు.
ఇప్పుడీ ముచ్చట ఎందుకొచ్చిందంటే.. సీఎం రేవంత్ నోటి వెంట ఈ గతం.. పదే పదే వినిపిస్తూ ఉంది. ఉమ్మడి ఏపీలో కావొచ్చు.. తెలంగాణ విడిపోయిన తరువాత కావొచ్చు.. 1994 నుంచి.. అంటే మూడు దశాబాద్దాలుగా ఇదే రిపీట్ అవుతోంది. అందుకే మరోసారి మేమే అధికారంలోకి వస్తాం.. రావడం పక్కా.. రాసిపెట్టుకోండి..! ఇది చరిత్ర..! అంటూ తన రాజకీయ భవిష్యత్‌ను అందులో ముడిపెట్టి మరీ లాజిక్ లేని పాయింట్లు మాట్లాడటం జనాల్లో ఇది చర్చకు తావిస్తోంది.
1994 నుంచి 2004ల వరకు రెండు సార్లు వరుసగా టీడీపీని గెలిపించారు తెలుగు ప్రజలు. 2004 నుంచి 2014 వరకు వరుసగా రెండు సార్లు కాంగ్రెస్‌ను గద్దెనెక్కించారు. ఇక ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం… రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగడం.. 2014లో టీఆరెస్‌ను తెలంగాణ ప్రజలు గెలిపించడం… మరోసారి కూడా బీఆరెస్‌కే పట్టం గట్టడం.. ఇదంతా ముప్పై ఏళ్లుగా జరుగుతు వచ్చిన చరిత్ర.
ఇప్పుడే ఇదే రాజకీయ చరిత్రను అనుసరించి 2024 నుంచి రెండు టర్ములు.. అంటే పదేండ్లు.. 2034 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది.. అనేది రేవంత్ రెడ్డి చెప్పిన.. లాజిక్ లేని తనదైన జోస్యం. రేవంత్ మాటలను ఎలా చూడాలి? ఆయన ఆత్మవిశ్వాసంగా చూడాలా? అతి విశ్వాసమనాలా? లేక గుడ్డిగా చరిత్రలో ఇదే జరిగింది కాబట్టి.. జనం మళ్లీ ఇదే చేయబోతున్నారని జోస్యం చెప్పారనుకోవాలా? గత రాజకీయ చరిత్ర తీసినప్పుడు అప్పటి పరిస్థితులను కూడా అంచనా వేసుకోవాలె.
ఎందుకు జనాలు రెండోసారి కూడా గెలిపించాలనుకున్నారు..? ఆ సర్కార్ ఇంకేదో చేస్తుందనే భావనను బలంగా జనాల్లో వాళ్లు నిలుపగలిగారా? ఈ ఐదేళ్లలో పర్వాలేదు.. బాగానే ఉంది పాలన.. అనుకున్నవి చేశారు.. ఇంకా సమయం ఇస్తే.. ఇంకా బాగా చేస్తారనే భరోసాను ఏమైనా కలిగించి ఉంటారా? ఇవి కూడా ప్రధాన భూమిక పోషించి ఉంటాయి.
టీడీపీ విషయంలో ఇదే జరిగి ఉంటుంది. తరువాత రాజశేఖర్‌రెడ్డి పీరియడ్‌లోనూ ఇదే ఆశ జనాలకు ఉండి ఉంటుంది.. అందుకే రెండేసి సార్లు గెలిపించారు. ఈ రెండు పార్టీలను.
ఇక కేసీఆర్ విషయంలో కూడా అంతే. తెలంగాణ ఉద్యమ రథ సారథిగా ..తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చిన రాష్ట్రంలో ఓసారి సీఎంగా అవకాశం ఇద్దామనుకున్నారు. ఆ తరువాత ఆ పాలన ..సమైక్య పాలనకన్నా బెటరనిపించింది. ఇంకోసారి ఇస్తే.. ఇంకా బాగా చేస్తారేమో అని జనం అనుకున్నారు. అందుకే రెండోసారి కూడా కేసీఆర్‌ను సీఎం చేశారు. ఇక మూడోసారి కేసీఆర్‌ను కూడా బండకేసి కొట్టినంత పనిచేశారు జనం.
కారణాలనేకం. అది రేవంత్‌కు, కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. మరి ఇప్పుడు ఈ టర్ము పాలన.. సగం కాలం ముగిసింది. రిజల్టు ఎలా ఉంది? అని ఆరా తీస్తే మరీ అధ్వాన్నంగా ఉందనే వస్తోంది. ఇంకా రెండున్నరేండ్లు ఉన్నా…. ఒక్కసారిగా భూం భుష్…అని జనం వద్ద ఉన్న తమ వ్యతిరేకత పోగొట్టుకునే పరిస్థితి లేదు.
మరి రెండోసారి ఎలా వస్తారు? ఇదే ఇప్పుడు చర్చ. రేవంత్ వద్ద ఉన్న వ్యూహమేమిటీ? ఆయన జనం నాడి పట్టిన తీరు ఎలాంటిది? కేసీఆర్ కన్నా జనం నాడి బాగా తెలుసా రేవంత్‌కు? బీజేపీ కూడా పుంజుకుంటోంది. ఒకవేళ హంగ్ ఏర్పడినా.. కేసీఆర్, బీజేపీతో జత కట్టేందుకు ఏమాత్రం వెనుకాడడు.
మరి అంత ఈజీగా రెండో టర్ము కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వస్తుంది.? ఏం చేశాడని.. ఏం చేస్తాడని..? ఇంకా జనాల్లో ఆశలేమైనా సజీవంగా ఉంచగలిగాడా? బీఆరెస్, బీజేపీని ఒంటిచేత్తో మట్టి కరిపించడం మూలంగా.. చివరకు మేమే జనాలకు కనిపిస్తామనే ధీమాతో కూడిన ఆత్మవిశ్వాసం కలగలిసి వచ్చిన పలుకులా?
పదే పదే ఇదే మాట అనడం ద్వారా జనాల మెదళ్లలో ఇదే నాటు కోవాలని చేసే ఓ మైండ్ గేమ్‌లో భాగమా? ఇదీ ప్రస్తుతం జరుగుతున్న చర్చ.