సోషల్ మీడియాలో రాజకీయాలు దారి తప్పుతున్నాయి. అధికార పార్టీతో పాటు, ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్ కూడా దీని మీదే ఎక్కువగా ఆధారపడి, నమ్మకం పెట్టుకుని రాజకీయాలను ముందుకు తీసుకుపోతున్నాయి. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో.. బీఆరెస్ పార్టీ మొన్న సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన యువ సంగ్రామ సదస్సుపై రచ్చ జరుగుతోంది.
బీఆరెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందనేది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా ఈ ఆరోపణ చేశాడు. దీన్ని అందిపుచ్చుకున్న ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్స్.. ఆ వేదిక మీద కేటీఆర్‌తో ఉన్న ఒకరిద్దరు అమ్మాయిలను, ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొందరిని టార్గెట్ చేశారు. వీరంతా బీఆరెస్ పార్టీకి చెందిన వారేనని, గతంలో కూడా పలు బీఆరెస్ ఆందోళనల్లో కేటీఆర్‌తో ఉన్నారని, సర్కిళ్లు గీసి మరీ చూపించడం మొదలు పెట్టారు.
ఏదో చేయరాని తప్పు చేసినట్టు.. జరగరాని నేరం జరిగిపోయినట్టు. కొంత మంది ఉంటే ఉండొచ్చు గాక, కానీ దీన్నే పట్టుకుని అసలు నిరుద్యోగుల అంశమే అంతలా లేదని, వారంతగా ఆగ్రహంతో లేరనే విధంగా.. అసలు నిరుద్యోగులంతా ఈ సర్కార్‌పై ఎంతో హ్యాపీగా ఉన్నారని, పాలనను వేనోళ్లా కొనియాడుతున్నారనే విధంగా పరోక్షంగా చెప్పుకోవడంతో పాటు.. కావాలనే బీఆరెస్ ఇదంతా నానా యాగీ చేసి రెచ్చగొడుతుందనేది వారు చెప్పాలనుకున్న సందేశం.
కానీ అక్కడ అది ప్రొజెక్టు కావడం లేదు. ఎందుకంటే, క్షేత్రస్థాయిలో ఆ వేడి మామూలుగా లేదు. ప్రస్తుతమైతే పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌పై భగ్గుమంటున్నారు నిరుద్యోగులు. కేటీఆర్ సభకు కూడా వారు చాల మంది స్వచ్చంధంగా ముందుకు వచ్చి పాల్గొన్నారు. కానీ, కేటీఆర్ ఆ సభలో ఈ అంశానికి పెద్దగా ప్రయార్టీ ఇవ్వలేకపోయాడు. తన రాజకీయం తనే చూసుకున్నాడు తప్ప.. తమను ఓడించి తప్పుచేశారని చెప్పి ఒప్పించడానికే తిప్పలు పడ్డాడు తప్ప.. ప్రస్తుతం నిరుద్యోగుల పక్షాన బలమైన గొంతుకగా నిలవలేకపోయాడు.
ఇవాళ విద్యార్థి సంఘాల జేఏసీ.. సెక్రటేరియట్‌ను ముట్టడించింది. ఉద్యోగాల భర్తీ, ఫీజు రియంబర్స్‌మెంట్ పై ఆందోళన చేపట్టాయి. మళ్లీ కేటీఆర్ ఇవాళ ఉద్యోగాల అంశంపైనే మాట్లాడాడు. ఓ పదివేల ఉద్యోగాల వరకే రేవంత్ సర్కార్ ఇచ్చిందని, వారు చెబుతున్న డెబ్బైవేల ఉద్యోగాల్లో 60 వేల ఉద్యోగాలకు మేమే నోటిఫికేషన్ ఇచ్చి, భర్తీ ప్రక్రియ స్టార్ట్ చేశామని చెప్పుకొచ్చాడు.
కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి, మా సర్కార్‌లోని కొలువుల లెక్కలను కూడా తమలో కలుపుకున్నాడని విమర్శించడమే కాదు.. ఇంకొకరికి పుట్టిన పిల్లల్ని తమకు పుట్టారనే విధంగా కాంగ్రెస్ చెప్పుకుంటన్నదని హేళనగా మాట్లాడాడు. ఒకవేళ.. ఆ 70వేల సర్కారీ కొలువులు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచే భర్తీ ప్రక్రియ చేపట్టి.. నియామకాలు ఇచ్చామని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మళ్లీ ప్రకటించుకున్నాడు.
ఇలా ఉద్యోగాల అంశం.. సీరియస్‌గా నడుస్తోంది. దీనిపై మొన్న రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చినా.. ఆయన మిగిలిన రాజకీయపరమైన అంశాలకే ఎక్కువ ప్రయార్టీ ఇచ్చాడు. నిరుద్యోగులకు విజ్ఞప్తి.. మాయ మాటలు నమ్మొద్దు.. ఖాళీలన్నీ భర్తీ చేసే పూచీ నాది .. అని అభయమిచ్చాడు. మరోవైపు పోలీసు ఉద్యోగాలు సరిపోవని, 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయాలని .. ప్రభుత్వం పై అన్ని రకాలుగా ఒత్తిడి వచ్చినా.. సర్కార్ మాత్రం వినడం లేదు. ఇలా సోషల్ మీడియాలో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా.. వీరంతా వారే.. వారే వీరు.. అని పార్టీ రంగు పులిమే పనిలో ఉన్నారు.