E-Paper
Advertisement

Shocking Facts: కెమికల్ కిల్లర్స్.. లక్షల మందిని చంపే ప్లాన్!

Shocking Facts: కెమికల్ కిల్లర్స్.. లక్షల మందిని చంపే ప్లాన్!

Shocking Facts: ఉగ్రదాడులంటే.. బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు, మారణాయుధాలతో మారణహోమం సృష్టించే వికృత చర్యలు. కానీ.. ఇప్పుడు వీటన్నింటికి కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. అలజడి సృష్టించేందుకు.. ఉగ్రవాదులు కొత్త దారులు వెతుకుతున్నారు. ఎంతకు తెగించారంటే.. విష ప్రయోగాలతో వేల మందిని మట్టుబెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్‌లో దొరికిన టెర్రరిస్ట్ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్.. రైసిన్ తయారుచేసి జనాలను చంపాలనుకోవడం ఏంటి? భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్ సేకరించి.. వందలాది మంది ప్రాణాలు తీసేందుకు వేసిన స్కెచ్ ఏంటి? అసలు.. మన చుట్టూ ఏం జరుగుతోంది?

అన్ని సార్లు బాంబులే పేల్చాలనే ఆలోచన నుంచి ఉగ్రవాదులు బయటకొచ్చేశారు. ఇప్పుడున్న పరిస్థితులకు, నిఘాకు తగ్గట్లుగా.. టెర్రరిస్టులు కూడా రూటు మార్చేశారు. ఉగ్రదాడులను.. ఊహించని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులకు భిన్నంగా.. ఉగ్రవాద సంస్థలు రసాయనిక, జీవ ఆయుధాల వైపు దృష్టి సారించడం.. భద్రతా సంస్థలకు పెద్ద సవాల్‌గా మారింది. హైటెక్ టెర్రరిజం, వైట్ కాలర్ టెర్రరిజమే.. ఇప్పుడు టెన్షన్స్ పెంచుతోంది. దశాబ్దాలుగా మనం చూసిన ఉగ్రవాదానికి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు మధ్య చాలా తేడా ఉంది. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలతో దాడి చేయడం అనేది రిస్క్‌తో కూడిన చర్య. ఎక్కువ మంది వ్యక్తులు అవసరమయ్యే వ్యవహారం. కానీ.. ఇప్పుడు టెర్రరిస్ట్ మాడ్యూల్స్.. తెలివైనవారిని, స్టూడెంట్స్‌ని, డాక్టర్లని, కెమిస్ట్రీ పరిజ్ఞానం ఉన్నవారిని ఎంపిక చేసుకొని మరి.. వారిని రాడికలైజ్ చేస్తున్నాయ్. సైలెంట్‌గానే.. వేలాది మంది ప్రాణాలు తీసే.. స్లో పాయిజన్ మార్గాలను అన్వేషిస్తున్నాయ్. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసిన హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ ఎపిసోడే.. ఈ సరికొత్త ఉగ్రవాద వ్యూహానికి బిగ్ ఎగ్జాంపుల్. వీడు పన్నిన కుట్ర గురించి తెలిస్తే.. ఒళ్లు జలదరిస్తోంది. టెర్రరిస్ట్ మొహియుద్దీన్.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవ రసాయన విషాల్లో ఒకటైన.. రైసిన్‌ని తయారుచేసేందుకు ప్రయత్నించాడు. ఈ రైసిన్‌ని సాధారణంగా ఆముదం గింజల నుంచి వెలికితీసే ఓ ప్రోటీన్. కేవలం.. కొన్ని మిల్లీగ్రాముల రైసిన్‌కి.. వేలాది మందిని చంపగలిగే కెపాసిటీ ఉంది.

చైనాలో ఎంబీబీఎస్ చదివిన మొహియుద్దీన్.. ఆముదం గింజలు, ఎసిటోన్స్, క్రషర్స్ సాయంతో.. ప్రమాదకరమైన రైసిన్‌ పాయిజన్ తయారు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం.. ఓ అండర్‌గ్రౌండ్ ల్యాబ్‌ను నడుపుతున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. కెమిస్ట్రీలో తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి, రైసిన్ తయారీకి అవసరమైన రసాయనాలు, పరికరాలు, ఆముదం గింజల కేక్ లాంటి వాటిని కొనుగోలు చేశాడు. ప్రసాదంలో రైసిన్‌ కలిపి విష ప్రయోగం ద్వారా వేలాది మంది జనాలను చంపేందుకు కుట్ర పన్నారనే అనుమానాలున్నాయ్. ఇందుకోసం.. ఢిల్లీలో రద్దీగా ఉండే మార్కెట్లు, అహ్మదాబాద్, లక్నోలోని సున్నితమైన కార్యాలయాలు, ఆలయాలు, మతపరంగా ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవాలని వీడు భావించినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. రైసిన్‌ను ఆహార పదార్థాలలో, రద్దీ ప్రదేశాల్లో వ్యాప్తి చేసి, పెద్ద ఎత్తున మారణహోమం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. రైసిన్‌ తయారు చేస్తున్న హైదరాబాద్ టెర్రరిస్ట్ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్.. దాన్ని ప్రయోగించడానికి పాకిస్థాన్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. మొహియుద్దీన్ గతంలో రెస్టారెంట్ బిజినెస్ చేశాడు. అక్కడే ఆముదం గింజలను ఉంచేవాడని.. వాటిని రైసిన్ తయారీకి వాడినట్లు అధికారులు చెప్పారు.

రైసిన్ అనేది ఆముదం గింజల నుంచి తీసే ఓ విషపదార్థం. ఆ గింజల నుంచి నూనె తీశాక వచ్చే పిప్పిని ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేసి.. దాని నుంచి రైసిన్‌ని తీస్తారు. ఇది.. చిన్న మోతాదు కూడా ఎంతో ప్రమాదకరం. భారత్ సహా అనేక దేశాలు సభ్యులుగా ఉన్న ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ సంస్థ ప్రకారం, రైసిన్.. రసాయన ఆయుధ జాబితాలో ఉంది. దీనిని శరీరంలో చొప్పించడం, ఇంజెక్షన్, నోటితో తీసుకోవడం ద్వారా, చర్మం ద్వారా కూడా రైసిన్ ప్రమాదకరంగా మారుతుంది. ఈ విషానికి.. వాసన, రుచి ఉండదు. అందుకే.. దీనిని ఆహారం, నీటిలో కలిపినా.. గుర్తించడం కష్టం. రైసిన్ సైనైడ్ కంటే ప్రమాదకరమైనది.

రసాయన శాస్త్రపరంగా రైసిన్ అనేది ఒక లెక్టిన్. అంటే.. కార్బో హైడ్రేట్‌తో బైండ్ అయి ఉన్న ప్రొటీన్. దీనిని.. క్యాన్సర్ చికిత్సకు కూడా వాడతారు. అయినప్పటికీ.. దీనిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. రైసిన్.. మనిషి శరీరంలోని కణాల్లో ప్రొటీన్ తయారవకుండా చేస్తుంది. దాంతో.. 36 నుంచి 72 గంటల్లో మనిషి చనిపోతాడు. రైసిన్ శరీరంలోకి ప్రవేశించిన 6 గంటల్లోపు జీర్ణకోశంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా విష ప్రయోగం జరిగిన 2 నుంచి 5 రోజుల తర్వాత కాలేయం, కేంద్ర నాడీ వ్యవస్థ, కిడ్నీలపై ప్రభావం కనిపిస్తుంది. వీటిపై.. సైటోటాక్సిక్ ప్రభావం ఉంటుంది. ఈ లక్షణాలు కనిపించడానికి ముందు బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించే అవకాశం లేదు. రైసిన్ విష ప్రభావం మొదలైన తర్వాత 3 నుంచి 5 రోజుల మధ్య మరణించే అవకాశం ఉంది.

ఒక్క ఆముదం గింజలో నుంచి వచ్చే 6 మైక్రోగ్రాముల రైసిన్‌కి.. ఓ మనిషిని చంపేంత శక్తి ఉందంటారు. ఒక్క గింజలో ఒకటి నుంచి 5 మిల్లీగ్రాముల రైసిన్ ఉంటుంది. దీనికి సుమారు వెయ్యి మందిని చంపే శక్తి ఉంటుంది. దీనికి చికిత్స లేదు. ఎలాంటి యాంటీడోస్ లేదు. సపోర్టివ్ ట్రీట్‌మెంట్ మాత్రమే చేయగలం. వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి, డీహైడ్రేషన్ లాంటివన్నీ ఒకేసారి కనిపిస్తాయ్. ప్రపంచవ్యాప్తంగా.. ఎన్నోసార్లు రైసిన్‌ని ఉపయోగించి ప్రత్యర్థులను చంపాలనే ప్రయత్నాలు జరిగాయి. అలాంటి ఎన్నో కుట్రలను భద్రతా సంస్థలు భగ్నం చేశాయ్. ఇప్పుడు.. ఉగ్రవాదులు కూడా రైసిన్ ద్వారా విష ప్రయోగానికి ప్రయత్నాలు చేయడం.. మరింత ఆందోళన పెంచుతోంది.

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో రైసిన్ పాయిజన్ ఒక్కటే కాదు.. అమ్మోనియం నైట్రేట్ కెమికల్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కెమికల్‌ని ఉపయోగించి.. దేశంలో అనేక చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నారు టెర్రరిస్టులు. అమ్మోనియం నైట్రేట్ అక్రమ నిల్వలు.. దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయా? వీటి ద్వారా.. ఎప్పటికైనా ఉగ్ర ముప్పు పొంచే ఉంటుందా? 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ని ట్రేస్ చేయకపోయి ఉంటే.. నష్టం ఢిల్లీ పేలుళ్లని మించి ఉండేదా?

ఉగ్రవాదుల దగ్గర నుంచి భారీ స్థాయిలో 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ని స్వాధీనం చేసుకున్నాక.. అందరిలోనూ తలెత్తిన ప్రశ్న ఒక్కటే. దీనితో పన్నిన ఉగ్ర కుట్రలేమిటి? అసలు.. ఇంత మొత్తంలో ఎలా సేకరించారు అని! ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌లో మరో డేంజర్ ఎలిమెంట్.. ఈ అమ్మోనియం నైట్రేట్. సాధారణంగా.. దీనిని ఎరువుల తయారీకి వాడతారు. దీనికి ఇప్పుడు ఇంధన నూనెలని కలిపి శక్తిమంతమైన పేలుడు పదార్థంగా మారుస్తున్నారు. ఇప్పటిదాకా ఇండియాలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో.. అమ్మోనియం నైట్రేట్‌ని ఉపయోగించారు. ఎన్నో ఉగ్ర కుట్రలను భగ్నం చేసినప్పుడు.. దర్యాప్తు సంస్థలు భారీగా అమ్మోనియం నైట్రేట్‌ని స్వాధీనం చేసుకున్నాయ్. 2019 పుల్వామా ఉగ్రదాడిలోనూ అమ్మోనియం నైట్రేట్‌ని వాడారు. అమ్మోనియం నైట్రేట్ పంటలకు వేస్తే ప్రాణం పోస్తుంది. అదే.. అమ్మోనియం నైట్రేట్.. డీజిల్ లాంటి ఆయిల్స్‌తో కలిస్తే.. ప్రాణాలు తీసే ఆయుధంగా మారుతుంది. ఇదొక ఆక్సిడైజర్. గాలి లేకుండానే మండుతుంది. టెంపరేచర్ 170 డిగ్రీలకు చేరితే.. ఆటోమేటిక్‌గా పేలిపోతుంది. డీజిల్, చెక్కపొడి, గంధకం, రాగి లాంటి వాటితో కలిస్తే.. వంద డిగ్రీల సెల్సియస్‌లోనే పేలుతుంది. దీనిని బట్టే.. అమ్మోనియం నైట్రేట్ ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు.

భారత్‌లో వేలాది మంది ప్రాణాలు తీసేందుకు.. దేశవ్యాప్తంగా అనేక చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నింది ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్. వాస్తవానికి.. అమ్మోనియం నైట్రేట్ ఒక స్ఫటికాకార రసాయన సమ్మేళనం. అమ్మోనియా, నైట్రిక్ ఆమ్లం ప్రతిచర్య ద్వారా ఉత్పత్తి చేసిన సింథటిక్ పౌడర్. ఇది నీటిలో వేగంగా కరిగిపోతుంది. స్వచ్ఛమైన అమ్మోనియం నైట్రేట్ స్వయంగా పేలుడు పదార్థం కాదు. ఇది పేలడానికి.. ఆర్డీఎక్స్ గానీ, టీఎన్టీ డిటోనేటర్ గానీ అవసరం. వాస్తవానికి దీనికి మండే స్వభావం ఎక్కువ. ఏదైనా పేలుడు పదార్థంతో కలిస్తేనే పేలుతుందని నిపుణులు చెబుతున్నారు. అమ్మోనియం నైట్రేట్‌ను పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎరువులలో నత్రజని మూలంగా దీనిని వాడతారు. ఇంకా మైనింగ్ పరిశ్రమలో ఉపయోగించే పేలుడు పదార్థాలల్లోనూ అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగిస్తారు. అలాంటి కెమికల్‌కు.. మంట తగిలితే పేలుడు చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది చుట్టుపక్కల వస్తువులను సెకన్లలోనే నాశనం చేయగలదు. 150 కిలోల అమ్మోనియం నైట్రేట్.. రెండు నుంచి మూడు కిలోమీటర్ల ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తుందని చెబుతున్నారు. ఈ లెక్కన.. అమ్మోనియం నైట్రేట్‌ ఎంత డేంజరో అంచనా వేయొచ్చు. ఇలాంటి కెమికల్‌.. చాలా ఈజీగా ఎంత కావాలంటే అంత.. ఉగ్రవాదుల చేతుల్లోకి చేరుతోంది.

భారత్‌లో ఏడాదికి లక్షా 20 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్ దిగుమతి అవుతోంది. దీనిని నిల్వ చేసే 80 శాతం గోదాములు రూల్స్ బ్రేక్ చేస్తున్నట్లు.. రిపోర్టులు చెబుతున్నాయ్. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్రలో అత్యధిక అమ్మోనియం నైట్రేట్ నిల్వలున్నాయి. పోర్టుల పక్కనే గోదాములున్నట్లు తెలుస్తోంది. ఒక్క గోదాములో 300 టన్నుల వరకు మాత్రమే నిల్వ చేయాలి. డీజిల్, చెక్క, గ్యాస్ లాంటి మండే స్వభావం ఉన్న పదార్థాల నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉంచాలి. గోదాములో టెంపరేచర్ 32 డిగ్రీలకు మించి ఉండకూడదు. కూలర్, వాటర్ స్ప్రింక్లర్లు కంపల్సరీ. అమ్మోనియం నైట్రేట్‌ని చెక్క షెడ్‌లో కాకుండా.. కాంక్రీట్ గోదాములోనే నిల్వ చేయాలి. ప్రతి 3 నెలలకోసారి ప్యూరిటీ టెస్ట్ చేయాలి. అది కూడా 99.5 శాతం ప్యూర్‌గా ఉండాలి. PESO లైసెన్స్, ఎక్స్‌ప్లోసివ్స్ ఇన్‌స్పెక్టర్ ఆమోదం కచ్చితంగా ఉండాలి. లేకపోతే.. జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధిస్తారు. ఇండియాలో.. అమ్మోనియం నైట్రేట్‌కి సంబంధించి.. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. డై-అమ్మోనియం ఫాస్పేట్‌లో.. అమ్మోనియం నైట్రేట్‌ని కలపడం నిషేధం. ఎరువుల కంపెనీలు.. దీనిని డై చేయాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాగ్‌కి క్యూఆర్ కోడ్, బ్యాచ్ నెంబర్ తప్పనిసరి. రైతులకు.. 25 కిలోల కంటే ఎక్కువ ఇవ్వకూడదు. భారత ప్రభుత్వం ఎక్స్‌ప్లోసివ్స్ యాక్ట్ కింద 2012లో అమ్మోనియం నైట్రేట్‌కి సంబంధించిన రూల్స్‌ని ప్రకటించింది. ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం.. పేలుడు ప్రమాదాలు, దొంగతనం, ఉగ్రవాదులు వాడకుండూ చూసుకోవమే. అయినప్పటికీ.. టెర్రరిస్టులు వందల కిలోల అమ్మోనియం నైట్రేట్‌ని సేకరించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు.. భద్రతా సంస్థలకు కొత్త సవాళ్లని విసురుతున్నాయ్.

Also Read: షేక్ హసీనా రావాలి.. బంగ్లాలో మళ్లీ హింస.. భయం గుప్పిట్లో ఢాకా

అమ్మోనియం నైట్రేట్, ఆముదం గింజలు లాంటివి.. సాధారణ వస్తువులను టెర్రరిస్టులు.. ఉగ్ర దాడులకు వాడుతున్నారు. అందువల్ల.. ఈ పదార్థాల సప్లై చైన్‌ని పర్యవేక్షించడం కష్టమవుతోంది. ఈ తరహా ఆధునిక ఉగ్రదాడులకు చెక్ పెట్టేందుకు.. నిఘా సంస్థలు టెక్నికల్‌గా, మానవ వనరుల పరంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. దేశ భద్రత విషయంలో.. ఇలాంటి కుట్రలను ముందుగానే భగ్నం చేయడం మంచిదే అయినప్పటికీ.. ఇవన్నీ మన చుట్టూ ఇంకా ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాయ్.

Story By Anup, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×