E-Paper
Advertisement

Sheikh Hasina: షేక్ హసీనా రావాలి.. బంగ్లాలో మళ్లీ హింస.. భయం గుప్పిట్లో ఢాకా

Sheikh Hasina: షేక్ హసీనా రావాలి.. బంగ్లాలో మళ్లీ హింస.. భయం గుప్పిట్లో ఢాకా

Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బాంబు పేలుళ్లు, హింసాయుత ఘటనలతో.. బంగ్లా దద్దరిల్లుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి, మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దేశంలో అస్థిరత కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ఎందుకు మొదలైంది? షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ డిమాండ్స్ ఏంటి?

బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. తాత్కాలికంగా ఏర్పాటైన యూనస్ సర్కార్ పట్ల యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కొన్ని నెలల క్రితమే దేశవ్యాప్త ఆందోళనలతో.. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన యువశక్తి.. ఇప్పుడు మహ్మద్ యూనస్ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంపైనా తిరగబడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పే.. యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కూడా చేస్తోందని.. యువత మరోసారి ఆందోళనకు దిగింది. పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ పోస్టులను రద్దు చేయడంతో.. ఈ తిరుగుబాటు మొదలైంది. ఈ వార్తలు వచ్చిన వెంటనే.. ఢాకా నుంచి చిట్టగాంగ్ వరకు దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల క్యాంపస్‌లలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. భారీ ర్యాలీలు నిర్వహించారు. బంగ్లాదేశ్ సాంస్కృతిక గుర్తింపుని రక్షించడమే లక్ష్యంగా యువత రోడ్లపైకి వచ్చింది. ఈ క్రమంలో.. బంగ్లాదేశ్ వీధుల్లో హింస చెలరేగింది.

షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఢాకా లాక్ డౌన్‌కు పిలుపునవ్వడంతో.. బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న అశాంతికి ఆజ్యం పోసినట్లైంది. దాంతో.. పోలీసులు, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్.. భారీ ఎత్తున మోహరించారు. ఢాకా ఎంట్రీ పాయింట్ల దగ్గర అనేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. హసీనాతో పాటు ఆమె సహాయకులపై నమోదు చేసిన కేసులో.. ఈ నెల 17న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వబోతోంది. ఈ క్రమంలోనే.. అల్లర్లు చెలరేగాయ్. గతేడాది ఆగస్టు నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా.. హత్య, కుట్రతో సహా అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న హింసాత్మక ఘటనల వెనుక.. యూనస్ తాత్కాలిక ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతతో పాటు షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ తిరిగి అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కారణమవుతున్నాయ్.

షేక్ హసీనాని గద్దె దించడానికి ప్రధాన కారణమైన విద్యార్థి నాయకత్వంలోని నిరసనకారులు.. యూనస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జూలై నేషనల్ చార్టర్‌లో.. గతేడాది నిరసనల్లో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు గుర్తింపు, ఆర్థిక సాయం, పునరావాసం వంటి అంశాలపై తగిన స్పష్టత, ప్రాధాన్యత లేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనస్ ప్రభుత్వం ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థలకు, హసీనా పాలనలో జైలు పాలైన బీడీఆర్ తిరుగుబాటుదారులకు, శిక్ష పడిన ఇస్లామిస్ట్ నాయకులకు స్వేచ్ఛ కల్పించడం.. సైన్యంలోనూ, ప్రజలలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. ఇది దేశంలో ఉగ్ర కార్యకలాపాలు పెరగడానికి దారితీసింది. ఎన్నికల నిర్వహణలో యూనస్ సర్కార్ జాప్యం చేయడం, వివాదాస్పద ఖైదీలను విడుదల చేయడం, సైనిక సలహాదారు నియామకం లాంటి అంశాలపై యూనస్‌కు, ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్‌కు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి.

ముఖ్యంగా.. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం ప్రజాస్వామ్యంపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. దాదాపు 40% ఓట్ల వాటా కలిగిన ప్రధాన పార్టీని నిషేధించడం సంక్షోభాన్ని మరింత పెంచింది. యూనస్ ప్రభుత్వం.. హసీనా అనుకూల నాయకులను, కార్యకర్తలను అణచివేయడం, వారిపై కేసులు పెట్టడం లాంటి చర్యలు తీసుకోవడం వల్ల.. అవామీ లీగ్ నిరసనలు చేపట్టింది. షేక్ హసీనాపై హత్యతో పాటు ఇతర నేరాల ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో.. త్వరలోనే అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తీర్పు వెలువడే అవకాశం ఉండటం వలన.. ఆ తీర్పుని వాయిదా వేయడానికి అవామీ లీగ్ భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అంతేకాదు.. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలపై అణచివేత, ఇస్లామిస్ట్ శక్తులకు మద్దతు లాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. యూనస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ నాయకురాలు షేక్ హసీనాతో పాటు పార్టీలోని ఇతర నాయకులు, కార్యకర్తలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలంటున్నారు. అవామీ లీగ్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, వెంటనే ఆ నిషేధాన్ని ఎత్తేసి తమ పార్టీ ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతించాలంటున్నారు. ఈ డిమాండ్లను సాధించడానికి, ముఖ్యంగా షేక్ హసీనా తీర్పును ప్రభావితం చేయడానికి, అవామీ లీగ్ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ఢాకాలో లాక్‌డౌన్‌ వంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇదే.. బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలకు, హింసకు దారితీశాయ్.

షేక్ హసీనాని గద్దె దించారు.. యూనస్‌కి తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతలు అప్పజెప్పారు. అయినా సరే.. యువత ఎందుకు నిరసనలకు దిగుతోంది. యూనస్ ప్రభుత్వంపై తిరుగుబాటుకు అసలు కారణమేంటి? షేక్ హసీనా ఏమంటున్నారు? ఎన్నికలు సక్రమంగా జరిగి.. అవామీ లీగ్ పోటీలో ఉంటే.. మళ్లీ హసీనా పార్టీకే బంగ్లా ప్రజలు పట్టం కడతారా? బంగ్లా నిరసనల్ని లోతుగా విశ్లేషిస్తే.. అర్థమవుతున్నదేంటి?

వచ్చే ఏడాది మొదట్లో.. బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో.. అల్లర్లు చెలరేగాయి. దాంతో.. ఆ దేశంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇటీవలే.. షేక్ హసీనా భారత మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వాన్ని మరింత కలవరపెట్టాయి. హసీనా బహిష్కరణ తర్వాత.. భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయ్. యూనస్ ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో హసీనాను అప్పగించాలని కోరినా.. భారత్ స్పందించలేదు. అలా.. గతేడాది అవామీ లీగ్ ప్రభుత్వ పతనంతో ముగిసిన హింసాత్మక నిరసనలు.. ఇప్పుడు మళ్లీ చెలరేగాయ్. ఈ రాజకీయ ఉద్రిక్తతలతో చెలరేగిన హింస.. జనజీవనాన్ని స్తంభింపజేసింది. నిప్పు పెట్టడం దగ్గర్నుంచి.. బాంబుల మోత దాకా.. రాజధాని ఢాకా దద్దరిల్లుతోంది. ఈ స్థాయి హింసకు.. అవామీ లీగ్ మద్దతుదారులే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

షేక్ హసీనా ప్రభుత్వం పతనమై.. యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా.. నిరసనలు, అశాంతి కొనసాగుతున్నాయ్. మరోవైపు హసీనా కూడా.. తాను బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలంటే.. ముందుగా భాగస్వామ్య ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని, అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తేయాలని కోరుతున్నారు. అంతేకాదు.. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాలని కోరారు. యూనస్ ప్రభుత్వం.. మితవాదుల మద్దతుపై ఆధారపడుతోందని ఆరోపించారు. బంగ్లా ప్రభుత్వం తన మూర్ఖపు, ఆత్మహత్యా చర్యలతో.. భారత్‌తో ముఖ్యమైన సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న నిరసనలు, యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ తిరుగుబాటు.. కేవలం రాజీనామా కోసం జరిగిన గత ఉద్యమానికి కొనసాగింపు మాత్రమే కాదు. అనేక ఘర్షణల మధ్య జరుగుతున్న పోరాటం. హసీనాను గద్దె దించిన తర్వాత కూడా, తాత్కాలిక ప్రభుత్వంలో.. పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడంతో, దేశం పూర్తిగా విచ్ఛిన్నమైన రాజకీయ వ్యవస్థను ఎదుర్కొంటోంది. ఈ నిరసనలు, బంగ్లాదేశ్ నిజమైన, సమ్మిళిత ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు పయనించాలనే ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నాయి.

Also Read: మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్టీఏ కూటమి.. 

బంగ్లాదేశ్ ప్రస్తుతం ఒక చారిత్రక కూడలిలో ఉంది. హసీనా పాలనలో ఆర్థికంగా పురోగమించినప్పటికీ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడింది. యూనస్ ప్రభుత్వం లౌకిక ఆకాంక్షలను విస్మరించి, రాజకీయ అస్థిరతకు దారితీస్తోంది. ఈ సంక్షోభం, రాబోయే ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల మధ్య జరిగే పోటీ కాదు, బంగ్లాదేశ్ జాతీయ గుర్తింపు, లౌకిక స్వభావం, భవిష్యత్ దిశను నిర్ణయించే ఒక కీలక ఘట్టంగా మారబోతోంది.

Story By Anup, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×