Bhadradri Roads: రోడ్లు ఎలా ఉండాలంటే ఒకప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఎగ్జాంపుల్ గా చూపించేవారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గుంతలు, గతుకుల రోడ్లకు ఆ జిల్లా అడ్డాగా మారిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్లతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి.. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు ప్రధాన రహదారులపై ప్రయాణం వాహనదారులకు సవాల్‌గా మారింది.
అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు, రోగులను ఆసుపత్రులకు తరలించడం కత్తి మీద సాములా అయింది. గ్రామీణ ప్రాంతాలకు అంబులెన్స్‌లు చేరుకోవడానికే గంటల టైం పడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంత రోడ్ల దుస్థితిని పట్టించుకునే నాధుడే లేడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలన మారుతున్నా పాలకులు మారుతున్నా ఏజెన్సీ ప్రజల కష్టాలు మాత్రం అలాగే మిగిలిపోయాయని మండిపడుతున్నారు.
Also read: ట్రోఫీ వద్దనుకున్న టీమిండియా, ఇకపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు
ఈ రోడ్లపై తిరిగే ఆటో డ్రైవర్లు తమకు వచ్చిన ఆదాయం రిపేర్లకే వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ రహదారుల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇప్పటికే ధ్వంసమైన రోడ్లు ఇసుక లారీలు, భారీ వాహనాల రాకపోకలతో మరింతగా దెబ్బతింటున్నాయి. నాసిరకం పనులు, R&B అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నా నాణ్యమైన రహదారులు అందుబాటులోకి రావడం లేదని విమర్శిస్తున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు సమస్యను విన్నవించినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికుల వెర్షన్.
Also read: రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్