Miniature Ganesh: చిన్నదే..కానీ చూడగానే అబ్బురపరిచే కళాఖండం ఇది. కేవలం సెంటీమీటర్ ఎత్తులో బంగారు గణనాథుడు..అంతే పొడవులో వాహనాన్ని తయారుచేసి అద్భుతం సృష్టించారు సూక్ష్మకళాకారుడు తాళాబత్తుల సాయి. కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన సాయి. వినాయక చవితి సందర్భంగా ఈ అద్భుతాన్ని తయారు చేశారు. వృత్తిరీత్యా స్వర్ణకారుడైన సాయి..తన తండ్రి స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. ఒకవైపు గోల్డ్ బిజినెస్ చేస్తూనే..తనలోని సూక్ష్మకళా ప్రతిభకు పదును పెడుతున్నారు.
చెక్క, బంగారంతో పాటు చైనా నుంచి తెప్పించిన స్టీల్ బేరింగులను ఉపయోగించి వినాయకుడితో పాటు..ఈ సూక్ష్మ వాహనాన్ని రూపొందించారు. రోజుకు కేవలం గంట చొప్పున..వరుసగా 8 రోజుల పాటు శ్రమించి ఈ కళాఖండానికి రూపమిచ్చారు. సూక్ష్మకళలో సాయికి ఇది తొలి అద్భుతం కాదు. గతంలో పెన్సిల్ ముల్లుపై గౌతమ బుద్ధుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదావరి మాత వంటి సూక్ష్మ కళాఖండాలను రూపొందించారు. బిందు కళ ద్వారా 20 వేల బొట్టు బిళ్లలతో స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రాన్ని 8 వేల బిందీస్‌తో వినాయకుడి చిత్రాన్ని తయారు చేశారు. అంతేకాదు కేవలం 8 x 4 మిల్లీమీటర్ల పరిమాణంలో పనిచేసే సూక్ష్మ మౌస్ ట్రాప్‌ను రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు.
ఇక సూక్ష్మ పూర్ణకుంభాన్ని రూపొందించిన సాయి..లండన్‌లోని వరల్డ్ రికార్డ్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఒక్క సెంటీమీటర్‌లోనే భక్తిని కళను ఆవిష్కరించిన తాళాబత్తుల సాయి ఇప్పటికే నాలుగుసార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారు. ఇప్పుడు చీమ లాగుతున్న సూక్ష్మ వినాయకుడితో మరోసారి తన ప్రతిభను చాటారు. తన కళతో పెద్దాపురానికి గుర్తింపు తీసుకొస్తూ సూక్ష్మ కళకు సరికొత్త అర్థం చెబుతున్నారు.
Also read: ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!