Fake Coins: చూడటానికి అచ్చం ఒరిజినల్‌లానే ఉంటుంది. చేతిలోకి తీసుకుంటే పెద్దగా డౌట్ కూడా రాదు. కానీ ఒక్కసారి నాణెం నేలపై పడితే వచ్చే సౌండ్ మాత్రం తేడాను చెప్పేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో బయటపడిన నకిలీ నాణేల ఫ్యాక్టరీ కథ ఇది. చిన్న గదిలో ఇద్దరు, ముగ్గురు కలిసి చేసే దందా కాదు. ఏకంగా ఇండస్ట్రియల్ లెవల్‌లో నకిలీ కాయిన్ల తయారీ సాగుతోంది. పోలీసులు దాడి చేసినప్పుడు ఆరు మెషీన్లు, ఇనుప డైలు, పాలిషింగ్ పరికరాలు, డై ఫినిషింగ్‌కు ఉపయోగించే సామగ్రితో పాటు భారీగా సగం తయారైన నాణేలు బయటపడ్డాయ్. ఈ సెటప్‌తో రోజుకు దాదాపు 12 వేల నకిలీ 20 రూపాయల కాయిన్స్ తయారు చేయొచ్చంటున్నారు.
ఇక్కడ మరో విషయం పోలీసులనే షాక్‌కు గురిచేసింది. ఈ దందా ఇప్పటిది కాదు 25 ఏళ్లుగా సాగుతున్న నకిలీ నాణేల నెట్‌వర్క్ అని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెబుతున్న ఉపకార్ లూథ్రా అలియాస్ అభయ్ ప్రతాప్ సింగ్ 2001 నుంచే ఈ దందాలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ గ్యాంగ్ తయారు చేసిన కాయిన్స్ ఎక్కడెక్కడికి వెళ్లాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. చిన్న చిన్న నగదు లావాదేవీలు జరిగే దుకాణాలు, టోల్ ప్లాజాలు, మద్యం దుకాణాలు టార్గెట్‌గా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
Also read: రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!
దర్యాప్తులో ఏడు రిజిస్టర్లు, ఎనిమిది మొబైల్ ఫోన్లు కీలక ఆధారాలుగా మారాయ్. వాటిలోని లెక్కలు, కాంటాక్టులు బయటకు తీస్తే ఈ నకిలీ నాణేల నెట్‌వర్క్ ఎంత దూరం విస్తరించిందో తేలనుంది. ఇప్పటివరకు ఐదుగురు అరెస్ట్ మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. ఫ్యాక్టరీ బయటపడింది. కానీ దాని వెనుక దాగి ఉన్న 25 ఏళ్ల నెట్‌వర్క్ ఛేదించడం ఇప్పుడు పోలీసుల ముందున్న అసలు సవాల్.
Also read: షాపింగ్ ప్రియులకు ప్రయులకు పిడుగులాంటి వార్త.. త్వరలో భారీగా పెరగనున్న ధరలు!