Vijayasai Reddy: ఎంత బడాబాబులైనా రాజకీయాలకు అలవాటు పడితే వాటిని వదులుకోలేరు. పొలిటికల్ రిటైర్‌మెంట్ అని ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత మళ్లీ పాలిటిక్స్ వైపే చూస్తుంటారు. వైసీపీలో జగన్ తర్వాత జగన్‌లా ఒక వెలుగువెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయం సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆయన కొత్త పొలిటికల్ ఫ్లాట్‌ఫాం కోసం బీజేపీ ముఖ్యనేతలతో టచ్‌లోకి వెళ్లారన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వైసీపీలో పెత్తనం చెలాయించిన విజయసాయిరెడ్డి
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్.. కలిసిమెలిసి ఉండేవాళ్లు. వైసీపీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి అనే రేంజ్ ఉండేది. వైసీపీ అధికారంలోకి రాకముందు కూడా పార్టీలో విజయసాయిరెడ్డి పెత్తనం కొనసాగింది. అంతెందుకు వైసీపీ ఆవిర్భవించిన కొత్తల్లో జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డి కూడా ఆయనతో కలిసి 16 నెలలు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం అనుభవించారు.
వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన విజయసాయి రెడ్డి
అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వాత విజయసాయి రెడ్డి సైలెంట్ అయిపోవడం, ఇటీవల పార్టీకి గుడ్‌పై చెప్పి.. రాజకీయాలకే గుడ్‌పై చెబుతున్నానని చెప్పడం అన్నీ జరిగిపోయాయి. తాజాగా ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లపోతున్నారు అనే ప్రచారం మొదలైంది. ఏపీ విభజన తర్వాత.. కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి.. రాజకీయాలను వదిలేసి.. వ్యవసాయం చేసుకోవడం ప్రారంభించారు. అదే విధంగా వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయి రెడ్డి.. నిజంగానే పొలానికి వెళ్లి.. అక్కడ ఫొటోలు దిగి.. తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు కూడా పెట్టారు.
వైఎస్ కుటుంబంతో మూడు తరాల అనుబంధం
వైసీపీలో నంబర్ టూగా వ్యవహరించి పార్టీ పునాదుల వేయడం దగ్గర నుంచి పనిచేసిన విజయసాయిరెడ్డి అంటే కేరాఫ్ వైసీపీ అనే ఎవరైనా అంటారు. అంతలా అనుబంధం పార్టీతో ఉంది. అంతే కాదు వైఎస్ కుటుంబంతో మూడు తరాల బంధం ఉంది. వైసీపీకి ఆయన ఒక పిల్లర్ గా నిలబడ్డారు. అటువంటి సాయిరెడ్డి వైసీపీని వీడిపోతారు అని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం శాశ్వతం అనుకున్నారు. ఆయనకు అదే పార్టీ తప్ప మరే అప్షన్ ఉండదని అందరూ భావించారు.
కొత్త ఏడాదిలో వైసీపీకి షాక్ ఇచ్చిన విజయసాయిరెడ్డి
అయితే విజయసాయిరెడ్డి మారిన రాజకీయ పరిస్థితుల్లో 2025 కొత్త ఏడాది వస్తూనే వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేశారు. ఆయన జనవరి నాలుగవ వారంలో వైసీపీకి రాజీనామా చేశారు. అంతే కాదు రాజకీయాలకే దూరం అన్నారు. వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఇక ఇదే తన జీవితంలో అసలైన లక్ష్యమని అన్నారు. కట్ చేస్తే ఆయన తాజాగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ హైదరాబాద్ వచ్చిన వేళ ఆయనకు స్వాగతం పలుకుతూ కనిపించారు. దాంతో ఆయన రాజకీయం వీడాలనుకున్నా వీడేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేంద్ర పెద్దలతో సాయిరెడ్డికి సత్సంబంధాలు
ఆ క్రమంలో మరో వార్త జోరుగా ప్రచారంలోకి వస్తోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిపోతారంటున్నారు. వైసీపీ నుంచి రెండో సారి రాజ్యసభకు ఎంపికై ఆ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి బీజేపీతో మంచి సంబంధాలున్నాయి. ఆయన 2016లో రాజ్యసభకు తొలిసారి ఎంపికైనప్పటి నుంచి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగించారు. ప్రధాని మోడీ సైతం ఆయన పేరు గుర్తు పెట్టుకుని పలుకవరించేవారు. అంతే కాదు అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే ఆయనకు అపాయింట్మెంట్లు అడిగిన వెంటనే ఇచ్చేవారు.
జూన్‌లో సాయిరెడ్డి కాషాయ తీర్ధం పుచ్చుకునే అవకాశం
అందుకే విజయసాయిరెడ్డి తాను రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నపుడు ప్రత్యేకించి మోడీ, అమిత్ షాలకు స్పెషల్‌గా థాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే బీజేపీలోకి విజయసాయిరెడ్డి వెళ్తారని అంటున్నారు. దానికి ఒక డేట్ టైం ముహూర్తం కూడా నిర్ణయించారు అని అంటున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకుంటారంట. నిజానికి బీజేపీ పెద్దలతో ఈ రోజుకీ ఆయన రిలేషన్స్ కొనసాగిస్తున్నారని అంటున్నారు.
సాయిరెడ్డి రాజకీయ పయనంపై కూటమి పెద్దలకు క్లారిటీ
విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రాగానే బీజేపీలో చేర్చుకునేందుకు ఆయనకు ఆహ్వానం అందిందన్న టాక్ వినిపిస్తుంది. అయితే వెంటనే చేరితే వైసీపీని, జగన్‌ని వెన్నుపోటు పొడిచి వచ్చారు అన్న అపవాదు వస్తుందన్న ఆలోచనతోనే విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ అన్న ప్రకటన ఇచ్చారని అంటున్నారు. అందుకే కొన్ని నెలలు ఆగి తన భవిషత్తు ప్రణాళికపై క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట. ఇక విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారన్నది టీడీపీ కూటమి పెద్దలకు కూడా ఒక ఐడియా ఉందన్న ప్రచారం ఉంది.
సాయిరెడ్డి బీజేపీలో చేరితే జగన్‌కి గండం తప్పదా?
విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో చేరితే జగన్ కి సరికొత్త సవాల్ ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. జగన్ ఏ-1 ఉన్న ఆక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ-2 నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుల విచారణ పురోగతిపై ఈడీ, సీబీఐలపై కోర్టుల నుంచి వత్తిడి పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సాయిరెడ్డి కాషాయ కండువా కప్పుకుని అప్రూవర్‌గా మారితే ఇక ఏపీ పాలిటిక్స్‌లో పెనుమార్పులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.