BRS-Municipal Elections: మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మెజార్టీ మున్సిపాలిటీలో విజయం సాధించడానికి కార్యాచరణ సైతం సిద్ధం చేసిందట. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించింది. అంతేకాదు మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఇన్‌ఛార్జ్‌లను సైతం నియమించింది. నేతల సమన్వయ బాధ్యతలను.. పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను నివేదించాలని ఆదేశించింది. ఆ ఇన్‌ఛార్జ్‌ల మానిటరింగ్‌ను తెలంగాణ భవన్ నుంచి చేస్తామని పార్టీ ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఎలా చక్క దిద్దుతారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైందట.
మున్సిపల్ పోరులో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ వ్యూహారచన చేస్తోంది. పురపోరులో సత్తాచాటి రాజకీయంగా తిరిగి నిలదొక్కుకోవడానికి కార్యచరణ సిద్ధం చేస్తుందట. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేలా తెలంగాణ భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారట. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడంతో మరింత స్పీడ్‌గా యాక్షన్ ప్లాన్ రేడీ చేసు పనిలో పడ్డారంట గులాబీ నేతలు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎలా అధ్యయనం చేస్తారు. విభేదాలతో సతమతమవుతున్న నేతలను ఎలా సమన్వయ పరుస్తారు? పార్టీని ఎలా విజయ తీరాలకు నడిపిస్తారనేది ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది.
ఒక్కో మున్సిపాలిటీలో ఇప్పటికే రెండు వర్గాలుగా గులాబీ నేతలు విడిపోయారనే టాక్ పార్టీ నాయకత్వాన్ని ఆందోళనలకు గురిచేస్తుందట. ఒక వర్గాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్నారంట. వారి వైఖరిని వ్యతిరేకించే వారు రెండో గ్రూపుగా కొనసాగుతున్నారంట. ఎన్నికల తర్వాత నుంచి కొనసాగుతున్న ఈ గ్రూపు రాజకీయాలు పార్టీ హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారాయంట.
వాటిని చక్కదిద్దాలని గతంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మిగిలిన పార్టీ ముఖ్య నేతలు సైతం ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందంట. అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే లేక మాజీ ఎమ్మెల్యేలకే పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంతో వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్యాడర్ అసంతృప్తితో ఉందంట. ఈ తరుణంలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలా కలిసి పనిచేస్తారనేది ఇప్పుడు పార్టీలోనే చర్చనీయాంశమైందట.
మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా పార్టీ సీనియర్ నేతలను బీఆర్ఎస్ నియమించింది. ఇప్పటివరకు ఆ మున్సిపాలిటీలపై మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలదే ఆధిపత్యం నడుస్తుందని గులాబీ నేతలు అంటున్నారు. వారు చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహారాలు నడుస్తున్నాయంట. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమించడంతో వారి మధ్య సమన్వయం కుదురుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చల్లో నలుగుతోందంట.
అదే విధంగా మున్సిపాలిటీలో నేతల మధ్య సమన్వయం లోపం ఉండడంతో వాటిని సైతం ఎలా పరిష్కరిస్తారు?.. ఎలా ముందుకు పోతారు?.. ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించనిస్తారా? లేదా అని పార్టీ శ్రేణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ అధిష్టానం సైతం వారిని తెలంగాణ భవన్ నుంచి ఎలా మానిటరింగ్ చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మున్సిపల్ ఎన్నికలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమించారు సరే… కానీ, ప్రచార ఖర్చు ఎలా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారిందట. ఒక్కో మున్సిపాలిటీలో సుమారు 15 నుంచి 30 వరకు డివిజన్లు ఉంటాయి. ఒక్కో డివిజన్‌కు రూ.5 లక్షలకు పైగా ఖర్చు అవుతుందనేది గులాబీ నేతల అంచనా. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో ఖర్చు విషయంలో అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫండ్ ఇవ్వాలని ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన సమీక్ష సమావేశాల్లో పార్టీ అధిష్టానాన్ని నేతలు కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటివరకు పార్టీ అధిష్టానం నుంచి దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదని గులాబీ నేతలు అంటున్నారు. ఎన్నికల ఖర్చు ఎలా అని అటు అభ్యర్థులతో పాటు ఇటు ఇన్‌ఛార్జ్ ఉన్న నేతలు సైతం తర్జన భజన పడుతున్నారట. ఏది ఏమైనా గులాబీ పార్టీ అన్ని సమస్యలను అధిగమించి, ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటున్నదనేది ఆసక్తి రేపుతోంది.