Aircraft Crash: భారత రాజకీయ చరిత్రలో గగనతల ప్రయాణాలు అనేకమంది అగ్రశ్రేణి నాయకులను అకాలంగా కబళించాయి. సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణం లేదా అనుకోని మానవ తప్పిదాల వల్ల జరిగిన ఈ ప్రమాదాలు కేవలం ప్రాణ నష్టమే కాకుండా.. దేశ రాజకీయ గమనాన్ని, వ్యూహాత్మక దిశను సైతం మార్చేశాయి. 1980లో సంజయ్ గాంధీ మరణం నుంచి నేడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూయడం వరకు జరిగిన ఈ వరుస విషాదాలు విమాన భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ కథనంలో ఆయా ప్రమాదాల వెనక ఉన్న పూర్తి వివరాలను, అవి దేశంపై చూపిన ప్రభావాన్ని తెలుసుకుందాం.
అజిత్ పవార్ విమాన ప్రమాదం (28 జనవరి 2026):
మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ‘దాదా’, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, నేడు జరిగిన విమాన ప్రమాదంలో ప్రమాదంలో మరణించారు. ఈ వార్త దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్ పవార్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న ‘బాంబార్డియర్ లీర్‌జెట్ 45’ (రిజిస్ట్రేషన్ VT-SSK) విమానం బారామతి రన్‌వేపై ల్యాండ్ కావడానికి కొద్ది క్షణాల ముందు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు సమిత్ కపూర్, శాంభవి పాఠక్, ఒక భద్రతా అధికారి. సహాయకుడు ప్రాణాలు కోల్పోయారు.
వివాదాస్పద అంశం: ఈ విమానం గతంలో (2023లో) ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదానికి గురైంది. అప్పట్లో మరమ్మతులు చేసిన అదే విమానాన్ని మళ్ళీ వీఐపీ ప్రయాణాలకు వినియోగించడంపై ఇప్పుడు విచారణ ముమ్మరమైంది.
భారత రాజకీయాలను మలుపు తిప్పిన ఇతర ప్రమాదాలు:
1. సంజయ్ గాంధీ (1980): ఇందిరా గాంధీ రాజకీయ వారసుడిగా ఎదిగిన సంజయ్ గాంధీ. 1980 జూన్ 23న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. కొత్తగా కొన్న ‘పిట్స్ ఎస్-2ఎ’ విమానంలో విన్యాసాలు చేస్తుండగా విమానం అదుపు తప్పి కిందకు కూలిపోయింది. ఆయన మరణం వల్ల రాజీవ్ గాంధీ అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.
2. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి (2009): ఉమ్మడి ఏపీ సీఎంగా వైఎస్ఆర్ జనరంజక పాలన సాగిస్తున్న వేళ.. 2009 సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం ఒక పెను విషాదం. ఆయన ప్రయాణిస్తున్న ‘బెల్-430’ హెలికాప్టర్ పావురాల గుట్ట వద్ద కూలిపోయింది. దట్టమైన వర్షం, ప్రతికూల వాతావరణం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలని దర్యాప్తు సంస్థలు తేల్చాయి.
3. మాధవరావు సింధియా: కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రభావవంతమైన నేత మాధవరావు సింధియా, 2001లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ప్రైవేట్ విమాన ప్రమాదంలో మరణించారు. భారీ వర్షం కారణంగా విమానం మంటల్లో చిక్కుకుని కూలిపోగా, ఆయనతో పాటు నలుగురు జర్నలిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
4. జనరల్ బిపిన్ రావత్: భారత సైనిక దళాల తొలి CDS జనరల్ బిపిన్ రావత్ మరణం రక్షణ రంగానికి తీరని లోటు. 2021 డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్ వద్ద జరిగిన హెలికాప్టర్ క్రాష్‌లో ఆయన తన భార్యతో పాటు మరో 12 మంది అధికారులతో కలిసి కన్నుమూశారు.
Also Read: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి, ఆ విమానం గురించి మరికొన్ని వివరాలు
విమాన భద్రత – ప్రస్తుత సవాళ్లు:
వీఐపీల ప్రయాణాల్లో భద్రత అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగానే మిగిలిపోతోంది. ముఖ్యంగా కింద పేర్కొన్న అంశాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
వాతావరణం: కొండ ప్రాంతాలు, అడవులు, భారీ వర్షాల్లో హెలికాప్టర్ ప్రయాణాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి.
సాంకేతిక లోపాలు & పాత విమానాలు: అజిత్ పవార్ ఘటనలో లాగే.. పాతబడిన లేదా గతంలో ప్రమాదాలకు గురైన విమానాలను మళ్ళీ వాడటం ప్రాణాంతకంగా మారుతోంది.
పైలట్ నిర్ణయాలు: అత్యవసర సమయాల్లో వాతావరణాన్ని అంచనా వేయడంలో పైలట్లు చేసే చిన్న తప్పు కూడా ఘోర ప్రమాదాలకు దారి తీస్తోంది.
నిరంతరం ప్రజల కోసం శ్రమించే నాయకులు ఇలాంటి ప్రమాదాల్లో మరణించడం దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిలిస్తుంది. అజిత్ పవార్ మృతి మహారాష్ట్రకు తీరని లోటు. ఈ ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తులో వీఐపీ ప్రయాణాల కోసం మరింత కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్‌ను , ఆధునిక విమానాలను మాత్రమే వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.