BigTV English

Chhaava Movie: ఛావాలో ఏముంది? శంభాజీ మరో శివాజీనా!

Chhaava Movie: ఛావాలో ఏముంది? శంభాజీ మరో శివాజీనా!

Chhaava Movie: ఒక్క సినిమా.. ఇప్పుడు ఇండియాని కదిలిస్తోంది. ఒక్కడి చరిత్ర.. మరాఠాలందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథతో తెరకెక్కిన ఛావా.. సినీ ప్రియుల్నే కాదు భారతీయులందరినీ కదిలిస్తోంది. తెరపై శంభాజీని చూసి.. ప్రతి ఒక్కరూ ఏడ్చేస్తున్నారు. శంభాజీ వీరత్వాన్ని తలచుకొని.. భావోద్వేగానికి గురవుతున్నారు. ఇంతలా కనెక్ట్ అవడానికి.. అంతలా ఏముంది ఆ సినిమాలో?


సినిమా రిలీజయ్యే దాకా ఎలాంటి అంచనాల్లేవ్..

కానీ.. బొమ్మ పడ్డాక లెక్క మారిపోయింది!


ఛావా.. ఇండియాలో లేటెస్ట్ సెన్సేషన్! అంతకుమించి.. సినీ లవర్స్‌కి, ముఖ్యంగా మరాఠాలందరికీ గట్టిగా కనెక్ట్ అయిన ఎమోషన్. కొన్ని కొన్ని సార్లు.. కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాల్లేకుండానే రిలీజ్ అయిపోతుంటాయ్. థియేటర్లో బొమ్మ పడ్డాకే.. దాని వెయిట్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు టాకీస్‌లో నడుస్తున్న ఛావా కూడా అలాంటిదే! మూవీ టాక్.. ముందు టాకీస్ దాటింది. తర్వాత స్టేట్ బోర్డర్స్ దాటింది. సోషల్ మీడియాలో అయితే.. ఇంటర్నెట్ బారియర్స్‌ని బద్దలుకొట్టి.. ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్రని అందరికీ తెలిసేలా చేస్తోంది.

సినిమాతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఆడియెన్స్

ఛావా సినిమాని.. ఎవరూ ఓ సినిమాలా చూడట్లేదు. చూసిన ప్రతి ఒక్కరూ.. సినిమాతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. ఛత్రపతి శివాజీ వీరత్వాన్ని, ఆయన వారసుడి పరాక్రమాన్ని తెరపై చూస్తూ.. మళ్లీ చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు. భావోద్వేగానికి గురవుతున్నారు. ఛత్రపతి శంభాజీ మహరాజ్‌ని.. మరాఠాలు తమ ఆత్మగౌరవానికి ప్రతీకగా చూస్తున్నారు. ఆ రోజుల్లో.. మొఘలులతో జరిగిన పోరాటం, మరాఠాల వీరత్వం, శంభాజీ పరాక్రమం, ఆయన అనుభవించిన నరకం, చేసిన త్యాగం.. ఇలా ప్రతి ఎలిమెంట్‌తో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. థియేటర్‌లో కూర్చున్నచోటే నిలబడి.. నివాళులర్పిస్తున్నారు. భావోద్వేగానికి గురవుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. మరాఠా గడ్డపై పుట్టినోళ్లంతా.. ఇప్పుడు ఛావా సినిమాని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

తెలుగులో అన్నమయ్య, శ్రీరామదాసుకు ఫుల్ రెస్పాన్స్

నిజానికి.. దేవుడి సినిమాలు, దేశభక్తికి సంబంధించిన సినిమాలు రిలీజైనప్పుడు.. ఇలాంటి సీన్లు థియేటర్లలో కనిపిస్తూ ఉంటాయ్. తెలుగులో అన్నమయ్య, శ్రీరామదాసులాంటి సినిమాలు వచ్చినప్పుడు.. అంతా థియేటర్లకు క్యూ కట్టారు. దేవుళ్లకు, సినిమా పోస్టర్లకు పూజలు చేశారు. ఆ మధ్య వచ్చిన.. ఉరి సినిమాకు కూడా ఇలాంటి రెస్పాన్సే కనిపించింది. హౌ ఈజ్ ద జోష్ అనే స్లోగన్.. ఇండియా మొత్తం రీసౌండ్‌లో వినిపించింది. కానీ.. ఓ పీరియాడికల్ డ్రామాకు.. జనం నుంచి ఇంత స్పందన, ఈ రకమైన ఎమోషనల్ రియాక్షన్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. ఇప్పుడదే జరుగుతోంది. చరిత్ర సృష్టించి.. చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన ఛత్రపతి శంభాజీ మహరాజ్ గురించి.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

అన్ని భాషల వాళ్లు చూడాలని కోరుతున్న మరాఠాలు

ఛావా సినిమా.. చాలా మందికి ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. మూవీ టాక్ విన్నాక.. థియేటర్లలో ఆడియెన్స్ ఎమోషనల్ రియాక్షన్స్ చూశాక.. అంతా తీరిక చేసుకొని మరీ.. సినిమాకు వెళ్తున్నారు. కనెక్ట్ అవుతున్నారు. అక్కడే ఏడ్చేస్తున్నారు. ఛత్రపతి శంభాజీ మహరాజ్ చరిత్రని తెరపై చూస్తూ.. పండగ చేసుకుంటున్నారు. అయితే.. ఛావా కేవలం హిందీలోనే రిలీజైంది. అయినప్పటికీ.. అన్ని భాషల వాళ్లు చూడాలని కోరుతున్నారు. శంభాజీ మహరాజ్‌ని.. కేవలం ఓ మరాఠా ఛత్రపతిగా కన్నా.. హిందూ రాజుగా, సనాతన ధర్మ రక్షణకై పోరాడిన యోధుడిగా చూడాలంటున్నారు. ఛత్రపతి శివాజీ వారసత్వాన్ని నిలబెట్టిన వీరుడిగా చూడాలంటున్నారు. మతోన్మాది ఔరంగజేబుకు ఎదురొడ్డి నిలబడి.. మొఘలుల గుండెల్లో శివాజీ నాటిన భయాన్ని.. కొన్నేళ్ల పాటు అలాగే ఉంచిన ధీరుడిగా చూడాలంటున్నారు.

క్లైమాక్స్‌లో భావోద్వేనాకి గురవుతున్న ఆడియెన్స్

ఛత్రపతి శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటన చూశాక.. ప్రతి ఒక్కరూ ఆ పాత్రతో కనెక్ట్ అవుతున్నారు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు.. క్లైమాక్స్‌లో భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ యాక్టింగ్ చూసివాళ్లంతా.. శభాష్ అంటున్నారు. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాని.. అభిమానులు, మరాఠా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. సినిమా పూర్తవగానే.. ఏకంగా గుర్రంపై శంభాజీ వేషధారణలో సినిమా హాల్లోకి వచ్చేశాడు ఓ అభిమాని. ఇది చూసిన వారంతా.. జై శంభాజీ మహరాజ్ అంటూ నినాదాలు చేయడం వైరల్‌గా మారింది.

శంభాజీ మహారాజ్‌కు జై, జై భవానీ.. అంటూ నినాదాలు 

చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ఛావాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూసి చిన్నారులు చేస్తున్న నినాదాలు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. శంభాజీ మహారాజ్‌కు జై, జై భవానీ.. నినాదాలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇలాంటి వీడియోలు షేర్ చేస్తూ.. ఇది తాము సొంతం చేసుకున్న నిజమైన గౌరవం అంటూ ఛావా మూవీ టీమ్ చెబుతోంది. సినిమా చూసిన చాలా మంది.. థియేటర్ల నుంచి కన్నీళ్లతో బయటకొస్తున్నారు. ఛత్రపతి శివాజీ వారసుడి పరాక్రమాన్ని, వీరత్వాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

ఛావా.. మూవీ ప్రేక్షకులకు, మరాఠాలకు.. ఎందుకింతలా కనెక్ట్ అయింది? అసలు.. ఛత్రపతి శంభాజీ మహరాజ్ ఎవరు? ఛత్రపతి శివాజీ వారసుడిగానే తెలిసిన మనకు.. ఆయన గురించి తెలియాల్సిన చరిత్ర చాలానే ఉందా? శివాజీ మరణం తర్వాత.. ఆయన వారసత్వాన్ని ఎలా కొనసాగించాడు? శంభాజీ నాయకత్వంలో మరాఠా సామ్రాజ్యం ఎలా ఉండేది? మొఘలుల్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఛావా గురించి.. రియల్ హిస్టరీ ఏం చెబుతోంది?

ఛత్రపతి శివాజీ తర్వాత.. మరో శివాజీ!

31 ఏళ్లకే వీరమరణం పొందిన యోధుడు!

భయపెట్టడం తప్ప.. భయమే తెలియని రాజు.. ఛత్రపతి శంభాజీ మహారాజ్!

దక్కన్ కా శివ! మరాఠాల ఛత్రపతి.. శివాజీ మహారాజ్! కాలగమనంలో.. సింహం పడిపోయి ఉండొచ్చు. కానీ.. అప్పటికి సింహం పిల్ల బతికే ఉంది. అతడే.. ఛత్రపతి శంభాజీ మహారాజ్. మరాఠాల.. ఛావా! ఛత్రపతి శివాజీ పెద్దకొడుకుగా.. ఆయన మరణానంతరం ఆయన వారసుడిగా మరాఠా రాజ్యాన్ని పాలించాడు శంభాజీ. తండ్రికి ఏమాత్రం తగ్గకుండా.. తాను ఉన్నంత వరకు మొఘులల గుండెల్లో భయం అనే టైమ్ బాంబుని పెట్టిన మొనగాడు ఛావా! అతను.. మరాఠాల ఆత్మగౌరవమే కాదు.. హిందుత్వ అస్థిత్వం కూడా! అందుకే.. ఛావా ఇంతలా జనానికి కనెక్ట్ అయింది.

శివాజీ వారసుడిగా అధికారం చేపట్టిన శంభాజీ మహరాజ్

మొఘల్ సైన్యాలతో పోరాడి.. వారిని పరుగులు పెట్టించిన అతికొద్ది వీరుల్లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ ఒకరు. ఛత్రపతి శివాజీ కాలంలో దక్కన్‌ని ఆక్రమించుకునేందుకు.. నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయ్. ఒకానొక దశలో శివాజీతో మొఘలులు రాజీకి వచ్చారంటే.. ఆయన వీరత్వం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే.. శివాజీ ఆకస్మిక మరణంతో ఆయన వారసుడిగా అధికారం చేపట్టారు శంభాజీ మహరాజ్. దాదాపు 9 ఏళ్ల పాటు శివాజీ మహరాజ్‌లాగే.. మొఘలులపై పోరాటం సాగించారు.

హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా అలుపెరగని పోరాటం

హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా అలుపెరగని పోరాటం సాగించిన తండ్రి ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆశయాన్ని కొనసాగించేలా.. మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించారు శంభాజీ మహారాజ్. రాజ్యంలో అస్థిర పరిస్థితుల్ని చక్కదిద్దుతూ.. మరోవైపు మొఘలులతో పోరాడుతూ వచ్చారు. కేవలం హిందుత్వమే కాదు.. న్యాయబద్ధమైన పాలన, సంక్షేమంపైనా దృష్టిపెట్టారు. తన దేశభక్తి, ధైర్యసాహసాలు, నాయకత్వంతో.. భారత చరిత్రలో నిలిచిపోయారు. ఇంతటి గొప్ప హిందూ రాజుగా ఉన్న శంభాజీ మహరాజ్‌ గురించి.. చరిత్రలో పాఠ్య పుస్తకాల్లో ఎందుకు పెద్దగా ప్రస్తావన లేదనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవితంపై ఛావా అనే సినిమా

వాస్తవానికి.. చరిత్రలో ఛత్రపతి శివాజీకి ఉన్న చోటు మరో మరాఠా రాజుకు కనిపించదు. శివాజీ, శంభాజీ తర్వాత.. ఛత్రపతి రాజారామ్, షాహూ మహరాజ్, పీష్వా బాజీరావు, రఘునాథ రావు లాంటి వీరులెందరో ఉన్నారు. వారి పాలన, పోరాటాలు పెద్దగా తెరమీదికి రాలేదు. అయితే.. ఆ మధ్య బాలీవుడ్‌ నుంచి బాజీరావు మస్తానీ అనే సినిమా వచ్చింది. అందులో.. ప్రేమకథకే పెద్దపీట వేశారు. ఇన్నాళ్లకు.. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవితంపై ఛావా అనే సినిమా వచ్చింది. దాంతో.. శంభాజీ చరిత్రపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తర్వాతే.. శంభాజీ గురించి అంతా సెర్చింగ్ మొదలుపెట్టారు. నిజానికి.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించే కాదు.. శంభాజీ గురించి కూడా తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1657 మే 14న జన్మించిన శంభాజీ మహరాజ్

శంభాజీ మహారాజ్.. 1681 నుంచి 1689 వరకు మరాఠా రాజ్యాన్ని పాలించారు. 1657 మే 14న శివాజీ, సాయిబాలకు తొలి సంతానంగా జన్మించిన శంభాజీ.. రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఆయన బాల్యమంతా.. శివాజీ తల్లి జిజియాబాయి దగ్గరే గడిచింది. తర్వాతి కాలంలో పిలాజీ షిర్కే కుమార్తె జివుబాయిని ఆయన వివాహం చేసుకున్నారు. ఆవిడ.. యేసుబాయిగా పేరు మార్చుకున్నారు. ఛత్రపతి అయిన వెంటనే.. శంభాజీ తన తండ్రిలాగే మొఘలులతో యుద్ధం కొనసాగించాడు. 1682లో.. ఔరంగజేబు నాయకత్వంలో మొఘలులు దక్కన్‌ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం.. మరాఠా సామ్రాజ్యాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే.. శంభాజీ తనదైన వ్యూహంతో.. తన కంటే ఎంతో పెద్దదైన మొఘల్ సైన్యాన్ని గెరిల్లా యుద్ధ పద్ధతులతో.. అనేక యుద్ధాల్లో ఓడించాడు.

అనేక సైనిక దాడులకు శంభాజీ మహరాజ్ నాయకత్వం

శంభాజీ.. అనేక సైనిక దాడులకు నాయకత్వం వహించారు. అందులో.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొఘల్ పాలనలోని బుర్హాన్‌పూర్‌పై చేసిన దాడి. మరాఠా సైన్యం దాడి ఘోరంగా ఉండటంతో.. మొఘలులు భారీ నష్టాలను చవిచూశారు. శంభాజీ సైన్యం వరుస దాడులతో.. మొఘల్ పాలకులు 1685 వరకు మరాఠా సామ్రాజ్యంలో కొంత భాగాన్ని కూడా పొందలేకపోయారు. ఆ తర్వాత కూడా ఔరంగజేబు మరాఠా గడ్డపై దాడి చేసేందుకు తన ప్రయత్నాల్ని కొనసాగించాడు. కానీ.. శివాజీ దక్కన్‌ని జయించాలనే మొఘలుల ప్రయత్నాలకు శంభాజీ.. అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చారు.

దక్కన్‌లో పెద్దగా విజయం సాధించలేకపోయిన మొఘలులు

ఛావా పోరాటాన్ని.. మొఘలులు తట్టుకోలేకపోయారు. దాంతో.. దక్కన్‌లో మొఘలులు పెద్దగా విజయం సాధించలేకపోయారు. మరాఠా రాజ్యాన్ని కాపాడుకునేందుకు, హిందూ ధర్మ రక్షణకు.. 1682 నుంచి 1688 వరకు శంభాజీ మహరాజ్ అనేక పోరాటాలు సాగించారు. ఎన్ని కుట్రలు చేసినా.. రాజ్యంలో అంతర్గత విభేదాలున్నా.. మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించారు. తన తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించారు.

మొఘలులపై.. శంభాజీ చేసిన తిరుగుబాటుకు.. చరిత్రలో ప్రత్యేక పేజీలు

సర్వ మత సమానత్వంతో.. సువిశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధర్మ సూర్యుడు.. ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన అస్తమయాన్ని అవకాశంగా మలచుకుంది మొఘల్ వంశం. తమ అపార సైన్యంతో.. హిందూ రాజ్యాన్ని నామారూపాలు లేకుండా చేసేందుకు సిద్ధమయ్యాడు ఔరంగజేబు. ఆలయాలు కూల్చమన్నాడు, ఇస్లాం స్వీకరించని వారిని చిత్రహింసలు పెట్టాడు. ఈ అధర్మానికి వ్యతిరేకంగా.. యుద్ధభేరి మోగించినవాడే.. ఛత్రపతి శంభాజీ మహారాజ్. మొఘలులపై.. శంభాజీ చేసిన తిరుగుబాటుకు.. చరిత్రలో ప్రత్యేక పేజీలున్నాయి.

ప్రాణాలు అర్పించిన యోధుడు శంభాజీ మహరాజ్

హిందూ ధర్మ రక్షణ, హిందూ ధర్మ రాజ్య స్థాపన.. ఇదీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కన్న కల. దానిని నిజం చేసే క్రమంలోనే.. ప్రాణాలు అర్పించిన యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. 16 ఏళ్లకే ఖడ్గం ధరించి కదనరంగంలో దూకిన వీరుడు. రామనగర్‌లో.. మొఘల్ పాలకులపై భీకరమైన యుద్ధం చేసి.. శత్రువుల్ని తరిమి తరిమి కొట్టాడు. 1675-76లో కొంకణ్ తీరంలో పోర్చుగీసు మూకల్ని సముద్రం అవతలికి తరిమాడు. కర్ణాటకలో.. నిజాం, మొఘల్ సేనలకు.. తన సత్తా ఏమిటో చాటాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్ వేసిన పునాదుల్ని మరింత పటిష్టం చేస్తూ.. శంభాజీ మహారాజ్ ధర్మయుద్ధాలు కొనసాగించాడు. దెబ్బకి దెబ్బతీస్తూ.. మొఘలుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు.

హిందూ ధర్మ రాజ్య స్థాపనకు అలుపెరగని పోరాటం

నిజానికి.. ఛత్రపతి శంభాజీని ఔరంగజేబు చాలా తక్కువగా అంచనా వేశాడు. శివాజీ మరణంతో.. మరాఠాల రాజ్యం తమదే అనుకున్నాడు. హిందూ సామ్రాజ్యాన్ని శాశ్వతంగా అంతచేయగలనని విర్రవీగాడు. కానీ భాజీ మహరాజ్ మొఘలులకు సింహస్వప్నమై నిలిచాడు. తండ్రిబాటలోనే.. తన సేనల్ని నడిపించాడు. హిందూ ధర్మ రాజ్య స్థాపనకు కట్టుబడి.. అలుపెరగని పోరాటం కొనసాగించాడు.

హిందువులను హింసిస్తున్న వాళ్లని తరిమికొట్టిన శంభాజీ

లక్షల మంది సైన్యంతో మొఘలులు చేసిన దండయాత్రల్ని.. వీరోచితంగా తిప్పికొట్టాడు శంభాజీ. శంభాజీ ధాటికి తట్టుకోలేక.. ఔరంగజేబు.. 27 ఏళ్ల పాటు ఉత్తర భారతంలోకి అడుగుపెట్టలేకపోయాడు. కొద్దికాలంలోనే.. శంభాజీ మెరుపు వీరుడిలా విజృంభించాడు. కొంకణ్ తీరంలో బలవంతపు మత మార్పిళ్లతో హిందువుల్ని హింసిస్తున్న వాళ్లని.. తరిమికొట్టాడు. శంభాజీ పోరాటం వల్లే.. హిందూ ధర్మ రాజ్యం వేళ్లూనుకొని పటిష్టంగా నిలిచింది. అఖండ భారతమంతటికీ విస్తరించింది.

వెన్ను చూపకుండా శంభాజీ మహరాజ్ ధర్మపోరాటాలు

ఛత్రపతి శివాజీ అస్తమయం తర్వాత.. ఔరంగజేబు హిందూ ధర్మ రాజ్యాన్ని నాశనం చేసేందుకు కక్షకట్టాడు. తన సమస్త బలగాలని, యుద్ధాలను మరాఠాల మీదే కేంద్రీకరించాడు. అప్పుడు కూడా వెన్ను చూపకుండా.. శంభాజీ మహరాజ్ ధర్మపోరాటాలు కొనసాగించాడు. ఆయన చేసిన యుద్ధాల కారణంగానే.. బుందేల్‌ఖండ్, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో.. హిందూ రాజ్యాలు మొఘలుల బారిన పడకుండా మనుగడ సాగించాయ్. అయినప్పటికీ.. మొఘల్ సైన్యాలు నాసిక్ నుంచి చొరబడి తమ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు కుట్ర పన్నాయి.

నాసిక్ నుంచి సామ్రాజ్య విస్తరణకు మొఘలుల కుట్ర

ఔరంగజేబు సేనలు ఐదేళ్ల పాటు ఎన్ని దొంగ యుద్ధాలు చేసినా.. శంభాజీ నాయకత్వంలో మరాఠా యోధులు వాటన్నింటినిటి తిప్పికొట్టారు. తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి నేర్చుకున్న గెరిల్లా వ్యూహాలతో.. మొగలాయిలకు చుక్కలు చూపించారు. దక్షిణ కొంకణ్‌లోని సంగమేశ్వర్, రాజాపూర్, పనాల్హా, మల్కాపూర్, ప్రగఢ్, కోపాల్, బహదూర్బండా, సిర్హోలి లాంటి కోటల్ని నిలబెట్టుకునేందుకు.. మొఘలులతో నిత్యం పోరాడాడు శంభాజీ మహారాజ్.

స్వీయ మతధర్మంలోకి వచ్చేందుకు విభాగం ఏర్పాటు

మొఘలులు.. అనేక మంది హిందువుల్ని హింసించి, వేధించి మతమార్పిడి చేశారు. వారు.. తిరిగి హిందూ మతంలోకి వస్తామన్నా కొందరు అంగీకరించలేదు. వెంటనే స్పందించిన శంభాజీ.. అలాంటి వారంతా తిరిగి స్వీయ మతధర్మంలోకి వచ్చేందుకు తన పాలనలో.. ఏకంగా ఓ విభాగాన్నే ఏర్పాటు చేశాడు. ఈ విధమైన ఏర్పాటు చేసిన మొట్టమొదటి ధర్మప్రభువు.. ఛత్రపతి శంభాజీ మహరాజ్ ఒక్కరే. 1689లో.. కొంకణ్ ప్రాంతంలోని సంగమేశ్వర్ దగ్గర ఓ గ్రామంలో.. శంభాజీ తన కమాండర్లతో రహస్యంగా సమావేశమయ్యారు. ఆయన బావమరిది అయిన గాణోజీ షిర్కి.. అత్యంత హేయమైన ద్రోహానికి ఒడిగట్టాడు.

పథకం ప్రకారం శంభాజీపై పెద్ద ఎత్తున మొఘలుల దాడి

ఈ రహస్య సమావేశానికి సంబంధించిన సమాచారం.. కొన్నిరోజుల ముందుగానే.. మొఘలులకు అందించాడు. వారితో చేతులు కలిపి.. పథకం ప్రకారం శంభాజీపై పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈ దాడిలో.. శంభాజీ మహరాజ్‌ని, అతని సలహాదారుడు కవికలశ్‌ని బందీలుగా పట్టుకున్నారు. ఇస్లాం మతం స్వీకరిస్తే.. ప్రాణాలతో వదిలేస్తానన్నాడు ఔరంగజేబు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా.. హిందువుగానే జీవిస్తాను.. హిందువుగానే మరణిస్తానన్నాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. హిందూ ధర్మం అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుందని.. తాము మరణించినా సత్యం, ధర్మం జయిస్తామని నినదించి.. అమరులయ్యారు.

మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనానికి అనేక ప్రయత్నాలు

శంభాజీ మహారాజ్ పాలనలో.. మొఘల్ దళాలు మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశాయ్. కానీ.. బీజాపూర్, గోల్కొండ తప్ప.. ఇతర ప్రాంతాల్ని స్వాధీనం చేసుకోలేకపోయాయ్. మొఘల్ పాలకులు చివరి క్షణం దాకా.. దక్కన్‌ని స్వాధీనం చేసుకోలేకపోయారు. ఔరంగజేబు మరణం తర్వాత.. మొఘల్ సామ్రాజ్యం నిరంతరం క్షీణించింది. కానీ.. ఛత్రపతి శంభాజీ మహరాజ్ మరణం తర్వాత కూడా.. మరాఠా సామ్రాజ్యం కొనసాగిందంటే.. మరాఠా యోధుల బలమేంటో అర్థం చేసుకోవచ్చు.

ఛావా సినిమాతో శంభాజీ పరాక్రమం గురించి మళ్లీ చర్చ

మొత్తానికి.. ఛావా సినిమాతో.. శంభాజీ మహారాజ్ పరాక్రమం గురించి మళ్లీ చర్చ జరుగుతోంది. ఈ సినిమాపై.. అంతటా ప్రశంసల జల్లు కురుస్తోంది. హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా.. తన పోరాటం సాగించిన ఛత్రపతి శివాజీ మహారాజ్.. మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తే.. ఆయన వారసుడిగా.. దాదాపు తొమ్మిదేళ్ల పాటు అదే పోరాటాన్ని కొనసాగించి.. హిందూ ధర్మ రక్షణకు తన జీవితాన్ని అర్పించాడు ఛత్రపతి శంభాజీ మహరాజ్. అందుకే.. ఛావా సినిమాకు ఇండియా ఇంతలా కనెక్ట్ అయింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ గొప్పతనాన్ని.. గుండెలకు హత్తుకుంటోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×